బంగారునాయుడు కుటుంబాన్ని అతనే చంపేశాడని చెప్పొద్దు ప్లీజ్!

ABN , First Publish Date - 2021-04-17T10:55:00+05:30 IST

ఎన్‌ఆర్‌ఐ బంగారునాయుడు కుటుంబాన్ని పెద్ద కుమారుడే చంపేశాడని పోలీసులు చెబుతున్నారని, దయచేసి అలా ప్రచారం చేయవద్దని ఆయన బంధువులు శుక్రవారం అధికారులను అభ్యర్థించా

బంగారునాయుడు కుటుంబాన్ని అతనే చంపేశాడని చెప్పొద్దు ప్లీజ్!

మాకు అలాంటి అనుమానాల్లేవు

పోలీసులకు బంధువుల అభ్యర్థన

రెండో రోజూ కొనసాగిన దర్యాప్తు

ఆస్తులు సీజ్‌ చేసేందుకు యత్నం

పూర్తయిన అంత్యక్రియలు

విశాఖపట్నం/కొమ్మాది, గంట్యాడ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):  ఎన్‌ఆర్‌ఐ బంగారునాయుడు కుటుంబాన్ని పెద్ద కుమారుడే చంపేశాడని పోలీసులు చెబుతున్నారని, దయచేసి అలా ప్రచారం చేయవద్దని ఆయన బంధువులు శుక్రవారం అధికారులను అభ్యర్థించారు. ఈ ఘటనపై గురువారం ఉదయం దర్యాప్తు ప్రారంభించిన పోలీసు అధికారులు.. ఫ్లాట్‌లో లభించిన ఆధారాలను బట్టి తండ్రి బంగారునాయుడు, తల్లి నిర్మల, తమ్ముడు కశ్య్‌పలను పెద్ద కుమారుడు దీపక్‌ కత్తితో పొడిచి చంపి ఉంటాడని బలంగా విశ్వసిస్తున్నారు. అదే అభిప్రాయాన్ని మీడియా ముందు కూడా వ్యక్తం చేశారు.


అయితే బంగారునాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చిన బంధువులు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఏమి జరిగిందో తెలియదంటూనే.. కుటుంబ సభ్యులను చంపేంత అవసరం, ఆ తరహా క్రూరమైన తత్వం దీపక్‌లో లేవని, తమకు అతను బాగా తెలుసునని వారు చెబుతున్నారు.  ఏదో జరిగిందని, దానిని పోలీసులు దర్యాప్తు చేసి, బయట పెట్టాలని కోరుతున్నారు.  


సీన్‌ రీ క్రియేషన్‌

ఫ్లాట్‌లో గొడవ జరిగిన తరువాత ఏమి జరిగి ఉంటుందనే దానిపై పోలీసులు అక్కడ సీన్‌ రీ క్రియేషన్‌ చేశారు.  మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.  దీపక్‌కు ఇతరులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్యలు జరిగిన రాత్రి వారి ఫ్లాట్‌లోకి బయటనుంచి అయితే ఎవరూ రాలేదనే విషయాన్ని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. కాగా, బంగారునాయుడు ఆస్తులు చేతులు మారకుండా   సీజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 


పూర్తయిన అంత్యక్రియలు

బంగారునాయుడు కుటుంబసభ్యుల మృతదేహాలకు విజయనగరం జిల్లా గంట్యాడలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. వారి విషాదాంతాన్ని తలుచుకొని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - 2021-04-17T10:55:00+05:30 IST