బాబ్బూబూ.. ఒక రోడ్డు వేయండయ్యా!

ABN , First Publish Date - 2021-12-28T05:14:27+05:30 IST

గత ప్రభుత్వంలో చేసిన పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతుండటంతో కొత్తగా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

బాబ్బూబూ.. ఒక రోడ్డు వేయండయ్యా!

ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నాం

కాంట్రాక్టర్లను వేడుకొంటున్న ప్రజాప్రతినిధులు


‘బ్రదర్‌.. గ్రామాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. మా గ్రామానికి వెళ్లే రోడ్డు దారుణంగా దెబ్బతిన్నది. దానిని బాగుచేయండంటూ ప్రజలు పదే పదే కోరుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోవడం అసహ్యంగా అనిపిస్తోంది. ఎలాగోలా పెద్ద మనసు చేసుకొని మండలానికి ఒక రోడ్డయినా వేయండయ్యా.. ఆ బిల్లులు ఇప్పించే పూచీ మాది.. మీరేం భయపడవద్దు.’ అంటూ జిల్లాలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లను వేడుకొంటున్నారు. గడిచిన రెండన్నరేళ్లుగా జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడం, కొత్త రోడ్ల నిర్మాణం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు విజ్ఞప్తి చేసే స్థాయి నుంచి గట్టిగా అడిగే స్థాయికి వచ్చారు. అక్కడ నుంచి అడ్డుకొని నిలదీసే స్థాయికి రాకముందే జాగ్రత్త పడాలనుకున్నారో ఏమో గానీ ప్రజాప్రతినిధులు మేల్కొన్నారు. మండలంలో కనీసం ఒక రోడ్డయినా వేస్తే పనులు చేస్తున్నామని చెప్పుకునేందుకు ధైర్యం వస్తుందని వారు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రభుత్వాన్ని అడిగితే ఉపయోగం లేదనుకున్నారో ఏమోగానీ కాంట్రాక్టర్లను బతిమలాడుకుంటున్నారు. అయితే ప్రజాప్రతినిధులు ఇంతలా ప్రాధేయపడుతుండటం కాంట్రాక్టర్లకు ఒకింత ఇబ్బందిగా మారుతోంది. ఆ స్థాయి వ్యక్తులు వచ్చి వేడుకొంటుంటే ఏం చేయాలో అర్థంగాక మధనపడుతున్నారు. కొందరు మాత్రం మొహమాటానికి తప్పక రోడ్డు పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిని గమనిస్తున్న అధికారులు ‘ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ లేవు’ అంటూ చర్చించుకుంటుండడం గమనార్హం. 


నెల్లూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వంలో చేసిన పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతుండటంతో కొత్తగా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గడిచిన రెండన్నరేళ్లుగా రోడ్డు అభివృద్ధి పనులు జరగడం లేదు. ఆఖరుకు ప్యాచ్‌ వర్కులు చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. గడిచిన రెండేళ్లుగా వరుసగా జిల్లాలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ ప్రభావంతో రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలకు నరకం కనిపిస్తోంది. దీంతో ఈ పరిస్థితులపై ప్రజల్లో అసహనం మొదలైంది. గడిచిన కొంతకాలంగా ఆయా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ రోడ్లు బాగుచేయండంటూ అడుగుతుండడం ప్రజాప్రతినిధులకు ఒకింత ఇబ్బందిగా మారింది. ‘ప్రజలు వారి సమస్యలను మాకు చెబుతున్నారు సరే.. అయితే మా సమస్యలను మేము ఎవరికి చెప్పుకోవాలంటూ..’ కొందరు ప్రజాప్రతినిధులు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో వారు కాంట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఎలాగోలా పలానా రోడ్డు పని చేసి పెట్టు.. అంటూ ప్రాధేయపడుతున్నారు. 


మళ్లీ.. మళ్లీ టెండర్లు

జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు రెండేళ్ల నుంచి టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. కానీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన కనిపించడం లేదు. ఒక్క ఆర్‌అండ్‌బీ శాఖనే చూసుకుంటే ఏడాది క్రితం సుమారు రూ.160 కోట్లతో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. ఎవరూ టెండర్లు వేయకపోవడంతో అదే వర్కులకు నాలుగు సార్లు టెండర్లు పిలిచారు. అయినా ఫలితం లేకపోవడంతో మారిన స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లు(ఎ్‌సఎ్‌సఆర్‌) ప్రకారం మరోసారి గత నెలలో టెండర్లు పిలిచారు. అప్పుడు కేవలం రూ.15 కోట్ల విలువైన వర్కులకే టెండర్లు దాఖలయ్యాయి. మిగిలిన సుమారు రూ.120 కోట్ల పనులకు ఇప్పుడు రెండో సారి టెండర్లు ఆహ్వానించారు. అయితే ఈ దఫా కూడా ఎవరైనా వేస్తారా.. అంటే అనుమానమే అని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు అంతర్గతంగా చెబుతుండడం గమనార్హం. 



Updated Date - 2021-12-28T05:14:27+05:30 IST