ఎన్నాళ్లిలా.. జాప్యం

ABN , First Publish Date - 2022-09-20T06:33:19+05:30 IST

పేదలకు వైద్యసేవలు అందించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఏరియా ప్రభుత్వం ఆస్పత్రిలో వసతులు లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు.

ఎన్నాళ్లిలా..   జాప్యం
ఆస్పత్రిలో వైద్యం కోసం క్యూలో ఉన్న రోగులు

ఈ ఆస్పత్రికి మోక్షం ఎప్పుడో..?

వైద్యసేవలు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం

ఎప్పటికప్పుడు వాయిదా

పాత భవనంలో వసతులు లేక రోగులు అగచాట్లు

ఇంకా భర్తీ కాని వైద్యుల పోస్టులు

 

నరసరావుపేట, సెప్టెంబరు19: పేదలకు వైద్యసేవలు అందించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఏరియా ప్రభుత్వం ఆస్పత్రిలో వసతులు లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో చిత్తశుద్ధి కొరవడింది. ఏనెలకానెల ఆస్పత్రి భవనాన్ని వినియోగంలోకి తీసుకువస్తామని ప్రకటిస్తున్నారే తప్ప ఆచరణ కనిపించడంలేదు. అన్ని వసతులు, ఆధునిక వైద్యపరికరాలు ఉన్న ఆస్పత్రి నిరుపయోగంగా వదలివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  పైగా నెలలు తరబడి వైద్యశాలలో వైద్యుల కొరత ఉన్నా నియామకాలు జరగడంలేదు. 200 పడకల ఏరియా వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసి వైద్య ఆరోగ్యశాఖ చేతులు దులుపుకొంది. ఇందుకు తగ్గట్టు వైద్యులు, సిబ్బంది నియమించడంతో పాటు వసతులు పెంచడాన్ని విస్మరించింది. 

 

నరసరావుపేటలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత రోగులను పట్టి పీడిస్తోంది. నెలల తరబడి ఇక్కడి వైద్యశాలకు వైద్యుల నియమాకాలు జరగడంలేదు. ఒక్క వైద్యుడు మాత్రమే ఇక్కడ విధుల్లో చేరారు. ఇంకా ఏడుగురు వైద్యులను నియమించాల్సి ఉంది. వంద పడకల ఆస్పత్రిని రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం దాదాపు 44 మంది డాక్టర్లు, 110 మంది స్టాఫ్‌ ఉండాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రకటించారు. ఈ స్థాయిలో వైద్య సిబ్బందిని ఇంకా నియమించలేదు. వంద పడలకల ఆస్పత్రి సరిపడా ఉండాల్సిన వైద్యసిబ్బంది ఇక్కడ లేరు.  


లింగంగుంట్లలో నిర్మించిన వైద్యశాల భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంలేదు. ఈ భవనంలో ఓపీ, తల్లి పిల్లల విభాగం మినహా అన్ని విభాగాలు ప్రారంభించాల్సి ఉంది. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఐసీయూలు అదునాతన వైద్య సేవలను అందించే విధంగా ఈ భవనంలో ఏర్పాట్లు చేశారు. ఈ వైద్య పరికరాలు కూడా మూలనపడేయడం విమర్శలకు దారితీస్తోంది. ఐదు నెలలుగా అదుగో ఇదుగో అంటున్నారే తప్ప ఈ భవనాన్ని రోగులకు అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు లేవనే చెప్పాలి. 


 ఏరియా వైద్యశాలలో అరకొర వసతులతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. 500 మందికి పైగా ఇక్కడ వైద్యం కోసం వస్తారు. 100 పడకల వైద్యశాల అయినా 150 వరకు రోగులు ఉంటారు. నేత్ర వైద్య విభాగాన్ని కూడా ప్రసూతి విభాగానికి వినియోగిస్తున్నారు. ఈ విభాగంలో పూర్తిస్థాయి వసతులు లేక డెలివరీలకు వస్తున్న మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో  గాయపడిన వారికి వైద్యం అందడంలేదు. వైద్యుల నియామకం జరుగుతోందని ఏపీవీవీపీ జిల్లా కోఆర్డినేటర్‌ బి.వెంకటరంగారావు తెలిపారు. రానున్న వారంలో వైద్యుల పోస్టులు భర్తీ అవుతాయని చెప్పారు. కొత్త భవనాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెలాఖరుకు ఈ భవనంలో ఓపీ సేవలు ప్రారంభిస్తామన్నారు. తల్లీపిల్లల విభాగం పాత భవనాల్లో ఉంటుందని, మిగతా అన్ని విభాగాలను కొత్త భవనంలోకి మార్చనున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-09-20T06:33:19+05:30 IST