Opsకు మరో ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-07-20T15:53:17+05:30 IST

అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం కోసం పాకులాడి, ఆ పార్టీ సమన్వయకర్త పదవితో పాటు పార్టీ సభ్యత్వం కూడా కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి

Opsకు మరో ఎదురుదెబ్బ

- సభాపక్ష ఉపనేత పదవి నుంచీ ఔట్‌

- ఆయన స్థానంలో ఉదయకుమార్‌కు అవకాశం


చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం కోసం పాకులాడి, ఆ పార్టీ సమన్వయకర్త పదవితో పాటు పార్టీ సభ్యత్వం కూడా కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎ్‌స)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనేత పదవి కూడా ఆయన కోల్పోయారు. ఆయన స్థానంలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఓపీఎ్‌సను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సర్వసభ్య మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఖాళీ అయిన ఆ పదవిని ఉదయకుమార్‌కు అప్పగించినట్లు ఈపీఎస్‌ తెలిపారు. ఇదే విధంగా అన్నాడీఎంకే సభాపక్షం డిప్యూటీ కార్యదర్శిగా అగ్రి కృష్ణమూర్తిని నియమించామన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన లేఖను పార్టీ విప్‌ ఎస్పీ వేలుమణి శాసనసభ స్పీకర్‌ అప్పావుకు మంగళవారం అందజేశారు. ఈ లేఖపై పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ తెలిపారు. ఇదే విషయమై ఓపీఎస్‌ వర్గీయులు అందజేసిన లేఖపై కూడా పరిశీలన జరుపుతున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. ఇదిలా వుండగా ఈపీఎస్‌ నిర్ణయంపై ఉదయకుమార్‌ విలేఖరులతో మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-20T15:53:17+05:30 IST