ఇండియా టు యూఏఈ.. ఎయిరిండియా విమానంలో ఒకే ఒక్క‌డు!

ABN , First Publish Date - 2021-06-24T18:02:33+05:30 IST

దుబాయ్‌కు చెందిన భార‌తీయ వ్యాపార‌వేత్త‌, సామాజిక కార్య‌క‌ర్త ఎస్‌పీ సింగ్ ఓబెరాయ్‌ యూఏఈ గోల్డెన్ వీసా క‌లిగి ఉన్నారు.

ఇండియా టు యూఏఈ.. ఎయిరిండియా విమానంలో ఒకే ఒక్క‌డు!

యూఏఈ: దుబాయ్‌కు చెందిన భార‌తీయ వ్యాపార‌వేత్త‌, సామాజిక కార్య‌క‌ర్త ఎస్‌పీ సింగ్ ఓబెరాయ్‌ యూఏఈ గోల్డెన్ వీసా క‌లిగి ఉన్నారు. దీంతో బుధ‌వారం ఆయ‌న అమృత్‌స‌ర్ నుంచి దుబాయ్ వెళ్లారు. ఇందులో కొత్తేమి ఉంద‌నేగా మీ అనుమానం. అక్క‌డికే వ‌స్తున్నాం. సింగ్ ప్ర‌యాణించిన ఎయిరిండియా విమానం 929లో ఆయ‌న ఒక్క‌రే ఉన్నారు. ఇలా సోలోగా ఇండియా టు దుబాయ్ వెళ్లారు సింగ్ సాబ్‌. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో భార‌త విమానాల‌పై యూఏఈ నిషేధం విధించింది. కానీ, గోల్డెన్ వీసాతో పాటు ఇత‌ర కొన్ని కేట‌గిరీల వారికి మిన‌హాయింపు ఇచ్చింది. దాంతో గోల్డెన్ వీసా క‌లిగిన సింగ్.. దుబాయ్ వెళ్లేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఇక ఆయ‌న దుబాయ్ ప్ర‌యాణం కోసం విమాన టికెట్‌ను 740 దిర్హ‌మ్స్‌(భార‌త క‌రెన్సీలో రూ.14,800)కు కొనుగోలు చేసిన‌ట్లు తెలిపారు. విమానం ఎక్కేవ‌ర‌కు అందులో ప్ర‌యాణించేది తాను ఒక్క‌డినే అనే విష‌యం త‌న‌కు కూడా తెలియ‌ద‌ని సింగ్ చెప్పారు. ఆ భారీ విమానంలో ఇలా తానొక్క‌డినే ప్ర‌యాణించ‌డం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని తెలిపారు. ఇక దుబాయ్ విమానాశ్ర‌యంలో దిగిన త‌ర్వాత క‌రోనా ప‌రీక్ష కోసం అధికారులు త‌న‌ను తీసుకెళ్లే స‌మ‌యంలో మిగ‌తా ప్ర‌యాణికుల గురించి వాకాబు చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కానీ, ఆ విమానంలో వ‌చ్చింది తానొక్క‌డినేన‌ని చెప్ప‌డంతో వారంతా షాక్ అయ్యార‌ని సింగ్ చెప్పుకొచ్చారు.   

Updated Date - 2021-06-24T18:02:33+05:30 IST