ఇక హన్మకొండ, వరంగల్‌ జిల్లాలు

ABN , First Publish Date - 2021-06-22T05:38:14+05:30 IST

వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చుతున్నట్టు సీఎం ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు ఇప్పటి వరకు ప్రత్యేకంగా జిల్లా కేంద్రం లేదు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోనే రూరల్‌ జిల్లా కార్యాలయాలు కొనసాగుతున్నాయి.

ఇక హన్మకొండ, వరంగల్‌ జిల్లాలు
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు భూమి పూజ చేస్తున్న సీఎం కేసీఆర్‌

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పేర్లు మార్చుతున్నాం
వరంగల్‌ పట్టణం కేంద్రంగా ‘వరంగల్‌ జిల్లా’
కొత్త కలెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తాం
33 అంతస్థుల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి
రూ.3 వేల కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం
నూతన డెంటల్‌ కళాశాల, ఆస్పత్రి మంజూరు
ముుఖ్యమంత్రి కేసీఆర్‌
నగరంలో సుడిగాలి పర్యటన


వరంగల్‌ అర్బన్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చుతున్నట్టు సీఎం ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు ఇప్పటి వరకు ప్రత్యేకంగా జిల్లా కేంద్రం లేదు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోనే  రూరల్‌ జిల్లా కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ఉపన్యాసంలో హన్మకొండ, వరంగల్‌ జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరి,  సీఎంకు   వినతి పత్రం అందజేశారు. దానిపై స్పందించిన కేసీఆర్‌...  రెండు చారిత్రక నగరాలైన వరంగల్‌-హన్మకొండ ప్రాంతాల సరిహద్దులను సర్దుబాటు చేసి వరంగల్‌, హన్మకొండ జిల్లాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సోమవారం నగరంలో పర్యటించిన సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.

సెంట్రల్‌ జైలు స్థలంలో ఏకంగా 33 అంతస్థుల్లో అధునాతన ఆస్పత్రిని నిర్మించనున్నట్టు ప్రకటించారు. ‘భవిష్యతు తరాలను దృష్టిలో ఉంచుకుని  హెలీకాప్టర్‌ సైతం ఆస్పత్రి  పైఅంతస్తులో దిగే విధంగా హెలీపాడ్‌ నిర్మించాలి..  ఇపుడున్న ఎంజీఎం ఆస్పత్రిని కూల్చివేసి  ఆ స్థలంలో అన్ని సౌకర్యాలతో కూడిన మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం..  ఇందుకోసం రెండు మూడు వేల కోట్ల రూపాయలైనా ఫర్వాలేదు.. డబ్బులకు వెనుకాడేది లేదు.. పనులు మాత్రం ఆలస్యం కావొద్దు..  28 గంటల్లోనే 10 అంతస్తుల భవనాన్ని  నిర్మించిన చైనా వారినైనా తీసుకువచ్చి రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేయాలి. దేవుడు కరుణించి, సల్లగా బతికితే . ఏడాదిన్నర లోపే ఈ ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేస్తే నేనే వచ్చి ప్రారంభానికి కొబ్బరి కాయ కొడుతాను..’ అని కేసీఆర్‌ చెప్పారు.

వరంగల్‌కు డెంటల్‌ కళాశాల, దీనికి అనుబంధ ఆస్పత్రినిఈ రోజే మంజూరి చేస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు కరతాళ ధ్వనుల మధ్య సీఎం ప్రకటించారు. మాతా శిశు సంరక్షణ అనేది అతి ముఖ్యమైన అంశం.  ఎంజీఎం ఆస్పత్రి స్థలంలో అద్భుతమైన మాతాశిశు సంరక్షణ  కేంద్రం నిర్మించాలి.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది అద్భుతమైన  సేవలు అందిస్తున్నారు. వారి సేవలను ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించాలి.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గొప్పగా సేవలు అందిస్తున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని కేసీఆర్‌  అన్నారు. సేవలు కొనియాడక పోగా కొంతమంది దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరియైున పద్దతి కాదు.. డాక్టర్ల సేవలను గుర్తించాలి.. అభినందించాలి..’ అని కేసీఆర్‌ ప్రజా ప్రతినిధులను, ప్రజలను కోరారు..

వరంగల్‌ నగరానికి అతి పురాతమైన చరిత్ర ఉందని,  వరంగల్‌లో ఇప్పటి వరకు కలెక్టరేట్‌ భవనాలకు ప్రత్యేకత ఉందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ‘అప్పటి ప్రభువులు వరంగల్‌కు వేట కోసం వచ్చేవారు.. సేద తీరేందుకు ఈ భవనాలను ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో సుబాలుగా మారి సుబేదార్‌ ఇక్కడ ఉండేవాడు..  ఆ తర్వాత  ఇవి కలెక్టర్‌ కార్యాలయాలుగా మా రాయి.. వరంగల్‌ కలెక్టర్‌ నివాస భవనాన్ని కూడా కూల్చి వేసి సరికొత్తగా అధునాతన భవనాన్ని జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ముఖ్య అధికారుల నివాస భవనాలు సువిశాలంగా ఉండేటట్టు నిర్మించాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలోనే ప్రత్యేకంగా హెలీపాడ్‌ ఉండేటట్టు నిర్మాణం చేపట్టాలి..’ అని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.  ‘జిల్లా కలెక్టర్‌ అన్న పదమే సరియైుంది కాదు. బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటయిన ఈ పద్దతిలో  కలెక్టర్‌ అంటే కలెక్ట్‌ చేసేవాడు అని అర్థం.. అప్పట్లో ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదయ వనరు.. భూమి శిస్తును వసూలు చేసేవాడు కలెక్టర్‌ అని పిలిచేవారు.. నా అభిప్రాయం ప్రకారం అయితే జిల్లా కలెక్టర్‌ అన్న పేరును మార్చేయ్యాలి..’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

‘గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలి. మనిషి చనిపోయినప్పుడు కూడా గౌరవ ప్రదంగా సాగనంపాలి.. అందుకోసమే వైకుంఠధామాలు ఏర్పాటు చేసాం.. అదే విదంగా వచ్చే నెల 1 నుంచి 10 తేదీ వరకు మరోసారి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలి.. ఇందుకోసం ఈ నెల 26న హైదరాబాద్‌లో మంత్రులు, జిల్లా కలెక్టర్‌లు ఇతర ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

దేవాదుల నీళ్లు వరంగల్‌కే అంకితం
‘దేవాదుల ప్రాజెక్ట్‌ నిర్మాణం దాదాపు పూర్తయింది. కొద్ది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సమ్మక్క బ్యారేజ్‌ పూర్తయింది. దేవాదుల ప్రాజెక్ట్‌కు ఇంద్రావతి, ప్రాణహిత నీళ్లు వస్తుంటాయి. ఇప్పటికే దేవాదుల నీటితో నిండిపోయింది. 7.5 టీఎంసీల నీళ్లు ఎప్పటికీ నిల్వ ఉంటాయి. ఈ మొత్తం నీటిని వరంగల్‌ అవసరాలకే ఉపయోగించాలి. వరంగల్‌లో కరువు మాయం కావాలి. ఇందుకోసం త్వరలోనే మంత్రులు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు.. సీఎంవో ప్రత్యేక అధికారి స్మితాసబర్వాల్‌తో చర్చించండి. త్వరలోనే హైదరాబాద్‌లోనే సమావేశం ఉంటుంది. రూ.100కోట్ల స్పెషల్‌ గ్రాంట్‌ ఇప్పిస్తా’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కాగా, ఈ కార్యక్రమాల్లో చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోఢ్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌,  మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి , ఎంపీలు బండాప్రకాశ్‌, దయాకర్‌, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌, ఆరూరి రమేశ్‌, డాక్టర్‌ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఇలా..
మధ్యాహ్నం 1.10 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గ్రౌండ్‌కు హెలికాప్టర్‌ ద్వారా చేరిక
1.25 గంటలకు అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన ప్రత్యేక బస్సులో బాలసముద్రంలోని జయశంకర్‌ స్మృతివనానికి చేరుకున్నారు. జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
1.30 గంటలకు  కేఎంసీలోని కాళోజీ నారాయణ రావు హెల్త్‌ యూనివర్సిటీకి చేరుకొని కాళోజీ విగ్రహానికి నివాళి అర్పించారు.
2.04 గంటలకు కాళోజీ నారాయణ రావు హెల్త్‌ యూనివర్సిటీ పరిపాలన భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
2.20 గంటలకు వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ చేశారు.  
2.50 గంటలకు సుబేదారిలో నూతనంగా నిర్మించిన సమీకృత వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం చేశారు.
4.45 గంటలకు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో మధ్యాహ్న భోజనం
5.30 గంటలకు తిరుగు ప్రయాణం

కేయూసీ విద్యార్థుల నిరసన
సీఎం రాక సందర్భంగా కేయూ విద్యార్ధులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన జరిపారు. సెంట్రల్‌ జైలు ఆవరణలో మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో  పాల్గొన్న అనంతరం సీఎం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభించేందుకు వస్తుండగా,  కలెక్టరేట్‌ సమీపంలో కేయూ విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి హఠాత్తుగా రోడ్ల మీద ప్రత్యక్షమయ్యారు. ఉద్యోగా ల నోటిఫికేషన్‌ను వెంటనే జారీ  చేయాలనీ, సీఎం గోబాక్‌  అంటూ నినాదాలు చేస్తూ  సీఎం కాన్వాయ్‌కి అడ్డంగా వెళ్లే ప్రయత్నం చేశారు. అయి తే పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.











Updated Date - 2021-06-22T05:38:14+05:30 IST