భర్తను మోసగించిన NRI భార్య.. ఏకంగా రూ.33 లక్షలు ఖర్చు చేయించి కెనడా వెళ్లిన ఆమె..!

ABN , First Publish Date - 2022-03-09T19:58:00+05:30 IST

కట్టుకున్న భర్తను మోసగించిందో ఎన్నారై భార్య.

భర్తను మోసగించిన NRI భార్య.. ఏకంగా రూ.33 లక్షలు ఖర్చు చేయించి కెనడా వెళ్లిన ఆమె..!

ఎన్నారై డెస్క్: కట్టుకున్న భర్తను మోసగించిందో ఎన్నారై భార్య. పెళ్లి సమయంలో ఖర్చులతో పాటు ఆమె చదువులకు ఆ భర్త ఏకంగా రూ.33 లక్షలు వెచ్చించాడు. అతడి డబ్బులతో కెనడాలో చదువుకున్న భార్య అక్కడే సెటిల్ అయింది. అయితే, అక్కడికి వెళ్లేముందు భర్తతో తన చదువులు పూర్తై, వర్క్ పర్మిట్ లభించగానే అతడిని కూడా తీసుకెళ్తానని చెప్పింది. కానీ, ఇప్పుడు భర్తను పట్టించుకోవడం లేదు. దాంతో ఎన్నారై భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం మొగాలోని రత్తియన్ గ్రామానికి చెందిన సుఖ్వంత్ సింగ్(28)కు దునెకా వాసి మన్మీత్ కౌర్‌తో 2018 డిసెంబర్ 20న వివాహమైంది. పెళ్లిలో అయిన ఖర్చు మొత్తం సుఖ్వంతే భరించాడు. అలాగే ఆమె కెనడాలో చదువుకుంటానని చెప్పడంతో అక్కడ అయిన వ్యయాన్ని కూడా అతడే చెల్లించాడు. ఇలా మన్మీత్‌పై ఇప్పటివరకు రూ.33 లక్షల వరకు ఖర్చు చేశాడు. 


ప్రస్తుతం చదువు పూర్తి చేసుకున్న మన్మీత్ అక్కడే సెటిల్ అయింది. కానీ, స్వదేశంలో ఉన్న భర్తను పట్టించుకోవడం లేదు. కెనడా వెళ్లే ముందు చదువు పూర్తై, వర్క్ పర్మిట్ లభించగానే సుఖ్వంత్‌ను తీసుకెళ్తానని చెప్పిన మన్మీత్ ఇప్పుడిలా దూరం పెట్టింది. కెనడా వెళ్లిన మూడేళ్ల వరకు బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి తన కాల్స్‌కు కూడా స్పందించడం లేదని సుఖ్వంత్ చెప్పాడు. అంతేగాక ఆమె తన ఫోన్ నంబర్ కూడా మార్చేసినట్లు వాపోయాడు. తన అత్తగారిని కలిసి తనను కెనడా పంపించే ఏర్పాట్లు చేయాలని పలుమార్లు కోరిన ఆమె నిరాకరించినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో చేసేదేమిలేక మొగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుఖ్వంత్ ఫిర్యాదు మేరకు మన్మీత్‌తో పాటు ఆమె తల్లి కరంజీత్ కౌర్‌పై మొగా పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా అటార్నీ న్యాయ సలహా మేరకు మన్మీత్, ఆమె తల్లిపై సెక్షన్ 420, 120బీ కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-03-09T19:58:00+05:30 IST