శ్రీకాళహస్తికి తగ్గిన భక్తుల సంఖ్య

ABN , First Publish Date - 2021-04-22T06:00:56+05:30 IST

కరోనా దెబ్బకు ముక్కంటి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది.

శ్రీకాళహస్తికి తగ్గిన భక్తుల సంఖ్య
భక్తుల్లేక ఖాళీగా దర్శనమిస్తున్న ముక్కంటి ఆలయ క్యూలైన్లు

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 21: కరోనా సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య అధికమైంది. ఈ ప్రభావం శ్రీకాళహస్తీశ్వరాలయంపైనా పడింది. మరోవైపు పలువురు ఆలయ ఉద్యోగులు కూడా కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో ముక్కంటి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. సాధారణంగా సెలవు రోజుల్లో ముక్కంటి ఆలయం రద్దీతో కిటకిటలాడుతుంది. తరలి వచ్చిన భక్తులతో సందడిగా ఉంటుంది. అయితే కరోనా విజృంభణ దృష్ట్యా దూరప్రాంతాల నుంచి శ్రీకాళహస్తికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆదివారం అమావాస్య రోజున భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. అయితే ఈనెల 11న ఆదివారం అమావాస్య నాడు అంతంతమాత్రంగానే భక్తులు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరగడంతో వారం రోజులుగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత తగ్గి పోయింది. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని బుధవారం స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం అధికంగా భక్తులు వస్తారని ఆలయ అఽధికారులు  ఆశించారు. అయితే భక్తుల్లేక ఆలయ క్యూలైన్లు బోసిగా కన్పించాయి. మొత్తం మీద కరోనా ఉధృతి తగ్గేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఆలయాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-04-22T06:00:56+05:30 IST