Nupur Sharma వ్యాఖ్యలపై భగ్గుమన్న అరబ్ ప్రపంచం.. India ఉత్పత్తుల బహిష్కరణ!

ABN , First Publish Date - 2022-06-07T13:58:22+05:30 IST

ఎనిమిదేళ్లుగా గల్ఫ్‌ దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న ప్రధాని మోదీ.. ఇప్పుడు దౌత్యపరంగా సంకట స్థితిలో చిక్కుకున్నారు.

Nupur Sharma వ్యాఖ్యలపై భగ్గుమన్న అరబ్ ప్రపంచం.. India ఉత్పత్తుల బహిష్కరణ!

సౌదీ, బహ్రయిన్‌ సహా గల్ఫ్‌ దేశాల కన్నెర్ర

భారత రాయబారులకు ఖతర్‌, కువైత్‌ సమన్లు

బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యలకు ఖండన

ఇండియా నష్ట నివారణ చర్యలు

ఆర్థిక బంధం చెడకుండా జాగ్రత్తలు

రంగంలోకి సీనియర్‌ దౌత్యవేత్తలు

అవి ప్రభుత్వ వ్యాఖ్యలు కావని వివరణ

బీజేపీ అధికార ప్రతినిధి సస్పెన్షన్‌పై బహ్రయిన్‌, ఖతర్‌, సౌదీ హర్షం

దుబాయ్‌/న్యూఢిల్లీ, జూన్‌ 6: ఎనిమిదేళ్లుగా గల్ఫ్‌ దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న ప్రధాని మోదీ.. ఇప్పుడు దౌత్యపరంగా సంకట స్థితిలో చిక్కుకున్నారు. మహ్మద్‌ ప్రవక్తపై ఆయన పార్టీ బీజేపీకి చెందిన జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ బంధాన్ని ఒక్క కుదుపు కుదిపాయి. ఆ వ్యాఖ్యలపై అరబ్‌ దేశాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేయడంతో పాటు తీవ్ర స్థాయిలో ఖండించాయి. భారత రాయబారులకు సమన్లు పంపి.. తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చాయి. అన్ని మత విశ్వాసాలనూ గౌరవించాలని స్పష్టంచేశాయి. అలాంటి వ్యాఖ్యలను అనుమతించినందుకు భారత ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖతర్‌, కువైత్‌, సౌదీ అరేబియా, ఒమన్‌ డిమాండ్‌ చేశాయి. మన దేశానికి అరబ్‌ దేశాలే అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు కావడం.. చమురు దిగుమతికి సంబంధించి వాటిపైనే ఆధారపడి ఉండడం.. పైగా లక్షల మంది భారతీయులు ఆయా దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండడం.. తదితరాల నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణమే నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. నుపుర్‌ శర్మను బీజేపీ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అలాంటి వ్యాఖ్యలను ట్విటర్‌లో పోస్టుచేసిన బీజేపీ ఢిల్లీ శాఖ మీడియా విభాగం అధిపతి నవీన్‌ జిందాల్‌పై ఏకంగా బహిష్కరణ వేటు వేసింది. అరబ్‌ దేశాలను శాంతపరచేందుకు సీనియర్‌ దౌత్యవేత్తలను కేంద్రం రంగంలోకి దించింది. వారు ఆయా దేశాల దౌత్య అధికారులతో సంప్రదింపులు జరిపి.. పరిస్థితిని తేటపరిచే ప్రయత్నం చేశారు. ప్రవక్తపై నుపుర్‌ వ్యాఖ్యలను భారత ప్రభుత్వ అభిప్రాయాలుగా చూడరాదని.. కొందరు ఉన్మాదుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించడం తగదని పేర్కొన్నారు.


అటు బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. అన్ని మతాలను తాము గౌరవిస్తామని.. మతసంబంధ వ్యక్తులను అవమానించడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యలపై బహ్రెయిన్‌, ఖతర్‌, సౌదీ హర్షం వ్యక్తంచేశాయు. మహ్మద్‌ ప్రవక్తను అవమానించడం.. ముస్లింల మనోభావాలను, మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుందని.. ఇలాంటివాటిని ఖండించాలని బహ్రయిన్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మత, జాతి, వర్గ విద్వేషాలను రెచ్చగొట్టే ఆలోచనలను ప్రతిఘటించాలని పిలుపిచ్చింది. నుపుర్‌ శర్మ సస్పెన్షన్‌ను సౌదీ స్వాగతించింది. ఇస్లాం మత చిహ్నాలు, ఇతర మతాలకు వ్యతిరేకంగా పక్షపాతం చూపడాన్ని తాము ఎప్పుడూ నిరసిస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తమ మత విశ్వాసాలను దెబ్బతీస్తే అది నేరుగా ఆర్థిక సంబంధాలను ప్రభావితం చేస్తుందని ఖతర్‌ విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భారత్‌ బహిరంగంగా ప్రకటించాలని కోరారు. ప్రవక్తపై అనుచిత వ్యా ఖ్యలను యూఏఈ తీవ్రంగా ఖండించింది. నైతిక, మానవ వి లువలను వ్యతిరేకించే ప్రవర్తనను తిరస్కరిస్తామని తెలిపింది. 


ఎందుకింత హడావుడి..?

గల్ఫ్‌ దేశాల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మోదీ ప్రభుత్వం ఎందుకు దౌత్యపరంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది? ఆ దేశాలకు ఎందుకింత ప్రాధాన్యం ఇచ్చింది?ఎందుకంటే.. అరబ్‌ దేశాలతో భారత్‌కు శతాబ్దాల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అనుబంధం ఉంది. మన చమురు, గ్యాస్‌ దిగుమతుల్లో 60ు అక్కడి నుంచే వస్తున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), సౌదీ అరేబియా, ఖతర్‌, కువైత్‌, ఒమన్‌, జోర్డాన్‌, బహ్రెయిన్‌లను గల్ఫ్‌ దేశాలుగా పిలుస్తారు. ఈ దేశాలన్నిటికీ మధ్యధరా సముద్రం(పర్షియన్‌ గల్ఫ్‌) సరిహద్దుగా ఉండడమే దీనికి కారణం(ఇరాన్‌కు కూడా సరిహద్దు ఉంది). వీటిలో ఇరాక్‌ తప్ప మిగతా ఆరు దేశాలూ గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ)లో భాగం. ఈ దేశాలు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. భారత ఎగుమతుల్లో 14 శాతం వాటా వీటిదే. 2021-22లో వీటితో రికార్డు స్థాయిలో భారత్‌ 154.7 బిలియన్‌ డాలర్ల (రూ.12.03 లక్షల కోట్లు) వాణిజ్యం నెరపడం గమనార్హం. ఇదే ఏడాదిలో యూఏఈ, సౌదీ, ఇరాక్‌ మనకు మూడు, నాలుగు, ఐదో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. ఇదే సమయంలో మన దేశం నుంచి జీసీసీ దేశాలకు ఎగుమతుల విలువ 43.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వీటి మధ్య వాణిజ్య లోటు 66.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఈ లోటును పూడ్చేందుకు పెద్దఎత్తున కృషిచేస్తున్నారు. తరచూ గల్ఫ్‌ దేశాల్లో పర్యటిస్తున్నారు. 


ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌-యూఏఈ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు చేయడం విశేషం. దీనిప్రకారం వచ్చే పదేళ్లలో 97శాతం భారతీయ ఉత్పత్తులపై, 90శాతం యూఏఈ ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. మే 1 నుంచి ఇది అమల్లోకి కూడా వచ్చింది. మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న మొదటి ఎఫ్‌టీఏ కూడా ఇదే. అలాగే జీసీసీ దేశాలతో విస్తృత వాణిజ్య ఒప్పందానికి కూడా కసరత్తు చేస్తోంది. చమురు సరఫరాలో రెండేళ్ల క్రితం వరకు సౌదీ 17-18 శాతంతో తొలి స్థానంలో ఉండేది. 2020-21లో ఇరాక్‌ 22 శాతంతో దానిని అధిగమించింది. అయినా సౌదీ వాటా తగ్గలేదు. యూఏఈ నుంచి 16.3శాతం, కువైత్‌ నుంచి 7.55శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 1.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఆయా దేశాలకు భారత్‌ ఎగుమతి చేసే వాటిలో ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, ఎలకా్ట్రనిక్‌ సామగ్రి, ఇనుము-ఉక్కు, రసాయనాలు తదితరాలున్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2020-21లో ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 22 బిలియన్‌ డాలర్లు కాగా.. 21-22లో 43 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.


ఖతర్‌ నుంచి ఏటా 85 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జీని భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. తృణ ధాన్యాలు, మాంసం, చేపలు, రసాయనాలు, ప్లాస్టిక్‌ను ఎగుమతి చేస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది 21 బిలియన్‌ డాలర్లకు చేరింది. ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఆ దేశ రాజధాని దోహాలో పర్యటిస్తున్నారు. ఆదివారం ఆయన ఖతర్‌ ప్రధాని-అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ ఖాలిద్‌ బిన్‌ ఖలీఫా బిన్‌ అబ్దులజీజ్‌ అల్‌ థానీతో సమావేశమయ్యారు. సోమవారం ఆయనతో ఖతర్‌ కన్సల్టేటివ్‌ అసెంబ్లీ (షుర కౌన్సిల్‌) స్పీకర్‌ హసన్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖనిమ్‌ భేటీ అయ్యారు.భారత్‌కు ప్రపంచంలో 27వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కువైత్‌. ద్వైపాక్షిక వాణిజ్యం 6.3 బిలియన్‌ డాలర్ల నుంచి నిరుడు రెట్టింపు(12.3 బిలియన్‌ డాలర్లు) అయింది.2020-21లో భారత్‌కు యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 43.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్యం 72.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఒమన్‌తో నిరుడు ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై 10 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. బహ్రయిన్‌తో వాణిజ్యం 1.65 బిలియన్‌డాలర్లకు పెరిగింది.


మానవ వనరులు..

అరబ్‌ దేశాలు, ఇరాన్‌లో పెద్దసంఖ్యలో ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు ఉన్నారు.  మన విదేశీ వ్యవహారాల విభాగం డేటా ప్రకారం.. ప్రవాస భారతీయుల్లో 28శాతం మంది ఈ దేశాల్లోనే ఉంటున్నారు. యూఏఈలో అత్యధికంగా 34 లక్షల మంది ఉండగా.. సౌదీలో 26 లక్షల మంది, కువైత్‌లో 10 లక్షల మంది ఉన్నారు. వీరు అక్కడ పనిచేసి సంపాదించి ఇంటికి డబ్బు పంపుతుంటారు. వీటిని అంతర్గత చెల్లింపులని అంటారు. వీటి ద్వారా దేశానికి పెద్దఎత్తున ఆదాయం వస్తోంది. ప్రపంచ దేశాలన్నిటి కంటే ఐదు అరబ్‌ దేశాల నుంచే 54శాతం అంతర్గత చెల్లింపుల కింద భారత్‌కు వస్తున్నాయి. ఇంత ఆర్థిక-వాణిజ్య బంధం పెనవేసుకుని ఉన్నందునే.. మోదీ ప్రభుత్వం అరబ్‌ దేశాలను శాంతపరిచే చర్యలు చేపట్టింది. 


భారతీయ ఉత్పత్తులు కొనవద్దు! 

నుపుర్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై అరబ్‌ ప్రపంచం భగ్గుమంటోంది. భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని కువైత్‌, ఖతర్‌లలో కొందరు పిలుపిచ్చారు. కువైత్‌లో ఓ సూపర్‌మార్కెట్‌ భారతీయ ఉత్పత్తులను తొలగించింది. అల్‌-అర్దియా సహకార సొసైటీ స్టోర్‌ సిబ్బంది టీ, బియ్యం, మిర్చి, మసాలా ఉత్పత్తులను ట్రాలీల్లో పడేసి.. అవి కనపడకుండా ప్లాస్టిక్‌ షీట్లు కప్పారు. భారతీయ ఉత్పత్తులను తొలగించామని బయట కాగితాలు కూడా అంటించారు.


ఓఐసీ, పాక్‌పై భారత్‌ ఫైర్‌

నుపుర్‌ వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ (ఓఐసీ), పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ మండిపడింది. భారత్‌లో ఇస్లాం మతంపై ద్వేషం పెరుగుతోందని.. ముస్లిములను వ్యవస్థీకృతంగా వేధిస్తున్నారని, విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించనివ్వడం లేదని.. ముస్లింల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఓఐసీ సెక్రటేరియట్‌ పేర్కొనడాన్ని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ సోమవారం తప్పుబట్టారు. ‘ఎవరో చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు ఏ విధంగానూ భారత ప్రభుత్వ అభిప్రాయాలు కావు. వారిపై సంబంధిత సంస్థలు గట్టి చర్యలు తీసుకున్నాయి. ఓఐసీ సెక్రటేరియట్‌ మరోసారి దురుద్దేశపూరిత, తప్పుదోవ పట్టించే అవాంఛిత, అనుచిత వ్యాఖ్యలు ఎంచుకుంది. స్వార్థ శక్తుల ప్రోద్బలంతో విభజన ఎజెండాను పాటిస్తోంది’ అని ఆక్షేపించారు. మోదీ హయాంలో భారత్‌లో మతస్వేచ్ఛను హరిస్తున్నారని.. ముస్లింలను పీడిస్తున్నారని.. ప్రపంచ దేశాలు వీటిని పరిగణనలోకి తీసుకుని.. భారత్‌ను గట్టిగా మందలించాలని పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై బాగ్చీ ధ్వజమెత్తారు. మైనారిటీల హక్కులను కాలరాసే వ్యక్తులు ఇతర దేశాల్లో మైనారిటీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. పాక్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీయులు తదితర మైనారిటీలకు జరుగుతున్న వేధింపులకు ప్రపంచమే సాక్షి అన్నారు. కాగా.. నుపుర్‌ వ్యాఖ్యలపై జోర్డా న్‌, ఇండొనేసియా, అఫ్ఘానిస్థాన్‌ కూడా ఆగ్రహం వ్యక్తంచేశాయు. ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాలని మాల్దీవుల ప్రతిపక్ష ఎంపీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంటు సోమవారం తిరస్కరించింది. 

Updated Date - 2022-06-07T13:58:22+05:30 IST