బొల్లారంలోని ఓ పరిశ్రమలో తనిఖీ చేస్తున్న అధికారులు
జిన్నారం/సంగారెడ్డి రూరల్, మే 13: పరిశ్రమలలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల ఘటనల నివారణ, జాగ్రత్తల కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు పారిశ్రామిక వాడలలో తనిఖీలు ప్రారంభించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పది పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బొల్లారం పారిశ్రామిక వాడలో నాల్గు పరిశ్రమల్లో కర్మాగారాల శాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పీసీబీ, అగ్నిమాపక, పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో తరచూ జరిగే ప్రమాదాలతో ఆస్తి, ప్రాణ నష్టం, ప్రమాదాలకు గల కారణాలపై పరిశీలన జరిపారు. ముఖ్యంగా రసాయన, స్టీల్, ఫర్నేస్, రియాక్టర్ విభాగాలను పరిశీలించారు. గత ఐదేళ్లలో ప్రమాదాలు జరిగిన పరిశ్రమలతో పాటు ఇతర ప్రమాదాలు జరిగే అవకాశమున్న పరిశ్రమలను పరిశీలించి, జాగ్రత్తల కోసం తగిన సూచనలు చేశారు. పరిశ్రమల తనిఖీలు, ఇతర వివరాలను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు అందజేస్తామని వారు తెలిపారు.
రసాయన పరిశ్రమలో పీసీబీ అధికారుల తనిఖీలు
జిన్నారం రాయుని చెరువు పైభాగంలోని గ్రాన్యూల్స్ పరిశ్రమలో పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమ నుంచి చెరువులోకి వ్యర్థ జలాలు వదులుతున్నారని స్థానికుల ఫిర్యాదుతో శుక్రవారం పీసీబీ ఈఈ భాగ్యలక్ష్మి, అనాలసిస్టు జీముతవాహన పరిశ్రమలో తనిఖీలు జరిపారు. తనిఖీల్లో మాజీ ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, వార్డు సభ్యుడు శ్రీనివా్‌సయాదవ్, నాయకులు ఉన్నారు.