వాషింగ్టన్ డీసీలో NTR శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-28T01:58:44+05:30 IST

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భాను మాగులూరి అధ్యక్షతన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కేక్ కటింగ్‌తో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

వాషింగ్టన్ డీసీలో NTR శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భాను మాగులూరి అధ్యక్షతన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కేక్ కటింగ్‌తో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. సభికులు.. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెలుగుజాతి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. నందమూరి తారక రామారావు జయంతి వేళ సంబరాలు అంబరాన్నంటుతున్న సమయంలో, ఆయన స్మరణం సదా సంతోషదాయకమన్నారు. ప్రజా జీవితంలో, రాష్ట్ర రాజకీయాలలో ప్రమాణాలు, విలువల గురించి చెప్పుకున్నప్పుడల్లా ముందుగా గుర్తుకొచ్చేది ఆ మహోన్నత వ్యక్తేనని చెప్పారు. భారత రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల వ్యవస్థకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన చారిత్రక మూర్తి అని, తెలుగుదనపు తియ్యదనాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలిసేలా చేసిన తెలుగు వల్లభుడు ఎన్టీఆర్ అని అన్నారు.


నూతక్కి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని చెప్పారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారాలుగా మారిన నేపథ్యంలో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవకు పాతరేసిన తరుణంలో ఎన్టీఆర్ నీతి, నిజాయతీ, పట్టుదల, సాహసం ప్రతిఒక్క తెలుగువాడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. రాజకీయాలలో ఉన్నది పుష్కర కాలమే అయినా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఖ్యాతిని, చరిష్మాను ప్రపంచ దేశాలు కొనియాడాయని తెలిపారు. జాతి నిర్మాణం వైపు ప్రజలను జాగృతం చేసి తన ఆలోచనలు, ఆవేశంతో నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, గోరంట్ల పున్నయ్య చౌదరి, సామినేని కోటేశ్వరరావు, ఉయ్యూరు శ్రీనివాసరావు, రామ్ చౌదరి ఉప్పులూరి, చంద్ర మల్లావతు, రమాకాంత్ కోమ, రమేష్ అవిరినేని, అనిత మన్నవ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-28T01:58:44+05:30 IST