వ్యాపారిపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-05-09T05:37:28+05:30 IST

మొదటి పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎన్‌.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్‌ రాజేష్‌, హోం గార్డు అంకయ్యను వీఆర్‌లోకి పంపుతూ జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

వ్యాపారిపై పోలీసుల దాడి
వ్యాపారిని బలవంతంగా లాక్కెళ్తున్న సిబ్బంది

  వీఆర్‌లోకి ఎస్‌ఐ, ఇద్దరు సిబ్బంది


నరసరావుపేట లీగల్‌, మే 8: మొదటి పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎన్‌.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్‌ రాజేష్‌,  హోం గార్డు అంకయ్యను వీఆర్‌లోకి పంపుతూ జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి... కరోనా నేపథ్యంలో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. అయితే  పల్నాడు బస్టాండ్‌ సెంటర్‌లో నరసయ్య అనే పుస్తకాల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని మొదటి పట్టణ పోలీసులు గమనించారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా దుకాణం ఎందుకు తీశారని ప్రశ్నించారు. దీంతో సదరు వ్యాపారి పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఆగ్రహించిన పోలీసు సిబ్బంది వ్యాపారిని స్టేషన్‌కు రమ్మని చెప్పారు. ఇందుకు నిరాకరించటంతో సిబ్బంది సదరు వ్యాపారిపై చేయి చేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా అతనిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. దుకాణం వద్ద జరిగిన ఈ ఘటన అంతా సీసీ కెమేరాలో రికార్డు అయింది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన సదరు వ్యాపారి సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోను న్యాయవాదుల సాయంతో పోలీసు ఉన్నతాధికారులకు పంపారు. స్పందించిన ఉన్నతాధికారులు ఆ ముగ్గురిని వీఆర్‌లోకి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.  

Updated Date - 2021-05-09T05:37:28+05:30 IST