ధరాభారం

ABN , First Publish Date - 2021-10-29T05:51:22+05:30 IST

భవన నిర్మాణ మెటీరియల్‌ ధరలు దూకుడును పెంచాయి..

ధరాభారం

 నిర్మాణ రంగ సామగ్రి ధరలకు రెక్కలు

సిమెంట్‌ బస్తాకు రూ.50 పెరుగుదల

టన్ను ఇసుక ధర రూ.1600

ఇనుము రేటూ పెరిగింది..

మిగిలిన మెటీరియల్‌ ధరలు అదేబాటన..

నెలలో దాదాపు 20 శాతం పెరిగిన నిర్మాణ వ్యయం

కుదేలవుతున్న నిర్మాణ రంగం

గుడ్లు తేలేస్తున్న నిర్మాణదారులు

ధరల పెరుగుదలపై కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ

  

ఇసుక, సిమెంటు రేట్లకు రెక్కలొచ్చాయి... ఇనుము, ఇతర గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి సిమెంట్‌తో ప్రారంభమై నిర్మాణ రంగ సామాగ్రి  ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతూ వచ్చాయి. దీంతో నిర్మాణ వ్యయం 20 శాతం పెరిగిందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అదుపులేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు.. బ్లాక్‌మార్కెట్‌.. వెరసి మెటీరియల్‌ ధరలపై ప్రభావం పడి నిర్మాణదారులు గుడ్లు తేలేస్తున్నారు. ప్రభుత్వం తన చేతిలో ఉన్న ఇసుక ధర అయినా నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

 

నరసరావుపేట, అక్టోబరు 28: భవన నిర్మాణ మెటీరియల్‌ ధరలు దూకుడును పెంచాయి..  నిర్మాణానికి వినియోగించే ప్రతి వస్తువు రేటు మార్కెట్‌లో పెరిగింది... సిమెంట్‌ నుంచి ఇసుక వరకు, ఇనుము నుంచి టైల్స్‌ వరకు అన్ని రేట్లు అక్టోబరు నెలలో అమాంతం పెరిగాయి. వీటి రేట్ల పెరుగుదలకు ఇంధన ధరలు పెరుగుదల కూడా కారణంగా ఉంది. మరో వైపు సిమెంట్‌ కంపెనీలు సిండికేట్‌ అయి ఒక్కసారిగా బస్తాకు రూ.50 ధరను పెంచాయని నిర్మాణదారులు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క తెలంగాణ కంటే మన రాష్ట్రంలో సిమెంట్‌ ధరలు 20 శాతం ఎక్కువుగా ఉన్నట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


నెలలోనే తీవ్ర వ్యత్యాసం.. 

 నిర్మాణరంగానికి అక్టోబరు నెల కలిసిరాలేదు. ఈ నెల నిర్మాణదారులపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపింది. ఈ నెల 6వ తేదీ నుంచి సిమెంట్‌తో ప్రారంభమై నిర్మాణ రంగ సామాగ్రి ఒక్కొక్కటిగా ధరలు పెరుగుతూ వచ్చాయి. భవన నిర్మాణ వ్యయం 20 శాతం పెరిగిందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదలతో నిర్మాణాలను నిలిపివేయాల్సి పరిస్థితులు దాపురించడం కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం ఇసుక విక్రయాల బాధ్యతను ప్రైవేట్‌ ఏజన్సీకి అప్పగించింది. దీంతో ఇసుక ధరల నియంత్రణ కొరవడింది. నెల రోజుల్లోనే టన్ను ఇసుక ధర రూ.800, రూ.900 నుంచి రూ.1600కి చేరింది. అంటే దాదాపు ధర రెట్టింపు అయింది. ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక ధర నరసరావుపేటలో రూ.6,000 నుంచి రూ.6,700 వరకు పలుకుతోంది. ఇసుక బ్లాక్‌ మార్కెట్‌ దారుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఇష్టారాజ్యంగా ఇసుక ధరలను పెంచి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి జిల్లా అంతటా నెలకొంది. 


కంపెనీల ఇష్టారాజ్యం..

 సిమెంట్‌ ధరలకు కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయని నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బ్రాండ్‌ సిమెంట్‌ బస్తా ధర రూ.50 పెరిగింది. దీంతో సిమెంట్‌ రకాలను బట్టి రూ.390 నుంచి రూ.440 వరకు రిటైల్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇనుము టన్నుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ధర పెరిగింది. ఇటుక ధర కూడా గణనీయంగా పెరిగింది. వెయ్యి ఇటుకల ధర గత నెలలో రూ.6000 వేలు ఉండగా ఈ నెలలో రూ.7,200కు పెరిగింది. అద్దంకి ఇటుకకు కొరత ఏర్పడినట్టు నిర్మాణదారులు తెలిపారు. ఫ్లోరింగ్‌, గోడలకు వాడే టైల్స్‌ ధర అడుగుకు రూ.5 నుంచి రూ.6 వరకు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. శానిటరీ, ఎలక్ర్టికల్‌ మెటీరియల్‌ కూడా 10 నుంచి 20 శాతం వరకు రేట్లు పెరిగాయని వ్యాపారులు చెప్పారు. కబ్‌ బోర్డు బల్లలకు వినియోగించే ఐరన్‌ మెష్‌ అడుగుకు రూ.2 పెరిగిందని, అల్యూమినియమ్‌ బీడింగ్‌ ధర కూడా పెరిగిందని సదరు నిర్మాణదారులు తెలిపారు. ఇంధనం ధరలు పెరిగినంత కాలం టైల్స్‌ తదితర మెటీరియల్‌ ధరలు పెరుగుతాయని సదరు వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. 


నిర్మాణ వ్యయం 20 శాతం పెరుగుదల..

భవన నిర్మాణానికి వినియోగించే సిమెంట్‌ నుంచి ఇటుక వరకు అన్ని మెటీరియల్‌ రేట్లు గణనీయంగా పెరగడంతో ఈ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతోంది. మెటీరియల్‌ ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం 20 నుంచి 25 శాతం పెరుగుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఒక్క నెలలోనే ఈ వ్యాత్యాసం వచ్చిందని తెలిపారు. ధరల పెరుగుదల ఇలానే కొనసాగితే భవనాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోతాయని వారు అంటున్నారు. తన చేతిలో ఉన్న ఇసుక ధరనైనా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్మాణదారులు కోరుతున్నారు. సిమెంట్‌ ధర తెలంగాణలో ఎంత ఉందో అంతకు మన రాష్ట్రంలో తగ్గించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  ధరలను నియంత్రించి నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం కాపాడాలని నిర్మాణదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-29T05:51:22+05:30 IST