పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న NRI జంట.. ఉన్నతోద్యాగాలకు రాజీనామా చేసి మరీ..

ABN , First Publish Date - 2022-07-26T01:36:09+05:30 IST

పేదరిక నిర్మూలన చదువుతోనే సాథ్యమని నమ్మిన ఓ ఎన్నారై దంపతుల ప్రయత్నం ప్రస్తుతం ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న NRI జంట.. ఉన్నతోద్యాగాలకు రాజీనామా చేసి మరీ..

ఎన్నారై డెస్క్: పేదరిక నిర్మూలన చదువుతోనే సాధ్యమని నమ్మిన ఓ ఎన్నారై దంపతుల ప్రయత్నం ప్రస్తుతం ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అమెరికాలో ఉండే శిల్ప, డా. అమిత్ సింఘాల్ దంపతులు స్థాపించిన సితారే ఫౌండేషన్.. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ‘సితారే’ ఆసరాతో చదువుకున్న 17 ఏళ్ల కుసుమ్‌ చౌదరికి తాజాగా అమెరికాలో పైచదువులు చదివే అమూల్యమైన అవకాశం దక్కింది. మెరీల్యాండ్ యూనివర్శిటీలో కంప్యూటర్ డిగ్రీ చదువుకునేందుకు ఆమెకు వీసా లభించింది. పేదరికంలో పుట్టిపెరిగిన ఆమె.. ఆ వీసా చూసుకుని మురిసిపోయింది. 


పేద విద్యార్థులకు చేయూత.. 

సీతార సంస్థ పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందిస్తుంది. 6 నుంచి 12వ తరగతి వరకూ బాలబాలికల ఖర్చు మొత్తం సంస్థ భరిస్తుంది. ప్రముఖ ప్రైవేటు స్కూళ్ల సౌజన్యంతో వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందేలా కృషి చేస్తోంది. ప్రతి ఏటా పరీక్ష నిర్వహించి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంపిక చేస్తుంది. అనంతరం.. వారి చదువుకయ్యే ఖర్చులే కాకుండా.. చిన్నారులు శారీరకంగా, మానసికంగా మరింత ధృఢంగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు చేపడుతోంది. ‘సితార’ సహకారంతో కుసుమ్‌కు జోధ్‌పూర్‌కు చెందిన యూరో ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీటు లభించింది. అక్కడ ఇంగ్లీష్ విద్యతోపాటూ, కంప్యూటర్స్ నేర్చుకోవడంతో ఆమెకు ఆ రంగం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తే ఆమెను అమెరికావైపు నడిపించింది.


చదువుకున్న శక్తి అప్పుడే అర్థమైంది.. 

చదువుతో పేదరికానికి ముగింపు పలకొచ్చనడానికి తన కుటుంబమే మంచి ఉదాహరణ అని సితారే వ్యవస్థాపకులు డా. అమిత్ అంటారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి చదువే కారణమని చెప్పారు. సితార స్థాపించకమునుపు డా. అమిత్ గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆయన సతీమణి శిల్పది కూడా సాఫ్ట్‌వేర్ రంగమే. జీవితాల్లో చదువు ఎలా వెలుగులు నింపుతుందో ప్రత్యక్షంగా చూసిన డా. అమిత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సితారే‌ను స్థాపించారు. ఆ తరువాత.. ఆయన సతీమణి కూడా ఈ మహాక్రతువులో భాగస్వామురాలైంది.  


డా. అమిత్ ముత్తాత యూపీలోని బులంద్‌షహర్లో టైర్లు రిపేర్లు చేస్తూ జీవనం సాగించేవారు. కానీ..తన కొడుకును మాత్రం చదువుకోమ్మంటూ ప్రోత్సహించారు. ఫలితంగా అమిత్ తాత ఇంగ్లిష్‌లో బీఏ చేసి టీచర్‌ అయ్యారు. ఆ తరువాతి తరంలో అమిత్ తండ్రి ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ చేశారు. ఇక తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో అమిత్ అమెరికాకు వెళ్లి..జీవితంలో, కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. మిన్నెసొటా డులుత్ యూనివర్శిటీ నుంచి కంప్యూసైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆయన..కార్నెల్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. ‘‘చేతుల్లో రెండు సూట్ కేసులు, కొద్ది డబ్బుతో  తొలిసారిగా అమెరికాలో కాలు పెట్టా’’ అని ఆయన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రతి తరం తన తరువాత తరానికి ఇవ్వగలిగే ఆస్తి మంచి విద్య మాత్రమే అని ఆయన తేల్చి చెప్పారు. 


అమిత్, శిల్ప 2016లో సితారే సంస్థను స్థాపించారు. ప్రతి విద్యార్థిపై సంస్థ ఏటా 2 వేల డాలర్లు ఖర్చు పెడుతోంది. తమ సొంత నిధులతోనే ఆ జంట చిన్నారుల ఖర్చంతా భరిస్తోంది. సంస్థ ప్రారంభించిన తొలి ఏట 240 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి పరీక్ష నిర్వహించి 50 మందిని ఎంపిక చేశారు. ఆ తరువాత సితారే కృషి గురించి అనేక మందికి తెలియడంతో ఏటా సంస్థ సాయం కోసం వచ్చే వారి సంఖ్య వేగంగా పెరిగింది. ఈ మారు 73 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిపుణులైన విద్యావేత్తలు రూపొందించే ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా మెరికల్లాంటి స్టూడెంట్ల ఎంపిక జరుగుతుంది. ఇప్పటివరకూ సితారే.. 400 మంది చిన్నారుల జీవితాల్లో విద్యాకుసుమాలు పూయించింది. సితారే సాయంతో ఐదుగురు విద్యార్థులు అమెరికాలో చదువుకునే అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-26T01:36:09+05:30 IST