NRI bonds: ఎన్నారై బాండ్లతో రూపాయి పతనానికి బ్రేకులు..!

ABN , First Publish Date - 2022-09-30T23:56:02+05:30 IST

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతోంది. దీన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ముందున్న మార్గాలేంటి..? అంటే..

NRI bonds: ఎన్నారై బాండ్లతో రూపాయి పతనానికి బ్రేకులు..!

ఎన్నారై డెస్క్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతోంది. దీన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ముందున్న మార్గాలేంటి..? అంటే.. పలు పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ విపణిలో ఎన్నారై బాండ్ల విక్రయాలు మొదలు.. బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడం వరకూ ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.. 


ఏమిటీ ఎన్నారై బాండ్స్..

రిజర్వ్ బ్యాంకు ఎన్నారైల కోసం జారీ చేసే సెక్యూరిటీలను ఎన్నారై బాండ్స్(NRI Bonds) అని అంటారు. భారత్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు ఎన్నారై బాండ్స్ ద్వారా తమ నిధులను భారత్‌లోకి మళ్లించవచ్చు. 

ఎన్నారై బాండ్స్ విక్రయాలతో భారత్‌లోకి డాలర్ నిధుల రాకడ పెంచవచ్చని ఆర్‌బీఐ భావిస్తోంది. తద్వారా.. రూపాయి విలువ పడిపోకుండా బ్రేకులు వేయాలనేది ఆర్‌బీఐ వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్నారై బాండ్స్ కొనుగోలు చేసే క్రమంలో డాలర్లను రూపాయిల్లోకి మార్చుకోవాల్సి వస్తుందని, ఫలితంగా ఫారెక్స్ విపణిలో రూపాయికి డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ మరింత పతనం కాకుండా అడ్డుకట్ట పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 


ప్రస్తుతం దేశంలోని డాలర్ నిల్వలను(Forex reserve) వెచ్చించి రూపాయి పతనం అడ్డుకునేందుకు కూడా ఆర్‌బీఐకి అవకాశం ఉంది. దేశంలో తగినంత డాలర్ నిల్వలు ఉండటం.. ఆర్‌బీఐకి కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనానికి తక్షణం అడ్డుకట్ట వేసేందుకు భారత్‌కు 95 బిలియన్ డాలర్ల వరకూ ఫారెక్స్ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం. అయితే.. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఇతర దేశాలతో భారత్‌కు ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.  


వీటితో పాటూ బంగారం దిగుమతులపై(Gold Imports) ఆంక్షలు విధించడం ద్వారా రూపాయి విలువ పెంచే ప్రయత్నం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక 2013 నాటీ ఎఫ్‌సీఎన్‌ఆర్ స్వాప్(FCNR swap) పథకాన్ని పునఃప్రారంభించి డాలర్ నిధులను దేశంలోకి ఆకర్షించవచ్చనేది కొందరి సూచన.! అయితే.. ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా ఈ పథకం ద్వారా ఆశించిన ప్రయోజనం ఒనగూరే అవకాశం తక్కువనే వాదన కూడా వినిపిస్తోంది.

Updated Date - 2022-09-30T23:56:02+05:30 IST