ఇప్పుడెట్లబ్బా!

ABN , First Publish Date - 2022-07-05T06:06:03+05:30 IST

పంచాయతీ ఉద్యోగుల బదిలీల్లో ఏదో అనుకుంటే మరేదో జరిగిపోయింది.

ఇప్పుడెట్లబ్బా!
డీపీఓ కార్యాలయం పైల్‌పోటో

అనంతపురం న్యూటౌన, జూలై 4: పంచాయతీ ఉద్యోగుల బదిలీల్లో ఏదో అనుకుంటే మరేదో జరిగిపోయింది. ఏకపక్షంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అయింది. ప్రభుత్వం నుండి మిన హాయింపులు ఉన్నవారిని సైతం పరిగణనలోకి తీసుకో కుండా బదిలీల ప్రక్రియ చేపట్టడంతో సమస్య తీవ్రమైంది. కొన్ని సిఫార్సులను సైతం పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేసేయడం డీపీఓకు తలనొప్పిగా మారింది. పంచాయతీ సిబ్బంది బదిలీల బాగో తం కలెక్టర్‌ చెవిన పడినట్లు తెలిసింది. దీంతో ఆదివారం డీపీఓను పిలిపించి ‘ఏమిటి సంగతి? మీఇష్టం. రీప్రొసీడింగ్స్‌ ఇచ్చే పరిస్థితే లేదు. తప్పిదాలను ఎలా సరిదిద్దుకుంటారో మీ ఇష్టం’ అంటూ తీవ్ర స్థాయిలో క్లాస్‌ పీకినట్లు సమాచారం. దీంతో డీపీఓ ప్రభాకర్‌రావు ఇరకాటంలో పడ్డారన్న చర్చ జరుగుతోంది.  


క్లాస్‌ పీకిన నాయకులు 


పంచాయతీ సిబ్బంది బదిలీల్లో భాగంగా ఏకపక్ష నిర్ణ యాలతో స్థానిక నాయకుల నుంచి డీపీఓ వ్యతిరేకత మూ టకట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాయకుల సిఫార్సుల కు అనుగుణంగా బదిలీలు చేస్తే ప్రభుత్వ నిబంధనలు అడ్డం వస్తాయి. ప్రభుత్వ నిబంధనలు అమలు చేద్దామం టే నాయకుల సిఫార్సులను అమలు చేయలేని పరిస్థితి. ఈక్రమంలో పలు ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు ఫోన చేసి క్లాస్‌ పీకినట్లు తెలిసింది. 

రీప్రొసీడింగ్స్‌ ఇస్తాం


నాయకుల ఒత్తిళ్లు భరించలేక, ఉన్నతాధికారులను మెప్పించి రీప్రొసీడింగ్స్‌ ఇచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో మొదట జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి రీప్రొసీడింగ్స్‌ కూడా సిద్ధం చేశారు. వీటికి కలెక్టర్‌ నాగలక్ష్మి అభ్యంతరం చెప్పడంతో డీపీఓ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని సిబ్బంది చెప్పుకుంటున్నారు.


ప్రభుత్వ నిబంధనల అమలేదీ?


 ఒంటరి మహిళలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బదిలీల్లో కొంత వరకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు. అయితే వాటిని కూడా పట్టించుకోకుండా డీపీఓ కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపట్టడం అందరికి తలనొప్పిగా మారింది. వాటిలో కొన్ని పరిశీలించినట్లయితే.. ఆత్మకూరు పంచాయతీ సెక్రటరీగా పని చేసే లక్ష్మీనరసమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది.  తప్పనిసరి బదిలీ  చేయాల్సి వస్తే సమీపంలోని పంచాయతీలకు లేదా ఆ మండలంలో మరో పంచాయతీకో మార్చవచ్చు. ఆమెను ముదిగుబ్బకు బదిలీ చేశారు. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు పంచాయతీ సెక్రటరీ అంజలి దివ్యాంగురాలు. ఆమెను కూడేరుకు బదిలీ చేశారు. తిరిగి తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా రెడ్డిపల్లికి రీప్రొసీడింగ్స్‌ తయారు చేసినట్లు తెలిసింది. ఇలా నిబంధనలను తుంగలో తొక్కిన జాబితా పెద్దదిగానే ఉంది.


జాయిన అవుతామన్నా.. చెర్చుకోరే!


బదిలీల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో పంచాయతీ సెక్రెటరీలను చేర్చుకోవడానికి స్థానిక నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో వారు డీపీఓ కార్యాలయానికి తమ గోడు చెప్పకోవడానికి వస్తే స్పందించే నాథుడే లేడు.  హైమావతి అనే పంచాయతీ సెక్రటరీ కూడేరు నుంచి సీకేపల్లి మండలానికి బదిలీ అయింది. బదిలీ ఉత్తర్వులు తీసుకొని జాయిన అవ్వడానికి వెళితే అక్కడ జాయిన చేసుకోవడం లేదని ఆదివారం డీపీఓ కార్యాలయానికి వచ్చింది. ఇలా ఎంతో మంది సిబ్బందికి అధికారుల తప్పిదాలతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పాటు అనంతపురం రూరల్‌ మండలంలో కేవలం 5 కిమీటర్ల విస్తీర్ణంలోనే బదిలీలు చేశారు. అయితే వారిని సైతం ప్రస్తుతం బదిలీ అయిన ప్రాంతాల్లో మీ అవినీతి మరకలు మాకోద్దు అంటూ జాయిన చేసుకోవడానికి స్థానిక నాయకులు అడ్డు తగులుతున్నట్లు తెలిసింది. 


సొంత మండలంలో పోస్టింగ్‌..?


ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొంత మండలానికి బదిలీ చేయడానికి లేదు. వీటిని కూడా తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారు. మచ్చుకు కొన్ని పరిశీలిస్తే .. కందుకూరుకు చెందిన నరసింహారెడ్డి నారాయణపురం పంచాయతీలో 4 సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం  రుద్రంపేటకు బదిలీ చేశారు. మల్లికార్జునరెడ్డిది కందుకూ రు గ్రామం. ఈయన్ను బుక్కరాయసముద్రం నుండి చియ్యేడుకు  బదిలీ చేశారు.  


కమిషనర్‌ ఉత్తర్వులు బేఖాతార్‌


బదిలీ ఉత్తర్వుల్లో భాగంగా కమిషనర్‌ నుండి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఏ గ్రేడ్‌కు చెందిన వారు ఆ గ్రేడ్‌లోనే ఉండాలి. వాటిని అతిక్రమిస్తే.. వేతనా లు మంజూరుకావడం కష్టమని కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయినా వాటని కూడా తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా బదిలీలకు శ్రీకారం చుట్టారు.  శ్రీరాములు గ్రేడ్‌-3 సెక్రటరీ, వజ్రకరూరు మండలంలో గ్రేడ్‌-4 స్థానానికి బదిలీ చేశారు. ఇలా పెద్ద ఎత్తున బదిలీల్లో కమిషనర్‌ ఉత్తర్వులను తుంగలో తొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Updated Date - 2022-07-05T06:06:03+05:30 IST