కూలీల కష్టం బీనామీల పరం!

ABN , First Publish Date - 2021-04-24T03:44:08+05:30 IST

ఉపాధి హామీ పథకం గాడి తప్పింది. కూలీల కష్టం ఎవరికి ఉపాధి కల్పిస్తుందో తెలియడం లేదు. వలసల నివారణే లక్ష్యంగా పనులు కల్పిస్తున్నామంటూ అధికారులు కాగితాల్లో కాకి లెక్కలు చూపుతున్నా, క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

కూలీల కష్టం బీనామీల పరం!
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

అక్రమార్కులకు కల్పతరువుగా ఉపాధి హామీ పధకం

పనులకు వెళ్లకున్నా మస్టర్లలో హాజరు నమోదు                                  

సీతారామపురం, ఏప్రిల్‌ 23: ఉపాధి హామీ పథకం గాడి తప్పింది. కూలీల కష్టం ఎవరికి ఉపాధి కల్పిస్తుందో తెలియడం లేదు. వలసల నివారణే లక్ష్యంగా పనులు కల్పిస్తున్నామంటూ అధికారులు కాగితాల్లో కాకి లెక్కలు చూపుతున్నా, క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కూలీలకు ఉపాధి దేవుడికెరుక కానీ.. అక్రమార్కులకు మాత్రం అది కల్పతరువుగా మారింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కొందరు పనులకు వెళ్లకున్నా మస్టర్లలో  హాజరు వేస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులు జరిగేటప్పుడు అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ పథకంలోని సిబ్బందితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్న అక్రమార్కులకు మూడు పవ్వులు ఆరు కాయలుగా ఆదాయం విరాజిల్లుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. పనులు చేసిన వారికి, చేయని వారికి ఒకే విధమైన కూలీని మంజూరు చేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. సీతారామపురం మండలంలో 6,849 జాబ్‌కార్డులు ఉండగా, రోజుకు 2,500 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరిలో పనులు చేసే కూలీల సంఖ్య తక్కువ కాగా, బినామీల సంఖ్యే ఎక్కువనేది నగ్న సత్యం. అక్రమార్కులకు కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకరిస్తుండటంతోనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.  మండలంలో పూడికతీత, చెక్‌డ్యామ్‌, ఫీడర్‌ ఛానల్‌ తదితర పనులు జరుగుతున్నాయి. ప్రతి పనికి పర్సంటేజీలకు అలవాటుపడిన ఉపాధి సిబ్బంది చోటా నాయకులకు సహకరిస్తూ యంత్రాలకు పనులు కల్పిస్తూ, మస్టర్లలో బినామీలకు హాజరు వేసి కూలీల కడుపు కొడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలంలో జరుగుతున్న ఉపాధిహామీ పథకంలోని అక్రమాలకు అడ్డుకట్ట వేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.


విచారణ చేపడతాం 

ఉపాధి పనుల్లో కూలీలకు అన్యాయం, బినామీలకు న్యాయం జరుగుతుందన్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడతాం. వాస్తవాలు బయటపడితే అక్రమార్కులతోపాటు, వారికి సహకరిస్తున్న సిబ్బందిపైనా చర్యలు తీసుకుని కూలీలకు న్యాయం చేస్తాం.

- విజయ్‌కుమార్‌, ఏపీడీ

Updated Date - 2021-04-24T03:44:08+05:30 IST