Nupur Sharmaకు భద్రత కల్పించిన ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2022-06-07T22:53:55+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదంలో చిక్కుకుని సస్పెండైన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు..

Nupur Sharmaకు భద్రత కల్పించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదంలో చిక్కుకుని సస్పెండైన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు భద్రత కల్పించారు. తనను చంపుతామంటూ బెదరింపు కాల్స్ వస్తున్నాయంటూ నుపర్ శర్మ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు కొందరు వేధింపులకు పాల్పడుతూ, బెదరింపు కాల్స్ చేస్తున్నారంటూ శర్మ ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో ఆమెకు భద్రత కల్పించినట్టు చెప్పారు. కాగా, తన చిరునామాను బహిర్గతం చేయవద్దని మీడియా సంస్థలు, ప్రజలకు నుపుర్ శర్మ ఒక ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.


నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమర్శలకు దారితీసింది. ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైత్, బహ్రెయిన్, ఇండోనేసియా, ఇరాన్‌తో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అధికారికంగా నిరసనలు తెలిపాయి. క్షమాపణ చెప్పాలని కోరాయి. శర్మ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అన్ని మతాలు, మనోభావాలను భారత్ గౌరవిస్తుందని బీజేపీ ఒక ప్రకటన చేయడంతో పాటు నుపర్ శర్మ, సోషల్ మీడియాలో మహమ్మద్ ప్రవక్తను కించపరచేలా వ్యాఖ్యలు చేసిన మరో నేత నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ వెంటనే నుపుర్ శర్మ ఒక ప్రకటన చేస్తూ, హిందూ దేవుళ్లను అనునిత్యం అవమానిస్తుండటంతో సహించలేకనే తాను వ్యాఖ్యలు చేశానని, అయినప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు.

Updated Date - 2022-06-07T22:53:55+05:30 IST