సబ్జెక్టుల సంఖ్యే ప్రధానం

ABN , First Publish Date - 2022-10-01T07:24:12+05:30 IST

సాధారణంగా బదిలీలు, హేతుబద్ధీకరణ జరిపేటప్పుడు ఒక పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

సబ్జెక్టుల సంఖ్యే ప్రధానం

సాధారణంగా బదిలీలు, హేతుబద్ధీకరణ జరిపేటప్పుడు ఒక పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం కూడా ఇదే చెప్తుంది. కానీ ఒకప్పటితో పోల్చుకుంటే విద్యార్థులకు సబ్జెక్టుల సంఖ్య పెరిగింది. ఉపాధ్యాయులకు బోధనతో పాటు, బోధనేతర పనులు కూడా ఉంటున్నాయి. పైగా తమ పిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఆకాంక్ష తల్లి తండ్రులలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో వివిధ పాఠశాలలకు ఉపాధ్యాయులని కేటాయించేటప్పుడు విద్యార్థుల సంఖ్యతో పాటు, సబ్జెక్టుల సంఖ్యని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పర్వాలేదు. కొన్ని పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది కూడా ఉన్నారు.  కానీ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 50 దాటితే మూడవ ఉపాధ్యాయుడిని కేటాయించాలి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణితం, ఆంగ్లం, హిందీ తదితర సబ్జెక్టులని బోధించడానికి స్కూల్ ఆసిస్టెంట్లు ఉండాలి. ప్రాథమిక స్థాయిలో విద్యా పునాదులు పటిష్టంగా ఉండాలంటే సబ్జెక్టుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలి. ఉపాధ్యాయులు ఉన్నప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలని పాఠశాలలకు పంపుతారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు నిలబడతాయి. రెగ్యులర్ ఉపాధ్యాయులని వెంటనే నియమించకపోయినా, కనీసం విద్యా వలంటీర్లని నియమించాలి. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

– యం.రాం ప్రదీప్

Updated Date - 2022-10-01T07:24:12+05:30 IST