30 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న NRI.. భారత్‌కు తిరిగొచ్చి చేసిన పనికి ఊరంతా విస్మయం.. కొత్త ఇంటిపై..

ABN , First Publish Date - 2022-02-05T23:12:23+05:30 IST

ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే.. మేడ మీద పూల మొక్కలు అవీ పెంచుకుంటారు. సాయంత్రాలు సేద తీరేందుకు వీలుగా ఉయ్యాల లేదా కుర్చీలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ..అమెరికా నుంచి ఇటీవల ఇండియాకు వచ్చిన ఎన్నారై మాత్రం అటువంటివేం చేయకపోగా.. ఓ పాత ట్రాక్టర్‌ను..

30 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న NRI.. భారత్‌కు తిరిగొచ్చి చేసిన పనికి ఊరంతా విస్మయం.. కొత్త ఇంటిపై..

ఇంటర్నెట్ డెస్క్:  ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే.. మేడ మీద  పూల మొక్కలు అవీ పెంచుకుంటారు. సాయంత్రాలు సేద తీరేందుకు వీలుగా ఉయ్యాల లేదా కుర్చీలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ..అమెరికా నుంచి ఇటీవల ఇండియాకు వచ్చిన ఎన్నారై మాత్రం అటువంటివేం చేయకపోగా.. ఓ పాత ట్రాక్టర్‌ను మేడ మీద అమర్చాడు. ఇదంతా చూసి మొదట నోరెళ్ల బెట్టిన ఊరి జనం..చివరకు అతడి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసలు ఆ ఎన్నారై ఎవరూ.. ట్రాక్టర్‌ను ఇలా మేడమీదకు ఎక్కించడంలో అతడి ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం.. 


రాజస్థాన్‌ రాష్ట్రం శ్రీగంగానగర్ జిల్లాకు చెందిన  అంగ్రేజ్ సింగ్ 1992 నుంచి అమెరికాలోనే  ఉంటున్నారు.  ఇటీవలే ఆయన తన సొంత ఊరు రామ్‌సింగ్‌పూర్‌లో మూడంతస్థుల భవనం కట్టుకున్నారు. ఇక కొత్త ఇంట్లోకి మారేందుకు ఇటీవలే ఇండియాకు వచ్చిన ఆయన.. గృహప్రవేశానికి  ముందు ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఓ పాత ట్రాక్టర్ కొని దానికి డెంటింగ్, పెయింటింగ్ పనులు చేయించి, కొత్త దానిలా తీర్చి దిద్దారు.  ఆ తరువాత దాన్ని క్రేన్ సాయంతో కొత్త భవంతి మేడ మీద అమర్చారు అంగ్రేజ్ సింగ్. అంత ఎత్తున ట్రాక్టర్‌ను ఏర్పాటు చేయడంతో.. చాలా దూరం నుంచే అందరికీ కనబడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది. అయితే..ఇదంతా చూసి ఊరివారు మాత్రం తొలుత షాకైపోయారు. కానీ.. స్వయంగా రైతు బిడ్డ అయిన అంగ్రేజ్ సింగ్ తనకు ట్రాక్టర్ ప్రాముఖ్యత ఏంటో తెలుసు కాబట్టే, ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. 


రైతు జీవితంలో ట్రాక్టర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉండటమే కాదు... అది పూజనీయమైనదంటూ అంగ్రేజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ట్రాక్టర్‌తో నేలను దున్నాకే పంట పండి, రైతు దశ తిరుగుతుందని ఆయన వివరించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ట్రాక్టర్‌‌ను తగిన విధంగా గౌరవించే క్రమంలోనే ఇలా ఇంటిపై ఏర్పాటు చేసినట్టు వివరించారు. రైతు శ్రమకు ట్రాక్టర్ చిహ్నమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-02-05T23:12:23+05:30 IST