శకపురుషుడి శతజయంతి

ABN , First Publish Date - 2022-05-24T06:09:47+05:30 IST

శకపురుషుడి శతజయంతి

శకపురుషుడి శతజయంతి

28న నిమ్మకూరులో వేడుకలు ప్రారంభం

హాజరుకానున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, 

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు

ఊపందుకున్న ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు 


పామర్రు, మే 23 : తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన మహోన్నతుడు, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు శతజయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలమైన పామర్రు మండలం నిమ్మకూరులో ఈనెల 28న జరగనున్నాయి. ఇందుకోసం స్థానిక ఎన్టీఆర్‌ బసవతారకం ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. నేటితరం సినీ, రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకుడిగా, యుగపురుషుడిగా సుస్థిరస్థానం పొందిన అన్న ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఆరోజు నిమ్మకూరులో జరిగే వేడుకలను హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ ప్రారంభిస్తారు. 2023, మే 28 వరకు 365 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ‘శకపురుషుడి శతజయంతి’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా బాలయ్య, గౌరవ చైర్మన్‌గా జయకృష్ణ, కన్వీనర్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో వారానికి ఐదు సినీ ప్రదర్శనలు, నెలకు రెండు పురస్కారాలు అందజేస్తారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ అభిమానులు, కుటుంబసభ్యులు, టీడీపీ ప్రముఖులు కూడా హాజరవుతారు. అతిరథుల రాకను పురస్కరించుకుని నిమ్మకూరులో స్వాగత బ్యానర్లు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-05-24T06:09:47+05:30 IST