ఎన్‌ఆర్‌ఐ భూమి కబ్జా

ABN , First Publish Date - 2022-01-19T06:19:41+05:30 IST

విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా కొంతమంది ఆక్రమించుకుంటున్నారు.

ఎన్‌ఆర్‌ఐ భూమి కబ్జా

వాచ్‌మన్‌ని వెళ్లగొట్టి... నిర్మాణాలు కూలగొట్టి...

కుటుంబ సభ్యుల ద్వారా భీమిలి పోలీసులకు ఫిర్యాదు

స్పందన లేకపోవడంతో ఆన్‌లైన్‌లో నగర పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి...


విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా కొంతమంది ఆక్రమించుకుంటున్నారు. భూ యజమానులు స్థానికంగా లేరని తెలిస్తే... మరో అడుగు ముందుకేసి... కాపలాదారులపై దాడులకు కూడా తెగబడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలో పేరొందిన ఎముకల వైద్య నిపుణుడు ధర్మారావు (చిలుకూరి) ఇరవయ్యేళ్ల క్రితం భీమిలి మండలం తాళ్లవలసలోని సర్వే నంబరు 216/1లో 3.14 ఎకరాలు కొనుగోలు చేసి కుమార్తె శ్రీదేవికి ఇచ్చారు. అది విలువైన స్థలం కావడంతో ఆమె చుట్టూ కంచె వేయించి, రెండు షెడ్లు నిర్మించారు. ఒక దాంట్లో పంపుసెట్‌ పెట్టించి, మరో దాంట్లో వాచ్‌మన్‌ కుటుంబాన్ని ఉంచారు. ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. రెండేళ్లుగా తాను ఇక్కడకు రాకపోవడం గమనించిన భీమిలికి చెందిన బి.రామకృష్ణ అనే వ్యక్తి దఫదఫాలుగా వాచ్‌మన్‌ని బెదిరించి, నెల రోజుల క్రితం ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారని శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఆ తరువాత పంపుసెట్‌ షెడ్‌తోపాటు వాచ్‌మన్‌ వుంటున్న నిర్మాణాన్ని కూలగొట్టించారని, అక్కడి గోడలపై భూ యజమానిగా తన పేరు, ఫోన్‌ నంబరు  రాసి ఉంటే, వాటిని చెరిపించేశారని ఆమె మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి అమెరికా నుంచి ఫోన్‌ చేసి చెప్పారు. ఆ భూమిలోకి ఎవరు ప్రవేశించినా ఊరుకునేది లేదని బెదిరిస్తున్నారని వాపోయారు. దాంతో విశాఖపట్నంలో వుంటున్న తన సోదరుడైన శ్రీనివాస్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయించామని, భీమిలి పోలీసులు పెద్దగా స్పందించకపోవడంతో తాను గత్యంతరం లేని పరిస్థితుల్లో విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ తమ వద్ద ఉన్నాయని, రెవెన్యూ రికార్డుల్లో తన పేరే వుందని పేర్కొన్నారు. ఆధారాలు చూపిస్తున్నా కబ్జాదారుడిపై స్టేషన్‌ స్థాయితో కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ప్రస్తుతం తాళ్లవలసలో ఎకరా రూ.20 కోట్లు పలుకుతోంది. ఆ లెక్కన 3.14 ఎకరాలు విలువ రూ.60 కోట్ల పైమాటే. 


పత్రాలు సమర్పించమన్నారు: శ్రీనివాస్‌, సోదరుడు

పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు మంగళవారం మరోసారి భీమిలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. సీఐ వెంకటరమణ చెప్పిన వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. భూమిని కబ్జాను చేసిన బోర రామకృష్ణను పిలిపించి మాట్లాడారు. ఇద్దరి దగ్గర ఉన్న హక్కు పత్రాలు తీసుకురావాలని సూచించారు. కేసు నమోదు చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. మా భూమిని మాకు అప్పగిస్తే చాలు.

Updated Date - 2022-01-19T06:19:41+05:30 IST