నిధుల సమీకరణకు నుడా కసరత్తు

ABN , First Publish Date - 2022-02-04T06:00:45+05:30 IST

హైదరాబాద్‌లోని ఉప్పల్‌, భగాయత్‌లో ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి ప్లాట్లుగా విక్రయించడంతో ప్రభుత్వానికి రూ.2వేలకోట్ల ఆదాయం సమకూరింది. ఆ ఆదాయాన్ని పూర్తిగా హైదరాబాద్‌లో రింగురోడ్లు, పార్కులు, అండర్‌ బ్రిడ్జిలు వంటి అభివృద్ధి పనులకు కేటాయించారు. ఈ పనులతో కొత్త ప్రాంతాల్లోని భూములకు డిమాండ్‌ పెరిగింది. సరిగ్గా ఇదే తరహాలో నుడా (నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) పనిచేయనుంది.

నిధుల సమీకరణకు నుడా కసరత్తు
వరంగల్‌ జిల్లాలోని భద్రకాళి ట్యాంక్‌బండ్‌

దేవరకొండ రోడ్డులో 50 ఎకరాల్లో వెంచర్‌

అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

అనుమతులు, ఆదాయం ఇక అన్నీ స్థానికంగానే

రెండు నెలల్లో పొలిటికల్‌ కమిటీ

రూ.445కోట్లతో తొలి దశ అభివృద్ధి పనులు

పలు పనులకు వారంలో టెండర్లు

వరంగల్‌ ట్యాంక్‌బండ్‌, జంక్షన్ల మోడళ్లకు ఓకే

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

హైదరాబాద్‌లోని ఉప్పల్‌, భగాయత్‌లో ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి ప్లాట్లుగా విక్రయించడంతో ప్రభుత్వానికి రూ.2వేలకోట్ల ఆదాయం సమకూరింది. ఆ ఆదాయాన్ని పూర్తిగా హైదరాబాద్‌లో రింగురోడ్లు, పార్కులు, అండర్‌ బ్రిడ్జిలు వంటి అభివృద్ధి పనులకు కేటాయించారు. ఈ పనులతో కొత్త ప్రాంతాల్లోని భూములకు డిమాండ్‌ పెరిగింది. సరిగ్గా ఇదే తరహాలో నుడా (నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) పనిచేయనుంది.

నుడా పరిధిలో భూముల అమ్మకమే కాదు పన్నుల వసూళ్లు, నిర్మాణాల అనుమతులకు ఇకనుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన పనిలేదు. అవన్నీ స్థానికంగానే జరిగిపోతాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని నుడా పరిధిలోని వార్డులు, గ్రామాల జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తారు. 43 గ్రామాలు, 48 మునిసిపల్‌ వార్డుల్లో అభివృద్ధి పనులు, అనుమతులు నుడా పరిఽధిలోకి రానున్నాయి. గ్రామాలు, పట్టణాల అనుసంధానం, లింక్‌రోడ్ల నిర్మాణంతో భూముల విలువ పెంచడంపైనే నుడా దృష్టిపెట్టనుంది. ఇల్లు, అపార్టుమెంట్లు, పరిశ్రమలకు ఇప్పటి వరకు అలవోకగా, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసేవారు. నుడా ఏర్పాటుతో ఇకనుంచి ప్రతీ దానికి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక సకాలంలో పన్నుల వసూళ్లతో నుడా నిధులు సమకూర్చుకోనుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు తోడవ్వనున్నాయి. మొత్తానికి స్థానిక నిధులు స్థానికంగానే వినియోగించనున్నారు.

50 ఎకరాల్లో వెంచర్‌

దేవరకొండ రోడ్డులో కతాల్‌గూడ సమీపంలోని హౌసింగ్‌బోర్డు సొసైటీ కొన్ని ఇళ్లను నిర్మించింది. దీని వెనుక భాగంలో సుమారు 50 ఎకరాల ప్రభత్వు భూమి అందుబాటులో ఉంది. తొలుత ఈ భూమిని స్వాధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో నుడా చైర్మన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి ఆ పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నుడాకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయగా, రానున్న రెండు నెలల్లో పొలిటికల్‌ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.

చకచకా అభివృద్ధి పనులు

గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నల్లగొండకు మహర్దశ చేకూరనుంది. రూ.445కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (నుడా)ని ఏర్పాటైంది. నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని జంక్షన్లు, రోడ్ల విస్తరణతోపాటు ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. రూ.2.50కోట్లతో వల్లభరావు చెరువు అభివృద్ధి, రూ.4.50కోట్లతో వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి మునుగోడు రోడ్డులోని ఈద్గా వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు రాంనగర్‌లోని వైఎ్‌సఆర్‌ పార్కుకు రూ.50లక్షలు, రాజీవ్‌ పార్కుకు రూ.50లక్షలు కేటాయించారు. పార్కుల్లో పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో రైతుబజార్‌ నిర్మాణానికి రూ.50లక్షలు కేటాయించారు. ఈ నెల మొదటి వారంలో టెండర్లు ఆహ్వానించి, పనులను వేగవంతం చేయనున్నారు. ప్రస్తుతం నుడాకు చైర్మన్‌గా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వైస్‌ చైర్మన్‌గా మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి ఉన్నారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఫైనాన్స్‌, టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించింది.

రూ.445కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక

నల్లగొండ మునిసిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.445కోట్లతో ప్రణాళిక రూపొందించి అందుకనుగుణంగా పనులు కొనసాగించనున్నారు. రూ.200కోట్లతో అమృత్‌స్కీం ద్వారా విలీన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా రూ.245కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పిలవనున్నారు. అందులో కళాభారతి నిర్మాణానికి రూ.25కోట్లు, శిల్పారామానికి రూ.10కోట్లు, ఉదయ సముద్రం అభివృద్ధికి రూ.45కోట్లు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ కార్యాలయ నిర్మాణానికి రూ.15కోట్లు, చర్లపల్లి వద్ద ఆక్సిజన్‌ పార్కుకు రూ.1కోటి, ఎన్జీ కళాశాల అభివృద్ధికి రూ.38కోట్లు, ఫుట్‌పాత్‌ నిర్మాణానికి రూ.9కోట్లు, ఆర్చీలు, స్వాగత బోర్డులకు రూ.6కోట్లు వ్యయం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని డీఈవో ఆఫీసు నుంచి కలెక్టరేట్‌ వరకు, కలెక్టరేట్‌ నుంచి కేశరాజ్‌పల్లి వరకు, వైఎ్‌సఆర్‌ విగ్రహం నుంచి కతాల్‌గూడ వరకు రోడ్డు విస్తరణకు రూ.38కోట్లు వెచ్చించనున్నారు. వివేకానంద విగ్రహం నుంచి పెద్దబండ వరకు మొత్తం ఎనిమిది జంక్షన్ల కోసం రూ.50కోట్లు కేటాయించారు.

నెరవేరుతున్న సీఎం హామీలు

2018 ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండకు వచ్చిన సీఎం కేసీఆర్‌ పలు వరాలు కురిపించారు. ఆ హామీ మేర కు నుడాను ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేశారు. వీటితో పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, రహదారులు సుందరంగా మారనున్నాయి. దీంతో పట్టణాభివృద్ధితో పాటు మునిసిపాలిటీకి ఆదాయ వనరులు పెరగనున్నాయి. ఆస్తి పన్ను, దుకాణాల అద్దె బకాయిలు, ఇతర పెండింగ్‌ బకాయిలు సైతం వసూలు చేసి అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే నల్లగొండలో ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేయగా, ఎస్‌ఎల్‌బీసీ వద్ద మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యా యి. దీంతో రానున్న రెండేళ్లలో నల్లగొండ రూపురేఖలు మారి కొత్త హంగులు సమకూరనున్నాయి.

వరంగల్‌ ట్యాంక్‌బండ్‌, జంక్షన్ల మోడళ్లు

నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వరంగల్‌ పట్టణాన్ని పరిశీలించి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ సూచించడంతో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బృందం వరంగల్‌ పట్టణాన్ని ఈ నెల 2న సందర్శించింది. అక్కడి ట్యాంక్‌బండ్‌, జంక్షన్లు, సైకిల్‌ ట్రాక్‌, కాళోజీ కళాక్షేత్రం, వైకుంఠధామం తదితర ప్రాంతాన్ని ఈ బృందం సందర్శించింది. వీటిలో ప్రధానంగా ట్యాంక్‌బండ్‌ వారిని ఆకట్టుకుంది. అక్కడి ట్యాంక్‌బండ్‌పై పట్టణ ప్రజలు సేద తీరేందుకు మూడు ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ ట్రాక్‌కు ఇరువైపులా అందమైన పూలచెట్లు తీర్చిదిద్దిన విద్యుత్‌ స్తంభాలు, ఒక ట్రాక్‌ మొత్తం ఆర్చ్‌లు నిర్మించారు. భద్రకాళి ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి రూ.60కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇదే తరహాలో ఉదయసముద్రం ట్యాంక్‌ బండ్‌ను అభివృద్ధి చేయాలని జిల్లా నాయకుల ఆలోచన. ఆ తర్వాత అక్కడి జంక్షన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంబేడ్కర్‌ జంక్షన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం, రాజ్యాంగం మోడల్‌, భారీ లాన్‌, ఆకర్షణీయమైన లైటింగ్‌ ఏర్పాటు చేశారు. నల్లగొండలోనూ ఈ తరహా జంక్షన్లు ఏర్పాటు చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనకు జిల్లా బృందం వచ్చింది. అక్కడి కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం ఇంకా పూర్తికాకపోయినప్పటికీ జిల్లాలో నిర్మించనున్న ఆడిటోరియం ఏ రూపంలో ఉండాలనే దానిపై స్పష్టత వచ్చింది.

నుడా పరిధిలోని గ్రామాలివే

  • నల్లగొండ మండలంలో అమ్మగూడ, అనంతారం, అన్నారెడ్డిగూడెం, అన్నెపర్తి, బుద్ధారం, చందనపల్లి, చెన్నారం, దండంపల్లి, దొనకల్‌, జీకే.అన్నారం, గుండ్లపల్లి, కె.కొండారం, కంచనపల్లి, కాజీరామారం, ఖుదావన్‌పూర్‌, కొత్తపల్లి, మేళ్లదుప్పలపల్లి, ముషంపల్లి, రసూల్‌పుర, సూరారం, తొరగల్‌, వెలుగుపల్లి.
  • తిప్పర్తి మండలంలో తిప్పర్తి, అనిశెట్టిదుప్పలపల్లి, గడ్డికొండారం, గంగన్నపాలెం, జంగారెడ్డిగూడెం, కంకణాలపల్లి, పజ్జూరు, రాజుపేట, తానెదారుపల్లి.
  • కనగల్‌ మండలంలో కనగల్‌, చర్లగౌరారం, ధర్వేశిపురం, జంగమయ్యగూడెం, కనగల్‌, మంగనపల్లి, పర్వతగిరి.
  • కట్టంగూరు మండలంలోని పిట్టంపల్లి, నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం.
  • నకిరేకల్‌ మండలంలోని తెట్టకుంట, మంగళపల్లి.

Updated Date - 2022-02-04T06:00:45+05:30 IST