సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘించాడంటూ NRI భర్తకు భారీ షాకిచ్చిన భార్య..! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-17T02:36:06+05:30 IST

అత్యాచార బాధితుల పేర్లు బయటపెట్టకూడదన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘించి తన పేరును సోషల్ మీడియాలో బయటపెట్టాడంటూ ఓ భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘించాడంటూ NRI భర్తకు భారీ షాకిచ్చిన భార్య..! అసలేం జరిగిందంటే..

లూథియానా: అత్యాచార బాధితుల పేర్లు బయటపెట్టకూడదన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘించి తన పేరును బయటపెట్టాడంటూ ఓ భార్య తన NRI భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ఓ మహిళ 2019లో రాజస్థాన్‌కు చెందిన ఓ ఎన్నారైని వివాహం చేసుకుంది. ఆమె భర్త న్యూయార్క్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. అప్పటికే తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి అతడు బాధితురాలిని వివాహం చేసుకున్నాడు. వారి వివాహం రిజిస్ట్రేషన్ సమయంలో ఈ విషయం బయటపడింది. దీని గురించి బాధితురాలు తన భర్తను ప్రశ్నించగా.. తన విడాకుల కేసు చివరి అంకానికి చేరుకుందని చెప్పాడు. అనంతరం.. అమెరికాకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆమెతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నాడు. 


ఈ క్రమంలో బాధితురాలు తన భర్త గురించి లోతుగా విచారించగా..అతడు అసలు విడాకుల కోసం దరఖాస్తు చేయలేదనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పైపెచ్చు అతడి మొదటి భార్యకూడా గృహహింస కేసు పెట్టిన విషయం బయటపడింది. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్తపై అత్యాచారం కేసు పెట్టింది. అయితే.. ఈ కేసును వాపసు తీసుకోవాలంటూ భర్త, అత్తమామాలు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొంది. ఇందులో భాగంగానే భర్త, అతడికి సోదరుడి వరసైన మరో వ్యక్తి తన పేరును సోషల్ మీడియాతో పాటూ ఓ యూట్యూబ్ చానల్‌లో పెట్టారని పేర్కొంది. అయితే.. ఆమె ఫిర్యాదును పోలీసుల ఎంతకీ పట్టించుకోకపోవడంతో చివరకు ఆమె పంజాబ్ హరియాణా హైకోర్టును ఆశ్రయించింది. ఫలితంగా పోలీసులు ఇటీవలే బాధితురాలి భర్తపై సెక్షన్ 228ఏ(అత్యాచార బాధితురాలి పేరును బహిర్గతం చేసిన నేరంపై) కింద కేసు నమోదు చేశారు. కాగా.. తనను మోసగించిన భర్తపై అత్యాచార కేసు పెట్టించేందుకు కూడా తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితురాలు వాపోయింది. 



Updated Date - 2022-05-17T02:36:06+05:30 IST