తెలుగుజాతి వెలుగు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-05-29T07:48:03+05:30 IST

తెలుగుజాతి వెలుగు ఎన్టీఆర్‌

తెలుగుజాతి వెలుగు ఎన్టీఆర్‌

మహానాడులో చంద్రబాబు నివాళి

ఒంగోలు, మే 28(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు ప్రజల పౌరుషానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావు తెలుగు జాతి వెలుగు. ఆ మహానేతను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో సాగితే ఆపజయం అన్నది ఉండదు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ 99వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఒంగోలులోని ఆయన కాంస్య విగ్రహానికి అచ్చెన్నాయుడు, చిన రాజప్ప, కొల్లు రవీంద్ర, రవీంద్రకుమార్‌ తదితరులతో కలిసి చంద్రబాబు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి నాయకులకు తినిపించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ప్రజల కోసం సినిమా రంగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ పేదల కోసం పరితపించారని కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు పాలనలో సంస్కరణలు తెచ్చారన్నారు. మహానాడుకు వైసీపీ అనేక ఆటంకాలు కలిగించిందనీ, కుయుక్తులు పన్నిందని మండిపడ్డారు. జనం రాకుండా చేసేందుకు బస్సులు ఇవ్వకుండా ఉండటంతోపాటు ఒంగోలులో జరిగే సభకు ప్రజలు రాకుండా కుయుక్తులు పన్నిందని విమర్శించారు. జనం టీడీపీ సభకు వస్తుండగా మంత్రుల యాత్రకు బస్సులు మాత్రమే వెళ్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒంగోలు ఇన్‌చార్జి దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు నగరంలో భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. మహానాడు నేపథ్యంలో టంగుటూరులో బస చేసిన లోకేశ్‌ అక్కడ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. కొండపి ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. 

Updated Date - 2022-05-29T07:48:03+05:30 IST