ఓబీసీలు పోరాడాల్సిందే!

ABN , First Publish Date - 2022-02-01T06:02:52+05:30 IST

దేశ రాజకీయాల్లో ఈనాటికీ ఓబీసీలది మధ్యస్థ పాత్రే. దేశ జనాభాలో 60 శాతం ఓబీసీ జనాభా ఉన్నా వారికి కేవలం ఓటర్లుగానే గుర్తింపు రావడం వారి రాజకీయ అనైక్యతకు నిదర్శనం...

ఓబీసీలు పోరాడాల్సిందే!

దేశ రాజకీయాల్లో ఈనాటికీ ఓబీసీలది మధ్యస్థ పాత్రే. దేశ జనాభాలో 60 శాతం ఓబీసీ జనాభా ఉన్నా వారికి కేవలం ఓటర్లుగానే గుర్తింపు రావడం వారి రాజకీయ అనైక్యతకు నిదర్శనం. రాజ్యాంగం ప్రకారం ఎవరి జనాభా ప్రాతిపదికన వారికి దక్కాల్సిన రాజ్యాధికారంలో కేవలం బీసీలకు మాత్రమే పూర్తి స్థాయిలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది బీసీల రాజకీయ బానిసత్వానికి ఉదాహరణ.


ఈ వెనుకబడిన మెజారిటీ వర్గం వారు ఎవరి నుంచి ఏమి ఆశిస్తున్నారో నేతలు గ్రహించలేకపోతున్నారు. అందుకే అగ్రవర్ణ పార్టీల చేత, నేతల చేత అవమానాలకు గురై రాజకీయంగా నిష్క్రమిస్తున్నారు. ఈ వర్గాలు ఏ చిన్న తప్పు చేసినా వారి రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తున్నారు. అగ్రకులాల వారు ఎంత పెద్ద తప్పు చేసినా, వారి ఎదుగుదలకు ఏ ఆటంకమూ ఉండటం లేదు. బీసీలలో కొన్ని కులాలు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధిపరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. కానీ వారు ఐక్యంగా లేరు. ఇప్పటికీ చాలా రంగాలలో కనీసం ప్రాతినిధ్యం లేని ఓబీసీ కులాలు చాలా ఉన్నాయి. విద్యకు, ఉపాధికి దూరంగా ఉన్న కులాలు, రాజకీయంగా చాలా వెనుకబడిన కులాలు, ఆర్థికంగా, వ్యాపారపరంగా బాగా ఏ బలమూ లేని కులాలు ఎక్కువ ఉన్నాయి. ఎదిగిన కొన్ని ఓబీసీ కులాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఈ కులాల వారిని తమతో సమానంగా చూడడం లేదు. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినాయకత్వం వీరిని పట్టించుకున్న సందర్భాలు చాలా తక్కువ. అన్ని పార్టీలు కూడా ఎదిగిన కొన్ని బీసీ కులాలను మాత్రమే పక్కన చేర్చుకుంటున్నాయి తప్ప, ఆర్థికంగా చితికిపోయిన బీసీ కులాలకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఒక బీసీ ఎదిగితే ఇంకో బీసీ సహించలేని పరిస్థితి ఉంది. అందుకే బీసీల ఐక్యత గాని, ఉద్యమాలు గాని, బీసీల నుంచి వచ్చిన పార్టీలు గానీ నిలబడలేకపోతున్నాయి.


బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ రాజకీయపరంగా ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ ఓటర్లు, ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచించాలి. అసెంబ్లీలో, పార్లమెంటులో వారి హక్కులకై గొంతెత్తాలి. ఆ వర్గాల నుంచి వచ్చిన నేతలు ఆ వర్గం వారి రాజ్యాధికార ఆకాంక్షలను గుర్తించాలి. రాజకీయ రిజర్వేషన్ల కోసం ఇంకా అడపాదడపా పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఆ ఉద్యమాలు ఒక ఉప్పెనగా మారడం లేదు. చిన్న చిన్న ప్రతిఘటనలు, ఉద్యమాలు మనుగడను కాపాడుకోవడానికి ఉపయోగపడుతాయి తప దీర్ఘకాలంగా ఏ ప్రయోజనమూ ఉండదు. ఉవ్వెత్తున ఎగిసే కెరటంలా ఉద్యమాలను నిర్మించాలి. అప్పుడే మెజార్టీ వర్గంగా ఉన్న బీసీలకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. ఉద్యమాలు చేస్తేనే అందులో నుంచి ఒక బలమైన నాయకుడు, లేదా నాయకులు తయారవుతారు. 


దేశంలో అత్యధిక జనాభా ఓబీసీలేననీ, ఆ ప్రాతిపదికన చట్టసభల్లో వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడతారు. అంతేతప్ప చట్టసభల్లో నోరు విప్పరు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించేటప్పుడు జనాభా ప్రకారం ఓబీసీలకు సీట్లు ఇవ్వడం లేదు. మైనార్టీ వర్గంలో ఉన్న వారికి మెజారిటీ సీట్లు కేటాస్తున్నారు. ఇలా ప్రతి సందర్భంలో బీసీలు రాజకీయ అవమానాలకు గురవుతూనే ఉన్నారు. దేశంలో, రాష్ట్రంలో అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు టిక్కెట్లు ఇస్తే గాని బీసీలు పోటీ చేయలేకపోతున్నారు. అదీ ఎంతో పోరాడితే కొన్ని సీట్లు మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటివరకు రాష్ట్ర బాధ్యతలను పెద్ద పెద్ద భూస్వాములు, పెట్టుబడిదారులు, ఆధిపత్య కులాలకు మాత్రమే ఇచ్చాయి. ఈ పెత్తందార్ల ఆధిపత్యం నుంచి బైటపడటానికి వెనుకబడిన వర్గాల వారు పూర్తిస్థాయిలో పోరాటాలు చేయడం లేదు. విద్య, ఉపాధి రంగంలో రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్ళ పోరాటాలు చేస్తే, ఎంతోమంది త్యాగాలు చేస్తే 27శాతం రిజర్వేషన్లను సాధించుకోగలిగాం. ప్రతి రంగంలోనూ సగం వాటా కోసం బీసీలు దేశవ్యాప్తంగా పటిష్ట ఉద్యమాలు చేయాలి. అప్పుడు కాని రాజకీయపరమైన రిజర్వేషన్లు సాధ్యం కావు.

మండ్ల రవివర్మ

ఉస్మానియా యూనివర్సిటీ



Updated Date - 2022-02-01T06:02:52+05:30 IST