రూ.7 లక్షల పెట్టుబడి.. ఇప్పుడు ప్రతి నెలా రూ.6 లక్షల ఆదాయం.. America లో ఈ NRI మహిళ చేస్తున్న పనేంటంటే..

ABN , First Publish Date - 2022-05-18T01:38:32+05:30 IST

కేవలం రూ. 7 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం చూస్తుండగానే.. నెలకు ఆరు లక్షల ఆదాయాన్ని ఇచ్చే స్థాయికి చేరుకుంది. మరి ఆమె ఎవరో..తను చేసే లాభసాటి వ్యాపారం ఏంటో తెలుసుకుందాం పదండి.

రూ.7 లక్షల పెట్టుబడి.. ఇప్పుడు ప్రతి నెలా రూ.6 లక్షల ఆదాయం.. America లో ఈ NRI మహిళ చేస్తున్న పనేంటంటే..

ఎన్నారై డెస్క్: 12 ఏళ్ల వయసులోనే ఆమె అమెరికాకు వెళ్లింది. దీంతో.. చిన్నతనంలోనే ఇంటి పనుల్లో పాలుపంచుకోవడం ఆ చిన్నారికి అలవాటైపోయింది. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇతర చిన్న చిన్న పనులను సొంతంగానే చక్కబెట్టడం..  ఇలాంటి వన్నీ ఆమెకు చిన్నప్పటి నుంచీ సహజసిద్ధంగా అలవడ్డాయి. ఆ అలవాట్లే  ప్రస్తుతం ఆమెకు లక్షల ఆదాయం అందిస్తున్నాయి. కేవలం రూ. 7 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం చూస్తుండగానే.. నెలకు ఆరు లక్షల ఆదాయాన్ని ఇచ్చే స్థాయికి చేరుకుంది.  మరి ఆమె ఎవరో..తను చేసే లాభసాటి వ్యాపారం ఏంటో తెలుసుకుందాం పదండి. 


37 ఏళ్ల దేవయానీ పటేల్ ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో ఓర్లాండో నగరంలో నివసిస్తుంటారు. ప్రఖ్యాత డిస్నీ వరల్డ్‌కు వచ్చే భారతీయ పర్యటకులకు ఆమె పేరు చిరపరిచితం. ఇంటి భోజనం కావాలనుకునే భారతీయ పర్యటకులతో పాటూ స్థానికంగా ఉన్న భారత సంతతి వారు కూడా ఆమె చేతివంటను లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తుంటారు. దేవయాని భర్త కూడా ఆమెకు వ్యాపార నిర్వహణలో సహాయపడుతుంటారు. దేవయానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం దేవయాని ఒర్లాండో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి రోజూ సగటున 15 వరకూ అల్పాహారాలను పంపిస్తుంటారు. ఒక్కో టిఫిన్ బాక్స్ ధర 13 డాలర్లు.  డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లో ఆమె రోజుకు 25 ఆర్డర్లను కూడా పంపిస్తుంటారు. 


 ‘‘నాకు ఇద్దరు పిల్లలు..వారి బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను. కాబట్టి..వారిని విడిచి బయట ఫుల్ టైం ఉద్యోగాలు చేయడం కుదరదనిపించింది. అయితే.. నేను వంటలు బాగా చేస్తాను. మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు నా చేతి వంట బాగుందని తరచూ అనేవారు. అలా వాళ్ల పొగడ్తలే నన్ను ప్రొషెనల్ స్థాయిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రోత్సహించాయి’’ అని ఆమె చెప్పుకొచ్చారు. అలా దేవయాని 2019లో 10 వేల డాలర్ల పెట్టుబడితో(సుమారు రూ. 7 లక్షలు) ఫ్యూజన్ ఫ్లేవర్స్ పేరిట ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆర్డర్ ఇచ్చిన వారికి భారతీయ వంటకాల్ని పంపించడం ప్రారంభించారు. చూస్తుండగానే వ్యాపారం పుంజుకోవడంతో..  ప్రస్తుతం ఆమె నెలసరి ఆదాయం ఏకంగా 8 వేల డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు రూ. ఆరు లక్షలు. ఇక శాకాహారం, మాంసాహారం వండేందుకు ఆమె వేరు వేరు వంటశాలలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఓర్లాండోకు వచ్చే అనేక మంది భారతీయులు శాకాహారం అడుగుతారని దేవయాని పేర్కొన్నారు. పప్పు, అన్నం, కూరలు..ఇలా సింపుల్ వంటకాలనే అడుగుతారని చెప్పారు. అన్నట్టు దేవయాని.. తన రెసీపీల కోసం అప్పుడప్పుడూ యూట్యూబ్ సాయం కూడా తీసుకుంటారు. ఇలా పాకశాస్త్రంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని రెండు చేతులా సంపాదిస్తున్నారు దేవయాని! 



Updated Date - 2022-05-18T01:38:32+05:30 IST