ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని పట్టించుకోరేం?

ABN , First Publish Date - 2022-08-08T05:45:13+05:30 IST

అనకాపల్లి పట్టణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు స్థానిక ట్యాంకు బండ్‌ పార్కులో ఆస్పత్రి భవనం నిర్మించడానికి సంకల్పించారు.

ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని పట్టించుకోరేం?
ఎన్‌టీఆర్‌ ప్రభుత్వాస్పత్రి

- శిథిలావస్థకు చేరుతున్న భవనం

- పిల్లర్లు పెచ్చులూడి ఊచలు బయటకు వచ్చిన వైనం

- బీటలు వారిన గోడలు

- ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రోగుల్లో ఆందోళన

అనకాపల్లి జిల్లాలో అత్యంత ప్రాధాన్యం గల ఎన్టీఆర్‌ వైద్యాలయం శిథిలావస్థకు చేరుకుంటోంది. భవనాన్ని ప్రారంభించిన రెండు దశాబ్దాలకే మరమ్మతులకు గురైంది. స్తంభాలు పగిలిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. గోడలు బీటలువారిపోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. 

అనకాపల్లి అర్బన్‌, ఆగస్టు 7: అనకాపల్లి పట్టణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు స్థానిక ట్యాంకు బండ్‌ పార్కులో ఆస్పత్రి భవనం నిర్మించడానికి సంకల్పించారు. ఈ పార్కు 5.37 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. పార్కు మధ్యన చిన్నపాటి చెరువు కూడా ఉండేది. ఆ చెరువును పూడ్చేసి రూ.5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. అన్ని హంగులతో ఆస్పత్రిని నిర్మించడమే కాకుండా వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని 2002లో అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. అలాగే 2012లో మాతా శిశు సంక్షేమ కేంద్రం భవనానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ భవనంలో కేవలం ప్రసూతికి సంబంధించిన 150 పడకలను ఏర్పాటు చేశారు. 2017 ఏప్రిల్‌ 11న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవనాన్ని ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 250 పడకల ఆస్పత్రి ఏర్పాటు అయింది. అయితే ఈ ఆస్పత్రిలో ముందుగా నిర్మించిన భవనానికి సంబంధించిన స్తంభాలు బీటలువారి పెచ్చులూడి పడిపోతున్నాయి. అలాగే గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇనుప ఊచలు బయట పడడంతో స్తంభాల్లో పటుత్వం కోల్పోతోంది. ఇప్పటికే ఈ స్తంభాలకు మరమ్మతులు చేసి ఉంటే కాస్త మెరుగుపడి ఉండేవి. కానీ అధికారులు పట్టించుకోలేదు. స్తంభాలన్నీ ఇదే మాదిరిగా బలహీనపడితే భవనం పరిస్థితి ఏమిటని అక్కడకు వచ్చే రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ భవనానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-08-08T05:45:13+05:30 IST