నేను ఎక్కడికి వెళ్లినా ప్రవాసులకు ఇదే చెప్తా: జస్టిస్ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2022-03-18T13:28:35+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) తొలి పర్యటనలో న్యాయ సహకారంపై ఇరుదేశాలు చర్చలు జరిపాయి. యూఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ సుల్తా

నేను ఎక్కడికి వెళ్లినా ప్రవాసులకు ఇదే చెప్తా: జస్టిస్ ఎన్వీ రమణ

భారత్‌-యూఏఈ మధ్య న్యాయ సహకారం

జస్టిస్‌ రమణ పర్యటనలో ఇరుదేశాల చర్చలు

న్యూఢిల్లీ, మార్చి 17: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) తొలి పర్యటనలో న్యాయ సహకారంపై ఇరుదేశాలు చర్చలు జరిపాయి. యూఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ సుల్తాన్‌ బిన్‌ అవద్‌ అల్‌ నువామీ, యూఏఈ ఫెడరల్‌ సుప్రీంకోర్టు అధ్యక్షుడు మొహమ్మద్‌ హామద్‌ అల్‌ బాదీలతో గురువారం జస్టిస్‌ రమణ సమావేశమయ్యారని అబూదాబిలోని భారత ఎంబసీ ట్వీట్‌ చేసింది. యూఏఈలోని భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూఏఈలో భారత ప్రధాన న్యాయమూర్తి పర్యటించడం ఇదే తొలసారి. ప్రవాసులకు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల మధ్య మరింత సహకారం కోసం జరిపిన ఈ చర్చల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, యూఏఈ జడ్జి అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ బలూషి కూడా పాల్గొన్నారు.


సీజేఐ చారిత్రక పర్యటన ఇరుదేశాల మధ్య న్యాయ సంబంధాలను బలోపేతం చేస్తుందని ఎంబసీ ఆ ట్వీట్‌లో పేర్కొంది. అబూదాబిలోని భారత సామాజిక సాంస్కృతిక కేంద్రంలో ప్రవాసులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ ప్రసంగించారు. యూఏఈలో న్యాయ సహాయం అవసరమైనవారి కోసం ఒక న్యాయ సహాయ కేంద్రం ఏర్పాటు గురించి ప్రవాస భారతీయ సంఘాలు ఆలోచించాలని ఆయన సూచించారు. భారత్‌లో న్యాయ సేవలు అవసరమైన ప్రజలకు ఉచితంగానే ఆ సేవలను అందిస్తున్న జాతీయ, రాష్ట్ర న్యాయ సేవల అధికారులు దేశవ్యాప్తంగా అవసరమైన వారికి ఆ సేవలను అందించాలని కోరారు. 



యూఏఈ అభివృద్ధిలో భారతీయుల పాత్ర..స్నేహ సంబంధాలు బలోపేతమైనప్పుడే ఇరుదేశాల సంబంధాలు బలోపేతమై నూతన శిఖరాలకు చేరుకుంటాయని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. యూఏఈలో ఉంటున్న అతిపెద్ద జాతుల్లో భారత జాతి కూడా ఒకటని, ఏళ్ల తరబడి యూఏఈ అభివృద్ధిలో భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, ఇరుదేశాల మధ్య బలమైన బంధానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని చెప్పారు. భారతీయులు యూఏఈలో పూర్తిగా విలీనమైపోయారని, అయినప్పటికీ తిరిగి భారత అభివృద్ధిలోనూ వారు పాలుపంచుకోవడమే అత్యంత ముఖ్యమైన విషయమని ప్రశంసించారు. భారతీయ లక్ష్యం కోసం ముందుకు రావాల్సి వచ్చినప్పుడల్లా యూఏఈలోని భారతీయులంతా ముందుకు వచ్చారని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా, మాతృభూమి, మాతృభాషను మరిచిపోవద్దనే ప్రవాసులకు సూచిస్తుంటానని చెప్పారు.


‘మీ మూలాలను తెంచుకోకండి. మీ సంస్కృతిని కొనసాగించండి, ప్రోత్సహించండి. పండుగలు సెలబ్రేట్‌ చేసుకోండి’ అని సూచించారు. యూఏఈ న్యాయశాఖ మంత్రితో సమావేశం గురించి మాట్లాడుతూ క్రిమినల్‌, సివిల్‌ అంశాల్లో పరస్పర న్యాయ సహాయం, నేరస్తుల అప్పగింత, డిక్రీల అమలుకు ద్వైపాక్షిక ఒప్పందాలు మొదలయ్యాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 175 నేరస్తుల అప్పగింత అభ్యర్థనలు, 105 నేరస్తుల మార్పిడి అభ్యర్థనలను ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం లభించినట్టు తెలిపారు.




Updated Date - 2022-03-18T13:28:35+05:30 IST