హైదరాబాద్‌కు ఆకాశ మార్గాన క్యూ!

ABN , First Publish Date - 2021-05-09T19:52:45+05:30 IST

దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కొవిడ్‌ బారినపడిన వారు మెరుగైన

హైదరాబాద్‌కు ఆకాశ మార్గాన క్యూ!

  • పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ
  • ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలి వస్తున్న కొవిడ్‌ బాధితులు  
  • ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై నగరానికి..  
  • ఇప్పటికే వంద మంది చేరిక
  • పడకల కోసం మరికొందరి ఎదురు చూపులు

హైదరాబాద్‌ సిటీ : దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కొవిడ్‌ బారినపడిన వారు మెరుగైన చికిత్స నిమిత్తం ఆకాశ మార్గాన నగరానికి చేరుతున్నారు. రోడ్డు మార్గం కంటే త్వరితగతిన చేరుకుని ప్రాణాపాయ స్థితినుంచి బయటపడవచ్చనే పలువురు ఎయిర్‌అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇప్పటికే వంద మంది వరకు కొవిడ్‌ రోగులు నగరానికి చేరుకున్నారు.


  • నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న సినీనటుడు సోన్‌సూద్‌ వెంటనే ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి ఆమెను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజుల చికిత్స అనంతరం శనివారం ఆమె చనిపోయింది. 

  • లోక్నోకు చెందిన బీజేపీ నాయకుడు కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో ఎయిర్‌ అంబులెన్స్‌లో నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. 

  • పాట్నాకు చెందిన ఓ ప్రముఖుడు కరోనా వైర్‌సతో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎక్మా చికిత్స అవసరమైంది. దీంతో అతన్ని వెంటనే ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. 

ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది ఆకాశ మార్గాన హైదరాబాద్‌ నగరానికి కరోనా బాధితులు తరలివస్తున్నారు. పలు రాష్ర్టాల నుంచి భారీ క్యూ కట్టారు. ఇప్పటికే ఇక్కడ పడకలు నిండిపోవడంతో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రావడానికి ఆస్పత్రుల నుంచి గ్రీన్‌సిగ్నల్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఇక్కడికు హుటాహుటిన ఎయిర్‌ అంబులెన్స్‌లో నగరానికి తరలిస్తున్నారు. హైదరాబాద్‌కు వందమంది వరకు ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలి వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలో కొంతమంది కరోనా బాధితులను ఇక్కడకు తరలించడానికి ఎయిర్‌ అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయని,  ఓ వైద్యుడు తెలిపారు.


పలు రాష్ట్రాల నుంచి..

దేశంలోని పలురాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా చికిత్స కోసం తరలి వస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు వంద మంది వరకు కరోనా బాధితులు ఇక్కడకు వచ్చారు. ఢిల్లీ, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, రాజస్థాన్‌, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడకు క్యూ కట్టారు. లోక్నో, పాట్నా, నాగ్‌పూర్‌ ప్రాంతాలకు చెందిన కరోనా బాధితులు ఎయిర్‌ అంబులెన్స్‌లలో వచ్చి అపోలో, యశోద, కాంటినెంటల్‌, కిమ్స్‌, సన్‌షైన్‌ తదితర ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 


నెల రోజుల నుంచే

నెల రోజుల నుంచే పలు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన అంబులెన్స్‌లలో రోగులు ఇక్కడకు రావడం మొదలైంది. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండే వారు అత్యవసరంగా ఎయిర్‌ అంబులెన్స్‌లో చేరుకుంటున్నారు. రోడ్డు మార్గాన అంబులెన్స్‌లో తరలించడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో ప్రముఖులు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 


ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై చాలా మంది ఎయిర్‌ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడకు చేరుకుంటున్నారు. వారికి వెంటనే ఐసీయూ, వెంటిలేటర్లను ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ వైద్యుడు తెలిపారు. వచ్చే వారు చాలా ఆందోళనకర పరిస్థితుల్లోనే ఇక్కడకు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో చాలా మందికి ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండడంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. 


అక్కడ ఐసీయూ పడకలు లేక...

కొన్ని రాష్ట్రాలలో మెరుగైన ఐసీయూ పడకలు, వెంటిలేటర్‌ సదుపాయం లేకపోవడంతో హైదరాబాద్‌ వైపు చూస్తున్నారని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారడంతో ఇక్కడ మెరుగైన వైద్యం లభిస్తుందనే నమ్మకం ఏర్పడంతోనే చాలామంది ఇక్కడ చికిత్స కోసం ఆసక్తి చూపుతున్నారని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో ఐసీయూ, వెంటిలేటర్‌ పడకలు ఎక్కువగా ఉండడం, నిష్ణాతులైన వైద్యులు, ఆధునిక పరికరాలు ఉండడంతో చాలా మంది ఇక్కడకు వస్తున్నారని ఓ వైద్యుడు తెలిపారు.

Updated Date - 2021-05-09T19:52:45+05:30 IST