NRI లను అమితంగా ఆకర్షిస్తున్న పథకం.. స్థిరమైన రాబడి.. విదేశాల్లో ఉంటూనే..

ABN , First Publish Date - 2021-11-23T01:59:58+05:30 IST

భారత రిజర్వ్ బ్యాంకు రిటైల్ మదుపర్ల కోసం ఇటీవల ప్రారంభించిన ఓ కొత్త పథకం ఎన్నారైలను అమితంగా ఆకర్షిస్తోందని వెల్త్ ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకు ప్రారంభించిన ఈ రిటైల్ డైరెక్ట్ పథకంతో..ఎన్నారైలు విదేశాల్లో ఉంటూనే ఎన్‌ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయవచ్చు.

NRI లను అమితంగా ఆకర్షిస్తున్న పథకం.. స్థిరమైన రాబడి.. విదేశాల్లో ఉంటూనే..

ఇంటర్నెట్ డెస్క్: భారత రిజర్వ్ బ్యాంకు రిటైల్ మదుపర్ల కోసం ఇటీవల ప్రారంభించిన ఓ కొత్త పథకం ఎన్నారైలను అమితంగా ఆకర్షిస్తోందని వెల్త్ ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకు ప్రారంభించిన ఈ రిటైల్ డైరెక్ట్ పథకంతో..ఎన్నారైలు విదేశాల్లో ఉంటూనే ఎన్‌ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులతో స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారు ఈ పథకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లోని తమ తల్లిదండ్రుల ఖర్చుల కోసం, దేశంలో తమకున్న ఆస్తిపాస్తుల నిర్వహణ కోసం ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న ఎన్నారైలు ఈ పథకం వైపు మొగ్గు చూపుతున్నారు.  అమెరికా, బ్రిటన్, సింగపూర్, దుబాయ్‌లోని ప్రవాసీయులు అనేక మంది తమకు ఫోన్ చేస్తున్నారని సినర్జీ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ దలాల్ తెలిపారు. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పథకంతో ఎన్నారైలు విదేశాల్లో ఉంటూనే అకౌంట్ తెరిచి ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు. అభివృద్ధి చెందిన మార్కెట్లలో రాబడి 1-2 శాతంగా ఉంటే.. భారత ప్రభుత్వ బాండ్లపై రాబడి 6.5-7 శాతంగా ఉండటంతో ఎన్నారైల్లో ఆసక్తి పెరుగుతోంది. 2050లో మెచ్యూరిటీకి వచ్చే బాండ్‌‌లపై సగటున 6.91 శాతం రాబడి ఉంటోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరో దశాబ్ద కాలం పాటు వేచి చూస్తే.. రాబడి 7 శాతం కూడా దాటొచ్చంటున్నారు.


ఈ పథకంలో ఆరు నెలలకొకసారి రాబడి వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. బాండ్ కాలవ్యవధి పూర్తయ్యాక ఏక మొత్తంగా ఈ రాబడి పొందే అవకాశం లేదు. అయితే..ఎన్నారైలు ఈ పథకాన్ని ఓ స్థిరమైన ఆదాయమార్గంగా చూస్తున్నారని ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నారైలకు  పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్రాలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి లేదు. వివిధ నిబంధనల కారణంగా కార్పొరేట్, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కూడా ఎన్నారైలకు సమస్యగా మారింది. ఇక బ్యాంకు, ఇతర కార్పొరేట్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు వీలున్నప్పటికీ..కేవలం 5 నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి మాత్రమే మదుపు చేసేందుకే అవకాశం ఉంది. స్వల్పకాలిక పెట్టుబడుల్లో స్వతహాగా ఉండే రిస్క్ దీర్ఘ కాలిక ఇన్వెస్ట్‌మెంట్లలో లేకపోవడంతో పాటూ స్థిరమైన రాబడికి అవకాశం ఉండటంతో.. ఎన్నారైలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. 

Updated Date - 2021-11-23T01:59:58+05:30 IST