Opsకు తగ్గుతున్న మద్దతు

ABN , First Publish Date - 2022-06-22T13:55:11+05:30 IST

అన్నాడీఎంకేలో సంక్షోభం క్లైమ్యాక్స్‌కు చేరింది. అన్నాడీఎంకే సమన్వయకర్తగా వున్న ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)కు పార్టీపై పట్టు లేదని తేలిపోవడంతో ఆయన

Opsకు తగ్గుతున్న మద్దతు

- నేతలంతా ఈపీఎస్‌ ఇంటికి పరుగులు

- పార్టీ రక్షణే ధ్యేయం: ఎడప్పాడి

- సర్వసభ్య మండలికి సర్వం సిద్ధం


చెన్నై, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో సంక్షోభం క్లైమ్యాక్స్‌కు చేరింది. అన్నాడీఎంకే సమన్వయకర్తగా వున్న ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)కు పార్టీపై పట్టు లేదని తేలిపోవడంతో ఆయన వెంట ఉన్న నేతలు సైతం ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో ఈపీఎస్‌ సానుకూలంగా ఉంటే తప్ప ఓపీఎస్ కు పార్టీలో తగిన పదవి లభించే అవకాశం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నెల 23న జరుగనున్న అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం ఏం నిర్ణయించనుందోనని రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


ఈపీఎస్‌ వైపే మాఫాయ్‌ పాండ్యరాజన్‌

ఇప్పటి వరకూ ఓపీఎస్‏కు కుడిభుజంగా వ్యవహరించిన మాజీ మంత్రి మాఫాయ్‌ పాండ్యరాజన్‌ హఠాత్తుగా యూటర్న్‌ తీసుకున్నారు. పార్టీకి ఏకనాయకత్వం అవసరమని, అందుకోసం తాను ఈపీఎస్‏కే మద్దతునిస్తున్నట్లు పాండ్యరాజన్‌ మీడియా ముందు ప్రకటించారు. ఇదేవిధంగా నిన్న మొన్నటివరకూ ఓపీఎ్‌స కు మద్దతుదారులుగా వ్యవహరించిన తిరునల్వేలి జిల్లా కార్యదర్శి గణేష్ ‏‏రాజా, విరుదునగర్‌ జిల్లా కార్యదర్శి సాత్తూరు రవిచంద్రన్‌, తిరువళ్లూరు దక్షిణ జిల్లా కార్యదర్శి అలెగ్జాండర్‌ మంగళవారం ఎడప్పాడికి మద్దతు ప్రకటించారు. దాంతో ఓపీఎస్‏కు తేని, చెన్నై ఈస్ట్‌, కన్నియాకుమారి, తిరువళ్లూరు నార్త్‌, తిరుచ్చి నగర జిల్లా శాఖ, తంజావూరు దక్షిణ, ఉత్తర జిల్లాలు, పెరంబలూరు, అరియలూరు జిల్లా కార్యదర్శుల మద్దతు మాత్రమే మిగిలింది. మొత్తం 60 మంది జిల్లా కార్యదర్శుల్లో తమకు 15 జిల్లాల వారి మద్దతు వుందని ఓపీఎస్‌ స్వయంగా సోమవారం ప్రకటించారు. అందులో ఇప్పుడు ఐదుగురు ఈపీఎస్‌ వైపు వెళ్లగా కేవలం పది జిల్లాల కార్యదర్శులు మాత్రమే ఓపీఎ్‌సకు దక్కింది. అందులోనూ చివరివరకూ మిగిలేదెవరన్నది సందేహంగానే మారింది. 


సర్వసభ్యమండలి సమావేశానికి పటిష్ఠ భద్రత: హైకోర్టు

ఈ నెల 23న వానగరంలో జరుగనున్న అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశానికి పటిష్టమైన భద్రత కల్పించాలని మద్రాసు హైకోర్టుపోలీసు శాఖను ఆదేశించింది. మాజీ మంత్రి బెంజమిన్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి సతీష్‏కుమార్‌ సమక్షంలో మంగళవారం విచారణ జరిగింది. సమావేశానికి 2600 మంది సభ్యులు వస్తున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో తగిన భద్రత కల్పించాల్సిన అవసరముందన్న పిటిషనర్‌తో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమావేశానికి హాజరయ్యే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, పోలీసులు ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో పోలీసులు అడిగిన 26 ప్రశ్నలకు అన్నాడీఎంకే నిర్వాహకులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, భద్రత కోరుతూ పోలీస్‏శాఖకు లేఖ సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదిలా వుండగా అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని నిలుపుదల చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరుపనుంది.


పార్టీని కాపాడతా : ఈపీఎస్‌

ప్రధాన ప్రతిపక్షంగా సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అన్నాడీఎంకేను బలహీన పరిచేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలను అడ్డుకుని పార్టీని కంటికిరెప్పలా కాపాడుతానని ఈపీఎస్‌ ప్రకటించారు. మంగళవారం పార్టీ సమాచార సాంకేతిక విభాగం సభ్యులతో ఆయన మాట్లాడుతూ... అన్నాడీఎంకేను ఎవరూ నాశనం చేయలేరని, తానే ముందుండి పార్టీని కాపాడతానన్నారు. ఏకనాయకత్వం అంశాన్ని అడ్డుపెట్టుకుని పార్టీని బలహీన పరిచేందుకు చేసే ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుంటానని ప్రకటించారు.


ఏర్పాట్లు ముమ్మరం...

స్థానిక వానగరం శ్రీవారు కల్యాణమండపంలో అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశపు తుది విడత ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సమావేశ హాలులో 2750 మంది ఆశీనులయ్యేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి బెంజిమెన్‌ నేతృత్వంలో ఈ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి అనుమతి ఇవ్వొద్దని ఆవడి పోలీస్‌ కమిషనర్‌కు ఓపీఎస్‌ మద్దతు దారులు వినతిపత్రం అందించడం గమనార్హం. 



Updated Date - 2022-06-22T13:55:11+05:30 IST