విద్యుదుత్పత్తి కర్మాగారాలకు బొగ్గు నిరంతరం అందిస్తున్నాం : ఎన్‌టీపీసీ

ABN , First Publish Date - 2022-04-29T19:50:45+05:30 IST

విద్యుదుత్పత్తి కర్మాగారాల్లో రెండు రోజులకు సరిపోయే

విద్యుదుత్పత్తి కర్మాగారాలకు బొగ్గు నిరంతరం అందిస్తున్నాం : ఎన్‌టీపీసీ

న్యూఢిల్లీ : విద్యుదుత్పత్తి కర్మాగారాల్లో రెండు రోజులకు సరిపోయే బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని ఢిల్లీ ప్రభుత్వం చెప్తుండటంపై నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) స్పందించింది. దాద్రి-2, ఊంచహార్ పవర్ ప్లాంట్స్‌కు క్రమబద్ధంగా నిత్యం బొగ్గు సరఫరా అవుతోందని, ఈ రెండూ పరిపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. 


ఎన్‌టీపీసీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుతం ఊంచహార్, దాద్రి స్టేషన్లు గ్రిడ్‌కు 100 శాతం కన్నా ఎక్కువ రేటెడ్ కెపాసిటీని తెలియజేస్తున్నాయని తెలిపింది. ఊంచహార్ యూనిట్-1 మినహా ఊంచహార్, దాద్రిలోని అన్ని యూనిట్లు పరిపూర్ణ లోడ్ కెపాసిటీతో పని చేస్తున్నట్లు తెలిపింది. ఊచహార్ యూనిట్ 1లో ప్రణాళిక ప్రకారం వార్షిక ఓవర్‌హాల్ జరుగుతోందని పేర్కొంది. దాద్రిలో ఆరు యూనిట్లు ఉన్నాయని, ఇవన్నీ సంపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. అదేవిధంగా ఊంచహార్‌లో ఐదు యూనిట్లు సంపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం దాద్రి స్టేషన్‌లో 1,40,000 ఎంటీలు, ఊంచహార్‌లో 95,000 ఎంటీల బొగ్గు ఉందని తెలిపింది. నిత్యం క్రమబద్ధంగా బొగ్గు సరఫరా అవుతోందని పేర్కొంది. దిగుమతి చేసుకున్న బొగ్గును సరఫరా చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించింది. 


రాష్ట్ర ప్రభుత్వ ఆందోళన

ఢిల్లీకి   విద్యుత్తును సరఫరా చేస్తున్న ఐదు విద్యుదుత్పత్తి కర్మాగారాల్లో రెండిటిలో బొగ్గు కేవలం ఒకటి లేదా రెండు రోజులకు సరిపడినంత మాత్రమే ఉందని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. తగినంత బొగ్గును సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దాద్రి-2లో ఒక రోజుకు, ఊంచహార్‌లో రెండు రోజులకు సరిపడినంత బొగ్గు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. 


ఢిల్లీ రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి సత్యేందర్ జైన్ గురువారం మాట్లాడుతూ, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్‌లను నిరోధించడంలో ఈ విద్యుదుత్పత్తి కర్మాగారాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఆసుపత్రులు, వేసవి కాలంలో అనేక ప్రాంతాలకు విద్యుత్తును సరఫరా చేయడానికి ఈ ప్లాంట్లు చాలా అవసరమని తెలిపారు. 


వేసవి కాలంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతుండటంతో గత వారంలో విద్యుదుత్పత్తి కర్మాగారాలకు తగినంత బొగ్గు అందుబాటులో ఉండటం లేదని చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రవాణా తదితర అంశాలకు సంబంధించిన సమస్యల వల్ల బొగ్గు సరఫరాలో వేగం తగ్గడంతో కొన్ని రాష్ట్రాలు లోడ్ షెడ్డింగ్‌ చేస్తున్నాయి. 


Updated Date - 2022-04-29T19:50:45+05:30 IST