ఓ ‘అపర మేధావి’ అధ్వాన్న పాలన!

ABN , First Publish Date - 2021-11-28T08:11:31+05:30 IST

‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు’... అన్నట్టుగా మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీరు ఉంది. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని అంశం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా...

ఓ ‘అపర మేధావి’ అధ్వాన్న పాలన!

‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు’... అన్నట్టుగా మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీరు ఉంది. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని అంశం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉంది. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట రెండేళ్లపాటు కాలక్షేపపు కబుర్లు చెప్పారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను అత్యంత ఘోరంగా అవమానించారు. రాజధాని ప్రాంతంలో భారీ కుంభకోణం జరిగిందని ఊరూ వాడా ప్రచారం చేశారు. అక్కడ కుంభకోణం కానీ లంబకోణం కానీ ఏమీ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చినా వందిమాగధులతో అదే ప్రచారం చేయించారు. ప్రభుత్వం ఆర్భాటంగా తెచ్చిన పాలనా వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో విచారణ మొదలైంది. మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రైతులు సంతోషపడేలోగానే, ఒకడుగు వెనక్కి వేయడమంటే రెండడుగులు ముందుకు వేయడమేనని మంత్రులు ప్రకటించారు. మరింత వివరంగా, స్పష్టంగా, అర్థవంతంగా కొత్త బిల్లును తీసుకురావడానికే పాత బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించడం ఇష్టంలేని జగన్‌రెడ్డి మూడు రాజధానుల బిల్లును ఎప్పుడు, ఏ రూపంలో తెస్తారో, రాజధానులు ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అదేదో సినిమాలో ‘నా చెల్లికి జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ’ అని తనికెళ్ల భరణి పాడినట్టుగా రాజధాని వ్యవహారం తయారైంది. జగన్‌కు ఇంకో రెండున్నరేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటిదాకా రాజధాని నిర్మాణంపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ప్రభుత్వం ఎప్పుడు బిల్లు తెస్తుంది? ఎప్పుడు నిర్మాణాలు చేపడుతుంది? అంటే చెప్పగలిగేవారు లేకుండా పోయారు. హైదరాబాద్‌, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపులపాయలలో రాజప్రాసాదాలను నిర్మించుకున్న జగన్‌రెడ్డి అలాంటి ఒక్క ప్రాసాదాన్ని కూడా రాజధాని కోసం నిర్మించలేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును వేధించడమే ఏకైక లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వానికి, రాజధాని లేదా రాజధానులు ప్రాధాన్య జాబితాలో లేకుండా పోయాయి. ప్రభుత్వ పోకడలను గమనిస్తే రాజధానిని నిర్మించే సత్తా జగన్‌రెడ్డి ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. మూడు రాజధానుల బిల్లు లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వమే అంగీకరించినందున, అలాంటి బిల్లును రూపొందించిన అధికారులకు ఎటువంటి శిక్ష విధించాలి? సదరు బిల్లును చదివి మరీ ఆమోదించిన గౌరవ శాసనసభ్యులను ఏమనాలి?


ఆర్థికంగా అరాచకం

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఆర్థిక నిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) తన నివేదికలో జగన్‌ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణంగా బిల్లులను రూపొందించడం కూడా చేతగాని అధికారులు, ప్రభుత్వపెద్దలు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ర్టాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. దేశంలో ఇన్ని రాష్ర్టాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో వలె మరెక్కడా ఇలాంటి ఆర్థిక అరాచకం కనపడటం లేదు. సంక్షేమం పేరిట డబ్బులు పంచుతూ అదేదో ఘనకార్యం అన్నట్టుగా జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరును గమనిస్తున్న వారికి రాష్ట్రంలో మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఆవగింజంత మెదడు ఉన్న అధికారులు ఒక్కరైనా ఉన్నారా? అన్న అనుమానం కలుగుతోంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు జవాబు ఇచ్చే అధికారులే లేకుండా పోయారని ఏకంగా ‘కాగ్‌’ తన నివేదికలో ఆవేదన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రజలు తెలిసో, తెలియకో గత ఎన్నికల్లో జగన్‌రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రి కావాలన్న కోరికను నెరవేర్చుకున్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు ఆలోచనాపరులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి భిచ్చమెత్తుకోనిదే పూట గడవని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది అని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హేళన చెయ్యగలిగారంటే అందుకు కారణం ఎవరంటే, ఇంకెవరు జగన్‌రెడ్డే అనే సమాధానం లభిస్తోంది. యాభైశాతానికి పైగా ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ చట్టబద్ధంగా పాలించాలన్న స్పృహ లేకుండాపోయిన జగన్‌రెడ్డి, ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చారు. ప్రైవేటు కంపెనీల వ్యవహారాలపైన కూడా ప్రభుత్వ ఏజెన్సీల నియంత్రణ ఉంటుంది. ప్రజలు తనను ముఖ్యమంత్రిని చేస్తే మరెవరో తనను నియంత్రించడం ఏమిటన్నట్టుగా జగన్‌రెడ్డి భావిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ ఆయన ప్రభుత్వ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం కూడా చూసీచూడనట్టు ఉంటోంది.


ఏం సాధించారని ఈ పొగడ్తలు?

రాయలసీమ ప్రజలు కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే వారిని కలిసి భరోసా ఇవ్వవలసిన ముఖ్యమంత్రి అలా చేయడం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజల గోడు పట్టించుకోకుండా పెళ్లిళ్లు, పేరంటాలకు హాజరవుతూ, విందు భోజనాలు చేస్తున్న జగన్‌రెడ్డి.. పొరుగున ఉన్న స్టాలిన్‌, బసవరాజ్‌ బొమ్మై వంటి ముఖ్యమంత్రులను చూసి కూడా నేర్చుకోవడం లేదు. శాసనసభను స్వోత్కర్షకే పరిమితం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు మాత్రమే వేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రిని అదే పనిగా ప్రశంసిస్తున్న రోజాను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సైతం వారించారంటే శాసనసభలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేమంటే జగన్‌రెడ్డి పాలనలో ప్రశ్నలు వేసే అవసరమే రావడం లేదని రోజా చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయవచ్చు కదా? రాష్ట్ర ప్రభుత్వం వవిధ పనులకు పిలిచే టెండర్లలో పాల్గొనడానికి కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు, ఇతర వైద్య పరికరాలను సరఫరా చేయకూడదని డీలర్లు నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడటంవల్ల రాష్ట్రం పరువు పోతున్నప్పటికీ ‘కొత్తా దేవుడండీ’ అన్నట్టుగా జగన్‌రెడ్డిని కీర్తించడం చూసే వారికి ఎబ్బెట్టుగా ఉంటోంది. ఆయన పాలనలో రాష్ట్రం ఎంతగా నష్టపోతున్నదో తెలుసుకోగలిగిన వారు తెలుసుకున్నారు. తెలుసుకోలేని వారు తాయిలాలతో సంతృప్తి చెందుతున్నారు. ఇసుక, సిమెంట్‌, ఇనుము ధరలు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, ఆస్తిపన్ను, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. మరోవైపు కొత్తగా చెత్త పన్ను, వాహనపన్నులు, మద్యం ధరలు, కళాశాలల ఫీజులను పెంచుకుంటూ పోతున్నారు. సినిమా అనేది నిత్యావసరం అన్నట్టుగా టికెట్‌ ధరలను మాత్రం నియంత్రించారు. ఇదీ ఒక పాలనేనా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి కల్పించారు. సుదీర్ఘ అనుభవం ఉన్నవారు మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ వారు కూడా ముఖ్యమంత్రికి భజన చేయడానికే పరిమితం కావడం విషాదం. ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అని అర్థించి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనలో ఫలానా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పగలరా? తాను ఏం చేసినా పేద ప్రజల కోసమే అని నమ్మించడం కోసం అమాయక ప్రజల సైకాలజీని ఔపోసన పట్టిన ముఖ్యమంత్రి వంచనతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజధానిగా అమరావతి ఉండకూడదు అని అనుకోవడానికి మనసులో ఉన్న కారణాలు చెప్పకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అనే కవరింగ్‌ ఇస్తున్నారు. అమరావతిలో అయితే భూములను కొల్లగొట్టడం సాధ్యం కాదని విశాఖ మీద పడ్డారు. భూకబ్జాలు, లిటిగేషన్లతో విశాఖవాసులు ఇప్పుడు హడలిపోతున్నారు. అభివృద్ధి మొత్తం కేంద్రీకృతమైన హైదరాబాద్‌ వంటి రాజధాని ఉండకూడదనే వికేంద్రీకరణకు పూనుకున్నానని చెబుతున్న జగన్‌రెడ్డి.. త్వరలోనే విశాఖ కూడా హైదరాబాద్‌తో పోటీ పడుతుందని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మూడు రాజధానులు అంటూ ఊదరగొట్టిన ఆయన కర్నూలు, విశాఖపట్నంలో ఈ రెండున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క భవనాన్ని నిర్మించారా? ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి అప్పులతో నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేని పరిస్థితి ఉన్నందున ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలని ఆయన తలపోస్తున్నారట! ఇదే నిజమైతే జగన్‌ పాలనలో మూడు రాజధానుల విషయం అటుంచి ఒక్క రాజధాని కూడా లేకుండాపోతుంది. ‘‘రాజధాని వద్దు. అభివృద్ధి వద్దు. పరిశ్రమలు వద్దు. ఉపాధి అవసరం లేదు. అప్పు పుట్టినంత కాలం పంచిపెడుతూనే ఉంటాం’’ అన్నట్టుగా జగన్‌ పాలన సాగుతోంది. రాజధాని నిర్మాణం ఈ ముఖ్యమంత్రి వల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు. అంచేత తిరుపతి నుంచి విశాఖ వరకు ఒక రైలును ప్రారంభించి అందులోనే రాజధాని ఉంటుందని ప్రకటిస్తే ఏ గొడవా ఉండదు. ఎవరికి వారు తమ ఊరికే రాజధాని వచ్చిందని మురిసిపోవచ్చు. ఇందుకు పెద్దగా ఖర్చు కూడా అవదు. ప్రభుత్వానికి పద్ధతీ పాడూ లేకుండా పోతే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అలాగే ఉంది. అయినా జగన్‌రెడ్డి పాలనను ఆహా ఓహో అంటూ పొగిడే భృత్యులు చాలామందే ఉన్నారు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ప్రజల్లోకి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై అధికారాన్ని ఆస్వాదిస్తున్న ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలి? బటన్లు నొక్కడానికి మాత్రమే బయటకు వచ్చి ఆ తర్వాత ఏకాంతవాసానికే పరిమితమయ్యే ముఖ్యమంత్రి పాలనలో అభివృద్ధి జరగాలనుకోవడం అవివేకం అవుతుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వరదప్రాంతాల్లో ఎప్పుడైనా పర్యటించారా? అని గద్దిస్తున్న జగన్‌రెడ్డి, తనలాగా ఆయన అధికార దర్పం ప్రదర్శించరని, అధికార దుర్వినియోగం చేయరని, అవినీతికి పాల్పడరని తెలుసుకుంటే మంచిది.


ఎవరి కోసం ఈ తెలివితేటలు?

పరిపాలనా తీరు చూసి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తెలివి తక్కువవాడు అని ఎవరైనా భావిస్తే పప్పులో కాలేసినట్టే. అంతులేని తెలివితేటలు ఆయన సొంతం. అయితే, ఆ తెలివితేటలను ఆయన ఎందుకు వినియోగిస్తున్నారన్నదే ప్రశ్న. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా జగన్‌రెడ్డి వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. సంపాదన అమాంతంగా పెరిగిపోతోంది. ఆర్థిక వ్యవహారాల్లో పరిజ్ఞానం లేకపోతే ఇది సాధ్యమా? అంతటి ఆర్థికపరిజ్ఞానం ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థికపరిస్థితిని ఎందుకు మెరుగుపరచలేకపోతున్నారు? అని అంటే అందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తే ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. అదే జరిగితే ప్రజలు తనకు ఓటు బ్యాంకుగా ఉండబోరు. అధికారం కూడా దూరమవుతుంది. తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలంటే అధికారం ఉండాలి. అందుకోసం ప్రజల మద్దతు కావాలి. కనుక నవరత్నాల పేరిట డబ్బు పంచుతూ ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకుంటున్నారు. అప్పులు చేసి కూడా తమకు డబ్బు పంచుతున్న మహానుభావుడు అని ప్రజలు భావించే పరిస్థితి కల్పించారు. భవిష్యత్తులో ఆ అప్పులు తీర్చడం కోసం తమపైనే పన్నుల భారం పడుతుందని అమాయక ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అప్పులు చేయడం కోసం ఆర్థిక వ్యవహారాల్లో తనకున్న పరిజ్ఞానాన్ని అంతా వినియోగిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి అనే ఆర్థికవేత్త సొంత కంపెనీ అప్పులు మాత్రం తీరిపోతాయి. పైసా పెట్టుబడి లేకుండా అధికారం మాటున కంపెనీలను ఏర్పాటుచేసుకోవచ్చు అని ఆయన చేసి చూపించారు. ముఖ్యమంత్రికి ఉన్న తెలివితేటలు చూసి మహా మహా ఆర్థికవేత్తలు సైతం నివ్వెరపోతున్నారు. ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన చేయిస్తున్న అప్పుల తీరే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్‌ ఆదాయాన్ని, ప్రభుత్వ భవనాలను, ఇతర ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేసుకోవచ్చని ఇప్పటివరకు ఒక్క ముఖ్యమంత్రికి కూడా తట్టలేదంటే జగన్‌రెడ్డి ఎంతటి ఘటికుడో అర్థం కావడం లేదా? మద్యనిషేధం చేస్తానన్న హామీని ఎవరూ గుర్తుచేయకుండా ఉండడం కోసం మద్యంపై వచ్చే ఆదాయాన్ని అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాలకు వినియోగించేలా ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వడం సామాన్యమైన తెలివితేటలు కావు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు చేస్తాయి. అయితే, ఇలా ప్రత్యేకంగా ‘సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం’ అనే జీవోలు ఇవ్వవచ్చన్న ఆలోచన ఆయా ముఖ్యమంత్రులకు తట్టడం లేదు.


‘కాగ్‌’కు సైతం చిక్కని లెక్కలు

జగన్‌రెడ్డి అప్పులు చేస్తున్న తీరు ‘కాగ్‌’ వంటి సంస్థలకే అంతుబట్టడంలేదు. ప్రభుత్వసంస్థలు చేసే అప్పుల కోసం రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇలా ఇచ్చే గ్యారెంటీల విలువ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడిలో 90 శాతం మించకూడదని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశిస్తోంది. ‘ఎవరో చేసిన చట్టాలతో నాకేం సంబంధం?’ అని అనుకుంటున్న జగన్‌రెడ్డి ఇప్పుడు ఈ గ్యారెంటీల పరిధిని 90 శాతం నుంచి 180 శాతానికి పెంచుకుంటూ ఏకంగా బిల్లునే తీసుకువచ్చారు. శుక్రవారం ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఉన్న చట్టబద్ధత ఏపాటిదో తెలియాల్సి ఉంది. ఆదాయానికి మించి గ్యారెంటీ ఇచ్చే హక్కు రాష్ట్రప్రభుత్వానికి ఉంటుందా? సదరు అప్పును తీర్చలేని పరిస్థితి ఎదురైతే అప్పులు ఇచ్చిన సంస్థలు తమ డబ్బును ఎలా వసూలు చేసుకుంటాయి? రాష్ట్రం ఆదాయమే అంత లేనప్పుడు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవడం సాధ్యమా? అయినా ఇలాంటి ఆలోచన చేసిన జగన్‌రెడ్డికి ఎంతో గొప్ప ఆర్థికపరిజ్ఞానం ఉందని అంగీకరించక తప్పదు. ఇంత సులువుగా అప్పులు చేయగలిగే పరిస్థితి ఉంటే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలంటూ వివిధ రాష్ట్రప్రభుత్వాలు కేంద్రాన్ని ఎందుకు వేడుకుంటున్నాయో తెలియదు. బహుశా దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి ఆర్థిక విధ్వంసానికి పాల్పడి ఉండకపోవచ్చు. కేంద్రప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా గ్యారెంటీల మొత్తాలను ఇలా ఎడాపెడా పెంచుకునే అధికారం రాష్ర్టాలకు లేదు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే లేదా ప్రత్యేక మినహాయింపులు పొందిన మీదటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేసుకోవచ్చు. అయినా గ్యారెంటీలు ఇచ్చే అధికారాన్ని 180 శాతానికి పెంచుకుంటూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం తెలిపితే రాజ్యాంగ పరిరక్షణలో ఆయన విఫలమైనట్టే. అయినా ఇంతటి అపార పరిజ్ఞానం ఉన్న జగన్‌రెడ్డి రాష్ర్టాభివృద్ధి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకపోవడం వింతగా ఉంది. గౌతం అదానీతో మాత్రమే గంటల తరబడి సమావేశమయ్యే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం గమనార్హం. వింత నిర్ణయాలు, వికృత విధానాలతో రాష్ట్ర భవిష్యత్తును అధోగతిపాలు చేస్తున్న జగన్‌రెడ్డిని నిలువరించవలసిన సమయం ఆసన్నమైంది. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎవరికీ రాని ఆలోచనలు జగన్‌కు మాత్రమే వస్తున్నాయంటే ఆయనలో అపరిచితుడు ఉన్నాడనుకోవాలేమో! నలుగురిలో ఉన్నప్పుడు అత్యంత సాదాసీదాగా కనిపించే జగన్‌రెడ్డిలోని మరో కోణాన్ని ఇప్పటికీ చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. నియంత్రించాల్సిన వాళ్లు, ప్రశ్నించాల్సిన వాళ్లు మనకెందుకులే అని మౌనంగా ఉండిపోతున్నారు. ఆర్థిక నిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ‘కాగ్‌’ స్పష్టంగా పేర్కొన్నందున కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా కలుగజేసుకుంటుందో లేదో తెలియదు. ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీలను తనకు తానుగా పెంచుకుంటూ బిల్లు తెచ్చిన జగన్‌ సర్కార్‌ చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్రంలో కనీవినీ ఎరుగని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసి అప్పులు చెల్లించాల్సిన బాధ్యతను ప్రజలే నెత్తిన ఎత్తుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థికపరిస్థితి నానాటికీ దిగజారుతున్నప్పటికీ రాష్ట్రంలోని మేధావుల నోళ్లు ఎందుకు పెగలడం లేదో తెలియడం లేదు. ‘నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష’ అని ఎవరికి వారు భావిస్తే భావితరాల భవిష్యత్తు ఏమి కావాలి? ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నా ప్రశ్నించకపోవడమే నేరమవుతుంది. ఇప్పటికే ఇంటా బయటా రాష్ట్రం పరువుపోయింది. జగన్‌ సర్కార్‌ ధోరణులను అడ్డుకోని పక్షంలో వెంకటేశ్వరస్వామి, జీసస్‌, అల్లా ముగ్గురూ కలసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అవతరించినా రాష్ర్టాన్ని బాగుచేయలేరు. జగన్‌ అధికారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పటికే జరిగిన విధ్వంసానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మూల్యం చెల్లించాల్సింది ఎవరు? రెండున్నరేళ్ల తర్వాత కూడా రాజధాని అంశాన్ని మొదటికే తెచ్చిన జగన్‌ను ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఇప్పటిదాకా మూడు రాజధానుల నిర్ణయాన్ని అదే పనిగా సమర్థించినవారు ఇప్పుడేం చెబుతారు? చేసుకున్న వారికి చేసుకున్నంత! అనుభవించండి!!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-11-28T08:11:31+05:30 IST