NRI Remittances: దేశంలోకి ఎన్నారై నిధుల రాకడ.. రివర్స్ అవుతున్న ట్రెండ్..? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-29T02:38:37+05:30 IST

ఎన్నారైల్లో ఎక్కువమంది కేరళ వారే అన్న భావన మన దేశంలో ఉంది. దేశంలోకి వచ్చే ఎన్నారైల నిధుల్లో అధికభాగం కేరళకు మళ్లుతుండటమే దీనికి కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే..ఈ పరిస్థితి త్వరలో మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కేరళ వారికంటే..

NRI Remittances: దేశంలోకి ఎన్నారై నిధుల రాకడ.. రివర్స్ అవుతున్న ట్రెండ్..? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

ఎన్నారై డెస్క్: ఎన్నారైల్లో ఎక్కువమంది కేరళ వారే అన్న భావన మన దేశంలో ఉంది. దేశంలోకి వచ్చే ఎన్నారైల నిధుల్లో(NRI remittances) అధికభాగం కేరళకు మళ్లుతుండటమే దీనికి కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే..ఈ పరిస్థితి త్వరలో మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కేరళ(Kerala) వాసులకంటే.. ఉత్తరప్రదేశ్(Uttarpradesh), బీహార్(Bihar), ఒడిశా(Odissa), పశ్చిమబెంగాల్(West Bengal) రాష్ట్రాల వారే అధిక సంఖ్యలో విదేశాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నారైలు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో కేరళ వాటా ఎక్కువని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్(Axis Mutual fund) తన తాజాగా అధ్యయనంలో పేర్కొంది. అయితే.. భవిష్యత్తులో ఈ ట్రెండ్‌లో మార్పు వస్తుందని అంచనా వేసింది. 


విదేశీ వ్యవహారాల శాఖ(Ministry of External Affairs) లెక్కల ప్రకారం.. 2020లో విదేశాలకు వెళ్లిన వారిలో దాదాపు 50 శాతం ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల వారే! దీన్నిబట్టి.. రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రాలకే ఎన్నారై నిధులు అధికమొత్తంలో అందుతాయని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సగటు వేతనాలకు, గల్ఫ్‌లో లభించే ఆదాయానికి మధ్య అంతరం తగ్గుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. సంస్థ నివేదిక ప్రకారం.. కేరళ, కర్ణాటక రాష్ట్రాల జీడీపీల్లో ఎన్నారై నిధుల వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అదేసమయంలో..ఉత్తరాది రాష్ట్రాల ఎన్నారైలు తమ సొంతరాష్ట్రాలకు పెద్ద మొత్తాల్లో నిధులు పంపిస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నారైలు మహారాష్ట్ర, ఢిల్లీకి పెద్ద మొత్తంలో నిధులు పంపించినట్టు కూడా యాక్సిస్ మ్యూచువల్ తన నివేదికలో పేర్కొంది. కుటుంబసభ్యులు, బంధువులను ఆదుకునేందుకు ఎన్నారైలు పెద్ద మొత్తంలో ఆ రాష్ట్రాలకు నిధులు పంపి ఉండొచ్చని అభిప్రాయపడింది. 


అయితే.. అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు ఇటీవల కాలంలో పెద్ద మొత్తాల్లో స్వదేశానికి డబ్బులు పంపిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా ఎన్నారైలు, యూఏఈ వారిని అధిగమించారు. భారత్‌లోకి వచ్చే ఎన్నారై నిధుల్లో అమెరికా వాటా ప్రస్తుతం 23.4 శాతం కాగా.. యూఏఈ వాటా 18 శాతం. దీని వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే భారత్‌లోని ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లోకి ఎన్నారై నిధుల రాకడ పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో పేర్కొంది. 

Updated Date - 2022-08-29T02:38:37+05:30 IST