NRI: లేటు వయసులో కాలేజీ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎన్నారై మహిళ.. కూతురి వయసు ఉన్న విద్యార్థినులతో కలిసి..

ABN , First Publish Date - 2022-08-26T15:50:42+05:30 IST

కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు ఇలా పలు కారణాలతో చాలా మంది మధ్యలో చదువుకు స్వస్తి పలుకుతుంటారు.

NRI: లేటు వయసులో కాలేజీ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎన్నారై మహిళ.. కూతురి వయసు ఉన్న విద్యార్థినులతో కలిసి..

ఎన్నారై డెస్క్: కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు ఇలా పలు కారణాలతో చాలా మంది మధ్యలో చదువుకు స్వస్తి పలుకుతుంటారు. ఇలా మధ్యలో చదువు ఆపేస్తున్నవారిలో దురదృష్టవశాత్తూ మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అయితే, పంజాబ్‌కు చెందిన ఓ ఎన్నారై మహిళ తనకు వివాహమై, ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత కాలేజీలో చేరి తన కల నెరవేర్చుకుని నలుగురికి స్పూర్తిగా నిలిచారు. 47 ఏళ్ల వయసులో గుర్జిత్ కౌర్ అనే ఎన్నారై ప్రస్తుతం తన కాలేజీ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె తన కూతుళ్ల వయసున్న విద్యార్థినులతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు. మళ్లీ తన కాలేజ్ డేస్ తిరిగి వచ్చేశాయని సంబరపడిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుర్జిత్ కౌర్‌ది పంజాబ్ రాష్ట్రం జలంధర్‌కు సమీపంలోని ఖజుర్లా గ్రామం. ఆమె కాలేజీ జీవితాన్ని పొందలేకపోయారు. దానికి కారణం 12వ తరగతి పూర్తయిన వెంటనే ఆమెకు వివాహం కావడమే. ఆ తర్వాత భర్తతో కలిసి ఫిలిప్పిన్స్‌కు వెళ్లిపోయారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆమెకు మరోసారి కాలేజీ రోజులను ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది.


దీనికి కారణం ఆమె ఇద్దరు కుమార్తెలు. వారికి ఇక్కడి ఆచార వ్యవహారాలు, భాష సంస్కృతి అలవాటు కావాలనే ఉద్దేశంతో తండ్రి వారిని కొన్నాళ్లు స్వదేశానికి పంపించారు. అలాగే ఉన్నత చదువులు కూడా ఇక్కడే చదివితే బాగుటుందని తన భర్త భావించినట్లు గుర్జిత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లో కొన్నాళ్లు ఉండి.. ఇక్కడి ఆచార వ్యవహారాలు, భాషను అర్ధం చేసుకోవాలని తన భర్త భావించారని ఆమె తెలిపారు. దీంతో తాను డిసెంబర్ 2021లో ఇక్కడికి వచ్చి పిల్లలను స్కూల్‌, కాలేజీలో చేర్పించానని ఆమె వెల్లడించారు. తన పెద్ద కుమార్తె కిరణ్ దీప్ (18) సైకాలజీలో బీఏ (ఆనర్స్) చదువుతోందని, చిన్నకూతురు కిరణ్‌దీప్ (16) ఒక ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతోందని గుర్జిత్ చెప్పారు. ఇలా ఆమె ఇద్దరు కుమార్తెలు చదువుల్లో బిజీ కావడంతో తాను ఒంటరిగా ఇంట్లో ఉండడం ఆమెకు బోరింగ్‌గా అనిపించింది. దాంతో కాలేజీలో చేరాలనే తన చిరకాల కోరికను తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించారు. ఈ విషయమై తన భర్తతో చర్చించి ఆయన అనుమతితో లియాల్‌పూర్ ఖల్సా కళాశాల ఫర్ ఉమెన్‌లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులో చేరారు. 


ఇలా తన జీవితంలో మళ్లీ కాలేజీ రోజులు తిరిగి వచ్చాయని ఆమె మురిసిపోతున్నారు. ఈ వయసులో మళ్లీ చదువుకోవడం తనకు చాలా సంతృప్తినిస్తోందన్నారు. ఇక తొలిరోజు క్లాస్ రూమ్‌లోకి ప్రవేశించగానే తోటి విద్యార్థినులు తనను లెక్చరర్‌గా భావించి లేచి నిలబడ్డారని గుర్జిత్ అన్నారు. అయితే, వారికి తాను వారి తోటి విద్యార్ధినిని అని నమ్మించడానికి తనకు కొంత సమయం పట్టిందని ఆమె తెలిపారు. అంతేగాక తనకు పాఠాలు బోధించే గురువులందరూ కూడా తనకంటే చిన్నవారని గుర్జిత్ చెప్పారు. లియాల్‌పూర్ ఖల్సా కళాశాల ప్రిన్సిపాల్ నవజోత్ కౌర్ మాట్లాడుతూ, తాము నైపుణ్య ఆధారిత కోర్సులను ప్రారంభించినప్పుడు మధ్య వయస్కులైన మహిళలు చేరాలని భావించినట్లు తెలిపారు. కానీ అది జరగలేదట. ప్రతియేటా కాలేజీలో చదువుకోవడానికి ఒకరిద్దరు మధ్య వయసు స్త్రీలు మాత్రమే వస్తున్నారని నవజోత్ కౌర్ చెప్పారు.

Updated Date - 2022-08-26T15:50:42+05:30 IST