జగన్ అవమానించింది ఎన్టీఆర్‌ని కాదు, తెలుగు వారిని: జయరాం కోమటి

ABN , First Publish Date - 2022-09-22T17:32:58+05:30 IST

ఢిల్లీ స్థాయిలో ఏ గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలువబడే తెలుగు ప్రజలకు అది అందరినీ శాసించే జాతి అనే స్థాయికి గుర్తింపు తేవడంలో తెలుగు దేశం వ్యవస్థాపకులు అన్నగారు నందమూరి తారకరామరావు చేసిన కృషి అనన్య సామాన్యమైనదని ఎన్నారై టీడీపీ అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు.

జగన్ అవమానించింది ఎన్టీఆర్‌ని కాదు, తెలుగు వారిని: జయరాం కోమటి

తెలుగువాడు తిరగబడతాడు!

ఎన్నారై డెస్క్: ఢిల్లీ స్థాయిలో ఏ గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలువబడే తెలుగు ప్రజలకు అది అందరినీ శాసించే జాతి అనే స్థాయికి గుర్తింపు తేవడంలో తెలుగు దేశం వ్యవస్థాపకులు అన్నగారు నందమూరి తారకరామరావు చేసిన కృషి అనన్య సామాన్యమైనదని ఎన్నారై టీడీపీ అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. తెలుగు వాడికి అంతటి గౌరవం గుర్తింపు తెచ్చిన అన్నగారికి ఆయన సొంత జిల్లా(పూర్వపు కృష్ణా)లో తీవ్రంగా అవమానిస్తూ ఆయన పేరును తొలగించడం అత్యంత హేయమైన చర్య అని ఆయన నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం అంటే అది ఎన్టీఆర్‌కు నష్టం చేసినట్టు కాదని, తెలుగు వారిని నొప్పించినట్టు అని జయరాం కోమటి వ్యాఖ్యానించారు. 10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్న అనితర సాధ్యమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పొరపాటు ఆయనకు రాజకీయ సమాధి కట్టనుందని జయరాం హెచ్చరించారు.


సీఎం జగన్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతి తెలుగు వాడు తిరగబడతాడు అని జయరాం కోమటి హెచ్చరించారు. అది ఒక ఉద్యమంలా పైకి కనిపించకపోవచ్చు. ఓటు రూపంలో ఓ పోటు జగన్‌కు తెలుస్తుందన్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మున్ముందు జగన్ రాజకీయ భవిష్యత్తు పతనమైపోతుందన్నారు. జగన్‌కు ఓటేసిన వారిలోను లక్షల సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారన్న విషయాన్ని ఆయన మరిచిపోయారన్నారు. తన జెండాలో నాన్న ఫొటోను లేపేసిన జగన్, తన ఇంటికి నాన్న పేరు కాకుండా లోటస్ పాండ్ అని పెట్టుకున్నారని గుర్తు చేశారు. జగన్ ఏపీలో ఎన్టీఆర్ నెలకొల్పిన తొలి వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించడం చారిత్రక తప్పిదం అన్నారు. జగన్ తన తప్పు తెలుసుకుని వెంటనే ఎన్టీఆర్ పేరు పెడితే మంచిది, లేదంటే తిరిగి ఎన్టీఆర్ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టే వరకు తెలుగు ప్రజలు ఆ విషయాన్ని వదిలిపెట్టరన్నారు. ఈ విషయం జగన్ గ్రహిస్తే ఆయనకే మంచిదని హెచ్చరించారు.


Updated Date - 2022-09-22T17:32:58+05:30 IST