Highcourtలో ఓపీఎస్‏కు చుక్కెదురు

ABN , First Publish Date - 2022-07-12T13:51:40+05:30 IST

అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎ్‌స)కు

Highcourtలో ఓపీఎస్‏కు చుక్కెదురు

చెన్నై, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎ్‌స)కు చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సమావేశం ప్రారంభం కావటానికి పావుగంట ముందు హైకోర్టు న్యాయమూర్తి కృష్ణన్‌ రామసామి తీర్పు వెల్లడించారు. పార్టీ అంతర్గత వ్యవహరాల్లో ఓ పరిమితికి మించి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. పార్టీలోని సర్వసభ్యమండలి మెజారిటీ సభ్యుల మద్దతుతో నిర్వహించే సమావేశాన్ని ఎలా అడ్డుకోగలమని ప్రశ్నించారు. పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో పిటిషన్‌ దాఖలు చేసిన పన్నీర్‌సెల్వం తీరును తీవ్రంగా ఖండించారు. పార్టీలో మెజారిటీ సభ్యుల నమ్మకాన్ని కోల్పోయినవారంతా న్యాయస్థానాలను పనిముట్లుగా ఉపయోగించాలనుకోవడం గర్హనీయమన్నారు. పార్టీ సమన్వయకర్తగా పార్టీ అభివృద్ధికి దోహదం చేసేలా సభ్యులను సర్దిపుచ్చేందుకు పన్నీర్‌సెల్వం ప్రయత్నించాలని, సర్వసభ్యమండలిలో తనకు న్యాయం జరగకపోతే అప్పుడు సిటి సివిల్‌ కోర్టును ఆశ్రయించి వుంటే బాగుండేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సర్వసభ్యమండలి సమావేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగితే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయంలో తమకున్న పరిధిని అధిగమించి జోక్యం చేసుకోలేమని, సర్వసభ్యమండలి సమావేశం జరుపుకొనేందుకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-12T13:51:40+05:30 IST