పోషకాల రేషన్‌..

ABN , First Publish Date - 2022-05-14T06:23:43+05:30 IST

నిరుపేదలకు పోషకాహారాన్ని అందించే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇకపై పోషక విలువలతో కూడిన రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మే నెల నుంచి జిల్లాలో పోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. తొలివిడతగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలలో ప్రభుత్వం ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేశా రు.

పోషకాల రేషన్‌..
రేషన్‌ షాపులో పంపిణీకి సిద్ధంగా ఉన్న బియ్యం

జిల్లాలో మొదలైన పోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యం పంపిణీ

పేదలకు పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు

తొలి విడతగా జిల్లాలో అమలు చేస్తున్న అధికారులు

ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 

జిల్లావ్యాప్తంగా 355 రేషన్‌ దుకాణాల పరిధిలో లక్షా 92 వేల రేషన్‌కార్డులు


ఆదిలాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు పోషకాహారాన్ని అందించే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇకపై పోషక విలువలతో కూడిన రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మే నెల నుంచి జిల్లాలో పోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. తొలివిడతగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలలో ప్రభుత్వం ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేశా రు. నాలుగు జిల్లాలను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చిన ఫలితాల ఆధారంగా ఒకటి, రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో 355 రేషన్‌ దుకాణాల పరిధిలో లక్షా 92వేల రేషన్‌కార్డులున్నాయి. ఈ కార్డులకు నెలకు సుమారుగా నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. మే నెలకు సంబంధించి జిల్లాకు 4,140 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం అవసరం కాగా, ఇప్పటి వరకు 2,600 మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో రైస్‌మిల్లులు అందుబాటులో లేక పోవడంతో ఫోర్టిఫైడ్‌ బియ్యం కోసం పొరుగు జిల్లాల పైననే ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైస్‌ మిల్లులు లేకపోవడంతో ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరాకు ఆటంకంగా మారింది.



ఆరు రకాల పోషక గుణాలు

ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఫోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యంలో ఆరు రకాల పోషకగుణాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో రక్తహీనత సమస్య అధికంగా ఉండడంతోనే ప్రభుత్వం మొదట జిల్లాను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మైక్రోన్యూట్రీషియన్‌, ఐరన్‌, పోలిక్‌యాసిడ్‌, బికాంప్లెక్స్‌, విటామిన్‌ 2, విటామిన్‌ ఏ, జింక్‌, మరికొన్ని పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఛౌకధరల దుకాణాలలో సరఫరా చేస్తున్నారు. తొలివిడతలో డిమాండ్‌ కంటే తక్కువగానే సరఫరా కావడంతో.. ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన గ్రామాల లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రాధాన్యతనిచ్చారు. తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నం, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీతో అక్రమ బియ్యం సరఫరాకు కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు రేషన్‌ బియ్యాన్ని తీసుకుంటున్న కొందరు లబ్ధిదారులు తినకుండా దళారులకు అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోషక విలువలతో కూడిన రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తే కొంత వరకు అయినా తినేందుకు రేషన్‌ లబ్ధిదారులు ఇష్టపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి పేద ప్రజలకు పోషకాహారం అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై మంచి స్పందనే కనిపిస్తోంది.



రేషన్‌ బియ్యమే ఆధారం

జిల్లాలో వరి పంట సాగు కనిష్టంగానే కనిపిస్తుంది. వానాకాలంలో వెయ్యి ఎకరాలలోపే వరి పంట సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామీణ, పట్టణ నిరుపేదలు రేషన్‌ బియ్యం పైననే ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం రూపాయికి కిలో చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోల వరకు రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఎలాంటి ధర పెంపు లేకుండా ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేయడంతో జిల్లాకు ఎంతో ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. జిల్లాలో ఎక్కువగా మారుమూల గిరిజన గ్రామాలే ఉన్నాయి. తరతరాలుగా ఆదివాసీ గిరిజనులు పౌష్టికాహార లోపంతో బాధపడుతూ అనారోగ్యం బారీన పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులలో ఎక్కువగా రక్తహీనత సమస్య కనిపిస్తోంది. దీంతో మాతా, శిశు మరణాలు ఎక్కువగా  నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనుల్లో రక్తహీనత సమస్యను దూరం చేసేందుకు ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తున్నా.. సరైన ఫలితం దక్కడం లేదు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇకపై స్థానిక ఛౌకధరల దుకాణాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తే కొంత మేరకైనా పౌష్టికాహార లోపాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 



జిల్లాలో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం...

సుదర్శన్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఆదిలాబాద్‌

మే నెల నుంచి జిల్లాలో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు జిల్లాల్లోనే తొలివిడతగా పోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఆసిఫాబాద్‌ కొమరంభీం, భద్రాద్రికొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలతో పాటు జిల్లాలోనూ ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ నాలుగు జిల్లాలో మంచి ఫలితాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పోషకాహార బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారుల్లో మంచి స్పందనే కనిపిస్తోంది.  తొలివిడతలో ఫోర్టిఫైడ్‌ బియ్యం తయారీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడంతోనే పూర్తిస్థాయిలో పంపిణీ జరుగలేదు.

Read more