కొత్త ట్రెండ్ పట్ల NRIల్లో ఆసక్తి.. మంచి ఆదాయమే కాదు.. మనశ్శాంతి కూడా..

ABN , First Publish Date - 2022-06-25T00:31:07+05:30 IST

కొత్త ట్రెండ్ పట్ల NRIల్లో ఆసక్తి.. మంచి ఆదాయమే కాదు.. మనశ్శాంతి కూడా..

కొత్త ట్రెండ్ పట్ల NRIల్లో ఆసక్తి.. మంచి ఆదాయమే కాదు.. మనశ్శాంతి కూడా..

ఎన్నారై డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో NRIలు సంప్రదాయిక పెట్టుబడులకు బదులు రియల్ రంగంవైపు(Real estate) మళ్లుతున్నారు. నివాస సముదాయాలతో పాటూ కమర్షియల్ ప్రాజెక్టుల్లో కూడా పెట్టుబడులు(Investment) పెడుతున్నారు. అయితే.. ఎక్కడో విదేశాల్లో నివసిస్తున్న వారికి ఇక్కడి స్థిరాస్తుల బాగోగులు చూసుకోవడం కష్టంగా మారుతోంది. పెట్టుబడుల కోసం ఏయే ప్రాజెక్టులను ఎంచుకోవాలి, స్థిరాస్తుల బాగోగుల చూసుకునేందుకు ఎవరిని నియమించుకోవాలి, ఎవరికి అద్దెకివ్వాలి..? ఇత్యాది అంశాలు వారికి సమస్యాత్మకంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇటువంటి విషయాల్లో NRIలకు ఇండియాలోని వారి బంధువులు, స్నేహితులు సాయపడుతుండేవారు. కానీ...రాను రానూ జీవితాలు బిజీగా మారుతుండటంతో అయినవారి సాయం కోరడం సబబు కాదని అనేక మంది ఎన్నారైలు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారి సమస్యలు పరిష్కరిస్తోంది ప్రాప్‌టెక్(Proptech) ఇండస్ట్రీ. 




ఆర్థిక రంగంలో ఫిన్‌టెక్ సంస్థలు ఎంతటి సక్సెస్ సాధిస్తున్నాయో అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రాప్‌టెక్ సంస్థలు కూడా టెక్నాలజీ ఆధారంగా  NRIల అవసరాలన్నీ ఒక్క కంప్యూటర్ క్లిక్‌తో తీరుస్తున్నాయి. ప్రాప్‌టెక్ సంస్థల డిజిటల్ వేదికల ద్వారా ఎన్నారైలు తమ రియల్ ఆస్థుల ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్ చూపెడుతూ అద్దెకు ఇవ్వగలుగుతున్నారు. అంతేకాకుండా.. ఆస్తుల నిర్వహణ, పన్ను చెల్లింపులు, ఇతర న్యాయపరమైన విషయాల్లోనూ ఎన్నారైల సమస్యలను ఈ సంస్థలు పరిష్కరిస్తున్నాయి! ఈ ట్రెండ్ ఎన్నారైలకు కావాల్సిన ఆదాయం ఇవ్వడమే కాకుండా.. భారత్‌లోని తమ ఆస్థులు ఎలా ఉన్నాయో అనే చింత లేకుండా చేస్తోంది. ఎన్నారైల్లో ఈ ట్రెండ్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని గమనించిన కొన్ని సంస్థలు..  సమగ్ర ఆస్తుల నిర్వహణ(comprehensive property management) పేరిట పూర్తిస్థాయి సేవలను కూడా అందిస్తున్నాయి. ప్రాప్ టెక్ సంస్థల కారణంగా... స్వదేశంలోని తమ ఆస్తుల నిర్వహణలో ఎన్నారైలకు  ఎటువంటి సమస్యా రాదన్న నమ్మకం పెరుగుతోందని ఓ ప్రాప్‌టెక్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇది భారత్‌లో రియల్ రంగం అభివృద్ధి ఎంతో ఊతం ఇస్తుందని అంటున్నారు. 

Updated Date - 2022-06-25T00:31:07+05:30 IST