బీదరికం కారణంగా నెరవేరని కల.. 48 ఏళ్ల వయసులో అనుకున్నది సాధించిన NRI!

ABN , First Publish Date - 2022-06-06T01:06:24+05:30 IST

చిన్నతనంలో ప్రతిఒక్కరూ ఎన్నెన్నో కలలు కంటారు. అయితే.. జీవితంలో అనుకున్నవన్నీ కుదరవు కాబట్టి అనేక మంది తమ చిన్ననాటి కలలను పక్కనపెట్టేస్తారు.

బీదరికం కారణంగా నెరవేరని కల.. 48 ఏళ్ల వయసులో అనుకున్నది సాధించిన NRI!

ఎన్నారై డెస్క్: చిన్నతనంలో ప్రతిఒక్కరూ ఎన్నెన్నో కలలు కంటారు. అయితే.. జీవితంలో అనుకున్నవన్నీ కుదరవు కాబట్టి అనేక మంది తమ చిన్ననాటి కలలను పక్కనపెట్టేస్తారు.  ఆ ఆశలేవీ గుర్తుకు రానంతస్థాయిలో జీవన పోరాటంలో బిజీ అయిపోతారు. కానీ.. కేరళకు చెందిన టీసీ మాథ్యూ మాత్రం ఇందుకు భిన్నం. బతుకుతెరువు కోసం 17 ఏళ్ల పాటు సౌదీలో గడిపినా కూడా ఆయన సంగీతం నేర్చుకోవాలన్న తన కలను ఏనాడూ మర్చిపోలేదు. కరోనా కాలంలో ఉద్యోగం పోవడంతో..ఆ ఖాళీ సమయాన్ని తన కల నెరవేర్చుకునేందుకు వినియోగించారు. స్ఫూర్తివంతమైన ఆయన లైఫ్ గురించి తెలుసుకుందాం పదండి.. 


కేరళలోని అళపుజకు చెందిన టీసీ మ్యాథ్యూకు సంగీతమంటే ప్రాణం. స్కూల్ రోజుల్లో అనేక పోటీల్లో పాల్గొని పతకాలు గెలిచారు కూడా. ఈ క్రమంలో ఆయన తన నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఓ సంగీత పాఠశాలలో చేరారు. కానీ.. పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేక మధ్యలోనే ఆయన తన సంగీతాభ్యాసాన్ని మానేశారు. అయితే.. సంగీతంపై అభిమానాన్ని మాత్రం ఏనాడూ కోల్పోలేదు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పాలీటెక్నిక్ చేశాక.. ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిపోయారు. అక్కడే దాదాపు 17 ఏళ్ల పాటు గడిపారు. ఆర్థికంగా కుదురుకున్నారు. అదే సమయంలో తన సంగీత నైపుణ్యాలకు మెరుగుపెట్టుకున్నారు. సంగీత పుస్తకాలు చదువుతూ రేడియోలో పాటలు వింటూ మ్యూజిక్‌పై పట్టు సాధించారు. కీబోర్డు నేర్చుకుని కొన్ని పాటలకు సంగీతం సమకూర్చారు. అలా ఆయనలోని ఆత్మవిశ్వాసం ఇనుమడించింది.


కానీ.. కరోనా సంక్షోభం మరోసారి ఆయన్ను సమస్యల్లోకి నెట్టింది. ఉన్నట్టుండి ఉద్యోగం పోయింది. అయితే మ్యాథ్యూ ఈ సమస్యను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. వెంటనే ఇండియాకు తిరిగొచ్చి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. ఎర్ణాకుళంలోని మహారాజా స్కూల్‌లో మ్యూజిక్‌ బీఏ కోర్సులో చేరారు. 48 ఏళ్ల వయసులో ఆయన ఫస్ట్ ర్యాంకుతో బీఏ పాసయ్యారు. ఇటీవలే..మ్యాథ్యూ మరో మిత్రుడితో కలిసి ఓ పాటల ఆల్బమ్ కూడా రీలీజ్ చేశారు. భగవంతుడిని కీర్తిస్తూ మ్యాథ్యూ ఇప్పటివరకూ మొత్తం 100కు పైగా పాటలను రచించారు కూడా! 



Updated Date - 2022-06-06T01:06:24+05:30 IST