పారిశుధ్యం.. ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2022-09-15T05:44:41+05:30 IST

నరసరావుపేట జిల్లా కేంద్రంగా మారింది. పట్టణవాసుల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు.. పారిశుధ్యానికి రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు...

పారిశుధ్యం.. ప్రశ్నార్థకం
మున్సిపాల్టీ ఏర్పాటు చేసుకున్న అద్దె ఆటోలు

ఏటా రూ.15.88 కోట్లు వ్యయం

రూ.కోట్లు వెచ్చిస్తున్నా కానిరాని పరిశుభ్రత

దోమలు, అనారోగ్యాలతో పట్టణవాసుల అవస్థలు

చెత్త పన్ను వసూలు చేస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే

అద్దె ఆటోలతో నరసరావుపేట మున్సిపాలిటీపై ఆర్థిక భారం


నరసరావుపేట, సెప్టెంబరు 14: నరసరావుపేట జిల్లా కేంద్రంగా మారింది. పట్టణవాసుల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు.. పారిశుధ్యానికి రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు... అయినా పుర వీధుల్లో  ఎక్కడి చెత్త అక్కడే ఉంది. పరిశుభ్రత అంతంతగానే ఉంది. వీధుల్లో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తున్నది. ప్రజలు మురుగు, అనారోగ్యాలతో అల్లాడుతున్నారు. పారిశుధ్యం మెరుగుదలకు ఏటా రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తున్నా పరిశుభ్రత ప్రశ్నార్థకంగానే ఉంది. మున్సిపాల్టీలో పారిశుధ్య పనుల నిర్వహణలో లోపాలు చోటు చేసుకుంటున్నాయి. మురుగు కాల్వల్లో పూడికతీత కూడా నామమాత్రంగా ఉంది. కాల్వల్లో మురుగు నిలిచి దోమల వ్యాప్తి అధికమైంది. దోమ కాటుకు గురై పట్టణవాసులు అనారోగ్యం పాలౌతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్‌ మొక్కుబడిగా జరుగుతున్నది. పరిశుభ్రత మాట ఎలా ఉన్నా ఇంటికి నెలకు రూ.60 చొప్పున చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు 68 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటి నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గత మార్చిలో క్లాప్‌ పథకాన్ని పట్టణంలో అమల్లోకి తీసుకోచ్చారు. అయితే ఈ పథకం సత్ఫలితాలు ఇవ్వడంలేదు. మున్సిపాల్టీపై క్లాప్‌ ఆర్థిక భారాన్ని మోపిందే తప్ప పారిశుధ్యం మెరుగుపడటంలేదు. ఆటోల ద్వారా ఇంటింట నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడంలేదు. చెత్త సేకరణకు 23 ఆటోలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఆటోకు నెలకు రూ.63,600 అద్దె చెల్లిస్తున్నారు. నెలకు ఆటోలకు రూ.14,62,800 మున్సిపాల్టీ చెల్లిస్తున్నది. ప్రైవేట్‌ ఏజన్సీకి ఆటోల ద్వారా చెత్త సేకరణ భాధ్యతలను అప్పగించారు. గతంలో ఇళ్ల నుంచి తోపుడు బండ్ల ద్వారా చెత్త సేకరణ జరిగేది. వీటి స్థానంలో ఆటోలు ఏర్పాటు చేసినా చెత్త సేకరణలో ఎటువంటి మార్పులేదు. వ్యర్థాల తరలింపునకు ఆటోలతో పాటు 14 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. నిత్యం ఉత్పత్తి అయ్యే 68 టన్నుల వ్యర్థాల్లో జిందాల్‌ పవర్‌ ప్లాంట్‌కు కేవలం 21 టన్నులు మాత్రమే తరలిస్తున్నారు. మిగతా వ్యర్థాలను కంపోస్తు యార్డుకు తరలిస్తున్నారు.  


పారిశుధ్య కార్మికుల జీతాలకే రూ.కోటి

పారిశుధ్య పనులకు పర్మినెంట్‌ కార్మికులు 68 మంది, కాంట్రాక్ట్‌ కార్మికులు 327 మంది ఉన్నారు. ఒక్కో కాంట్రాక్ట్‌ కార్మికుడికి రూ.21 వేలు నెలకు వేతనం చెల్లిస్తున్నారు. నెలకు దాదాపు కార్మికులకు రూ.కోటి రెండు లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఆటోల అద్దె నెలకు రూ.14,62,800, వాహనాల ఇందనానికి నెలకు సూమారు 3 లక్షలు, పారిశుధ్య సామగ్రికి లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. మొత్తం మీద పారిశుధ్య పనులకు దాదాపుగా ఏటా రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇంత పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నా పరిశుభ్రతను ప్రజలకు అందించడంలో పురపాలకులు విఫలమౌతున్నారన్న విమర్శలున్నాయి.


సచివాలయ కార్యదర్శుల పర్యవేక్షణ లేదాయో

వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా పారిశుధ్యంపై పర్యవేక్షణకు శానిటేషన్‌ కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. పట్టణంలో 33 మంది కార్యదర్శులు ఉన్నారు. ప్రతి రోజు తన వార్డు పరిధిలో పారిశుధ్య పనులను ఈ కార్యదర్శులు విధిగా పర్యవేక్షించాలి. ఈ కార్యదర్శులకు నెలకు దాదాపు రూ.8.58 లక్షలు ప్రభుత్వం వేతనంగా చెల్లిస్తున్నది. అయినా పారిశుధ్యంపై వీరి పర్యవేక్షణ కొరవడిందని క్షేత్రస్థాయి పరిస్థితులు చేస్తే అర్థమవుతుంది. కార్యదర్శుల విధులపై మున్సిపల్‌ ఆధికారుల పర్యవేక్షణ కూడా కొరవడిందన్న ఆరోపణలున్నాయి. 

Updated Date - 2022-09-15T05:44:41+05:30 IST