అత్తారింటి ఎదుట కోడలు నిరీక్షణ

ABN , First Publish Date - 2022-05-17T07:02:41+05:30 IST

న్యాయం కోసం అత్తారింటి ఎదుట కోడలు వారం రోజులుగా నిరీక్షిస్తోంది. తన కుమార్తెతో కలిసి అక్కడే ఎదురుచూస్తుండగా, భర్త, అత్తా మామ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయా రు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో ఈ సంఘటన

అత్తారింటి ఎదుట కోడలు నిరీక్షణ

వారం రోజులుగా కుమార్తెతో పడిగాపులు

పెద్దవూర, మే 16: న్యాయం కోసం అత్తారింటి ఎదుట కోడలు వారం రోజులుగా నిరీక్షిస్తోంది. తన కుమార్తెతో కలిసి అక్కడే ఎదురుచూస్తుండగా, భర్త, అత్తా మామ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయా రు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బాలస్వామి, విజయ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పెద్ద కుమార్తె నందినికి 2009లో పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామానికి చెందిన పెండ్యాల గురువారావు, యాదమ్మల కుమారుడు రవీందర్‌రావుకు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో రూ.2లక్షల కట్నం, ఐదు తులాల బంగారం ఇచ్చారు. వీరికి 11సంవత్సరాల కుమార్తె తన్విశ్రీ ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవిస్తుండగా, రవీందర్‌రావు వైన్స్‌ దుకాణాల వద్ద పనిచేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య కలహాలు ఉండడంతో గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టారు. కాపురానికి తీసుకొచ్చినా మళ్లీ వేధింపులకు గురిచేశాడు. బంధువులు, మిత్రుల వద్ద అప్పులు చేసిన రవీందర్‌రావు వాటిని తీర్చడానికి భార్యను డబ్బులు తీసుకురమ్మని వేధించాడు. డబ్బులు ఇచ్చినా కొన్నాళ్లకు మళ్లీ వేధిస్తుండడంతో నందిని తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లి సంవత్సరన్నరపాటు తమతో ఉంచుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సంవత్సరం క్రితం నందిని, ఆమె కుమార్తెను పెద్దవూర తీసుకువచ్చారు. వారం రోజుల క్రితం భర్త, అత్తామామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవడంతో నందిని, తన కుమార్తెతో ఇంటి బయట ఉంటోంది. దీంతో సమీప గృహస్థులు ఆమెకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. భర్త, అత్తామామలు ఇంటికి తాళం వేయడంపై నందిని ఆదివారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఎస్‌ఐ పరమేష్‌ మాట్లాడుతూ 2019లో హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదై కోర్టులో ఉందని, విడాకుల కోసం భర్త రవీందర్‌రావు మిర్యాలగూడ కోర్టులో దాఖలు చేశారన్నారు. భార్యభర్తల మధ్య తలెత్తిన పరిస్థితులపై షీటీంకు సిఫారుసు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2022-05-17T07:02:41+05:30 IST