Kuwait లో అనూహ్య పరిణామం.. 9నెలల్లో 17శాతం తగ్గిన ఆ కేటగిరీ ప్రవాసులు..!

ABN , First Publish Date - 2022-03-08T14:27:45+05:30 IST

కువైటైజేషన్‌లో భాగంగా గత కొన్నాళ్లుగా కువైత్ సర్కార్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Kuwait లో అనూహ్య పరిణామం.. 9నెలల్లో 17శాతం తగ్గిన ఆ కేటగిరీ ప్రవాసులు..!

కువైత్ సిటీ: కువైటైజేషన్‌లో భాగంగా గత కొన్నాళ్లుగా కువైత్ సర్కార్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానికులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యతనిస్తూ వలసదారులకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దీంతో కువైత్‌లో ప్రవాసుల సంఖ్య తగ్గుతోంది. ఇక 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకైతే చుక్కలు చూపిస్తోంది. మొదట అసలు ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్లు రెన్యూవల్ చేకూడదని నిర్ణయించిన కువైత్.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్లను పునరుద్ధరించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం రద్దు చేసింది. దాంతో ఇటీవలే మళ్లీ వారికి వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేయడం ప్రారంభించింది. 


అయితే, గతేడాది ప్రారంభం నుంచి 60 ఏళ్లు దాటి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల విషయంలో సందిగ్ధం నెలకొనడంతో 2021 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో కలిపి ఈ కేటగిరీ ప్రవాసుల సంఖ్య సుమారు 17 శాతం మేర తగ్గినట్లు తాజాగా వెలువడిన కార్మిక గణాంకాలకు సంబంధించి డేటా సూచిస్తుంది. ఈ తొమ్మిది నెలల వ్యవధిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఈ కేటగిరీ ప్రవాసుల సంఖ్య 81,500 నుంచి 67,980కు పడిపోయింది. అంటే 13,530 మంది ప్రవాసులు కువైత్‌ను వీడారు.  


వీరిలో ప్రభుత్వం రంగానికి చెందిన వారు 1,025 మంది ఉన్నారు. 2021 జనవరిలో 6,065గా ఉన్న వీరి సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి 5,040కు పడిపోయింది. అలాగే ప్రైవేట్ సెక్టార్‌కు చెందిన వారు 12,500 మంది ఉన్నారు. 2021 జనవరిలో 75,450గా ఉన్న వీరి సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి 62,940కు తగ్గింది. ఇదిలాఉంటే.. 2020 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య 12 శాతం పెరిగింది.    

Updated Date - 2022-03-08T14:27:45+05:30 IST