గల్ఫ్‌లో తెలుగు వెలవెల.. మాతృభాషపై ఆసక్తి చూపని తెలుగోళ్లు!

ABN , First Publish Date - 2022-06-21T23:03:54+05:30 IST

విదేశీ గడ్డపై ఉంటూ మాతృభాషపై మమకారం ప్రదర్శించే తెలుగు భాషా సంఘాలు... ఆచరణలో మాత్రం పిల్లలకు తెలుగు బోధనపై ఆసక్తి చూపించడం లేదు.

గల్ఫ్‌లో తెలుగు వెలవెల.. మాతృభాషపై ఆసక్తి చూపని తెలుగోళ్లు!

తెలుగు బోధించే పాఠశాలలున్నా ఆదరణ కరువు

ఫ్రెంచ్‌ లేదా సంస్కృతం వైపు విద్యార్థుల మొగ్గు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): తెలుగు భాష పేర సంఘాలు, ఉత్సవాలు, జాతరలు, ఏదో విదేశీ గడ్డపై ఉండి కూడా మాతృభాష పై మమకారం వల్లెవేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోనె విదేశాలు ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలోని ప్రవాసీ తెలుగు సంఘాలకు భాషపై ఎంత వరకు చిత్తశుద్ధి ఉందో తాజాగా రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుండి చివరగా పదవ తరగతిలో అన్ని బోర్డుల పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ద్వితీయగా తెలుగు భాష చట్టం అద్దంపడుతుంది.


కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోని సి.బి.యస్.ఇకు అనుబంధంగా గల్ఫ్ దేశాలలో మోత్తం 193 భారతీయ పాఠశాలలు నడుస్తుండగా ఇందులో కొన్ని వేలాది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. సి.బి.యస్.ఇ విద్యాభోధనలో ద్వితీయ భాషగా తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ భాష లేదా అరబ్బి, ఫ్రెంచ్ భాషలు ఎంపిక చేసుకోనె సౌలభ్యం విద్యార్ధులకు ఉంది. ఆయా మాతృభాషలు మాట్లాడె విద్యార్ధుల సంఖ్య ఆధారంగా ఈ భాషలను భోదించడం జరుగుతుంది, ఈ దిశగా మలయాళం, తమిళం, ఉర్దూ భాషలను అత్యధికంగా బోధిస్తుండగా తెలుగు విద్యార్ధుల నుండి నిరాశజనకమైన స్పందన ఉండడంతో తెలుగును మాత్రం అతి స్వల్పంగా కొన్ని చోట్ల మాత్రమే భోదిస్తున్నారు. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు ఉన్న ఒక్క దుబాయి నగరంలో 30కు పైగా సి.బి.యస్.ఇ పాఠశాలలుండగా దురదృష్టవశాత్తు ఒక్క చోట కూడ తెలుగు భోదించడం లేదు, అదే అన్ని పాఠశాలలో మలయాళం మాత్రం భోదిస్తున్నారు. సి.బి.యస్.ఇ కాకుండా, అదనంగా 10 పాఠశాలలు పూర్తిగా మలయాళం మీడియాంలో నడుస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ బోర్డుకు అనుబంధంగా ఉన్నాయి. 


తెలుగు భాష పేర పుట్టగొడుగుల్లా అనేక సంఘాలు పుట్టుకొస్తున్నప్పటికి వీరెవరు కూడ స్ధానికంగా తెలుగు భాషను బోధించడం పట్ల ఆసక్తి చూపడం లేదు, స్ధానికంగా ఉన్న పాఠశాలలో ఇతర రాష్ట్రాల విద్యార్ధుల తరహాలో తమ మాతృభాషను నేర్పకుడా ఎక్కడో అమెరికా నుండి తెలుగును తమ పిల్లలకు నెర్పిస్తున్నట్లుగా అర్భాట ప్రచారం చేసుకొంటున్నారు. పాఠశాలలో తమ పిల్లలకు మాత్రం ఫ్రెంచ్, సంస్కృతం భాషలను ఎంచుకోంటున్నారు. కువైత్‌లో ప్రతి శుక్రవారం ఏదో ఒక తెలుగు సంఘం – కుల సంఘాల నుండి రాజకీయ పార్టీల వరకు – ప్రచారం కొరకు ప్రాకులాడుతున్నా ఏ ఒక్కరు కూడా తెలుగు బోధన పట్ల శ్రద్ధ చూపడం లేదు. ఇతర కొన్ని దేశాలలో కూడా ఇదే రకమైన దుష్ట సంప్రదాయం ఉంది. అదే సౌదీ అరేబియా, ఖతర్ మరియు బహ్రెయిన్ దేశాలలో మాత్రం అనేక చోట్ల స్ధానికంగా తెలుగును ద్వితీయ భాషగా భోదిస్తున్నా విద్యార్ధుల సంఖ్య ఆశించిన విధంగా లేదు.


 గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో ఉంటున్న తెలంగాణ ప్రవాసీయులలోని హైద్రాబాద్ నగరానికి చెందిన ముస్లింలు అనేక మంది తెలుగు భాషను నెర్చుకోవడానికి విముఖత ప్రదర్శించడం కూడ ఒక భాష వికాసానికి విఘాతం కల్గిస్తుంది. హైద్రాబాద్ నగరంలో మూడు పాఠశాలలో కేవలం తెలుగు నుండి తప్పించుకోవడానికి భారీ ఫీజులు చెల్లించి మరీ ప్రవేశాలు పొందె వారు కానీ ఇప్పుడు విధిగా చేయడంతో అమ్యగోచర పరిస్ధితిను ఎదుర్కోంటున్నారు. విదేశాలలో మలయాళం భాష కేరళ మతాలకు అతీతంగా ప్రవాసులందర్ని కలుపుతుండగా, తెలుగు భాషకు వచ్చె సరికి పరిస్ధితి భిన్నంగా ఉంది


తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రవాసీయుల పరిస్ధితి కూడ మెరుగ్గా ఏమి లేదు. ఈ కుటుంబాలు కూడ తమ పిల్లల కొరకు తెలుగును ప్రవేశపెట్టవల్సిందిగా స్ధానిక పాఠశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకోరాలేకపోవడం బాధను కల్గిస్తుంది. తెలుగు భాష కొరకు ప్రయత్నించడానికి బదులుగా, తెలుగు మాతృభాష మాట్లాడె తల్లిదండ్రులు తమ పిల్లలను ఫ్రెంచి లేదా సంస్కృతంను ఎంచుకోవడానికి ప్రొత్సహిస్తున్నారు.

Updated Date - 2022-06-21T23:03:54+05:30 IST