ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిల్లులు చెల్లించాలి

Aug 2 2021 @ 23:20PM
ఎమ్మిగనూరులో ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

  1. హైకోర్టు ఆదేశాలనూ పాటించరా? 
  2. వైసీపీ పాలనలో గ్రామాభివృద్ధికి గ్రహణం 
  3. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి 


ఎమ్మిగనూరు, అగస్టు2: మూడేళ్లుగా రాష్ట్రంలో   ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, ఈ విషయంపై కోర్టు తీర్పులను సహితం అమలు చేయడం లేదని టీడీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి. ఎమ్మిగనూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును కూడా పాటించడం లేదని విమర్శించారు.  గత టీడీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో రూ. 6408 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఎల్‌ఈడీ దీపాలు, గ్రామపంచాయతీ భనాల నిర్మాణం, శ్మశానవాటికలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. దాదాపు రూ. 5694 కోట్లతో 40వేల కి.మీ సీసీ రోడ్లు, గ్రావెల్‌ రోడ్లు నిర్మించిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి గ్రహణం పట్టిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ నం. 350ని తెచ్చి గ్రామాల్లో దాదాపు రూ. 3118 కోట్ల విలువైన పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారని ఆరోపించారు. 2019 జూన్‌1 తరువాత చేపట్టిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇది ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చట్టానికి పూర్తిగా విరుద్ధమన్నారు. చట్టం ప్రకారం వరుసక్రమంలో బిల్లులు చెల్లించాల న్నారు. వాస్తవంగా 2019-20, 2020-21కి కలిపి కేంద్రప్రభుత్వం రూ. 4594కోట్లు నిధులను విడుదల చేసిందని, దీనికి రాష్ట్రం రూ. 1531కోట్లు కలిపి రూ. 6125 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, వైసీపీ ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం విడుదల చేయలేదంటోందని అన్నారు. విజిలెన్స్‌ విచారణ పేరుతో కాలయాపన చేయటమేగాక కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. 


 హైకోర్టు ఆదేశాలను పాటించి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం రాష్ట్రకమిటీ  పిలుపుమేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఎమ్మిగ నూరులో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రామలింగారెడ్డి, సోమేశ్వరరెడ్డి, జయన్న, కొండన్న గౌడ్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయంలో నిర్వహించిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిలుల్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని  వివర్శించారు.  న్యాయస్థానం తీర్పులను అమలు చేయకపోవడం ఏమిటని మండిపడ్డారు. అనంతరం ఎంపీడీఓ బంగారమ్మకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగన్న, రఘు, శంకర్‌గౌడ్‌, సుశీలయ్య పాల్గొన్నారు.


గోనెగండ్ల: ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2018-19 ఆర్థిక సంవత్సరం జరిగిన పనుల బిల్లులను ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్‌లకు విడుదల చేయాలని గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, ఎస్సీ సెల్‌ మండల నాయకులు కీర ఎర్రన్న, బేతాళ బడేసా, టౌన్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌నాయుడు మాట్లాడుతూ గత రెండేళ్ల కింద ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన కాంట్రాక్ట్‌ పనుల బిల్లులు ఇప్పటి వరకు విడుదల కాకపోవడం శోచనీయం అన్నారు. ఈ విషయంలో హైకోర్టు కలుగజేసుకొని జూలై నెల 31 లోపు బిల్లులు విడుదల చేయాలని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల తిరుపతయ్యనాయుడు, మాజీ సర్పంచ్‌ రంగముని, దరగలమాబు, యూనూస్‌ తదితరులు పాల్గొన్నారు. 


మంత్రాలయం: ఉపాధి కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రాలయంలో టీడీపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. ముందుగా టీడీపీ కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్‌ వరకు అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్రాన్ని అప్పల రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్‌దే అన్నారు. ఉపాధి కూలీలకు రూ. 4వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను సహితం ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించి కూలీలకు వేతనాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పన్నగ వెంకటేశ్‌, బూదూరు మల్లికార్జునరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, చావిడి వెంకటేశ్‌, చెన్న బసప్ప, సురేష్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, సుదీర్‌రెడ్డి, అబ్దుల్లా, లక్ష్మయ్య, వగరూరు రామిరెడ్డి, నరసన్నచారి. వీరేష్‌, చంద్ర, నరసింహులు పాల్గొన్నారు. 


ఆదోని రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పులను కూడా పాటించకుండా కాలరాస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌పై పార్టీ అధి నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఆదేశాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సోమవారం  ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఎంపీడీవో గీతావాణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ కార్యదర్శి బుద్దారెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డు అధ్యక్షుడు దేవేంద్రప్ప, భాస్కర్‌రెడ్డి, జిల్లా నాయకులు నల్లన్న మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ నిధులను ఈ నెల 1 లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఽఅలు చేయడం లేదని, ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డనగేరి శివప్ప, ఫకృద్దీన్‌, గుడిసె శ్రీరాములు, రాము, మల్లికార్జున, తిమ్మప్ప, నాగరాజు, మాధవ, ప్రతాప్‌రెడ్డి, వీరేశ్‌ పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.