సోలార్‌పై నీలినీడ!

Jun 19 2021 @ 23:34PM

అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుగా రెండేళ్ల క్రితం జాతీయ అవార్డు

స్మార్ట్‌సిటీలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ప్రారంభం 

రూ.11.36 కోట్లు వెచ్చించిన జీవీఎంసీ

25 ఏళ్ల పాటు సేవలందించేలా ఏర్పాటు 

రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం  

ఇప్పుడు ముడసర్లోవ అభివృద్ధి పేరుతో ఆ ప్రాజెక్టును తరలించేందుకు కుట్ర

బోటింగ్‌కు అవరోధమంటున్న విజయసాయిరెడ్డి 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుగా దక్కిన ఖ్యాతి...రూ.11.36 కోట్ల వ్యయం...25 ఏళ్లపాటు నిరంతర సేవలందించే అవకాశం...రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం...ఇదీ నగరంలోని ముడసర్లోవలో గల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు ఘనత. 2020 ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగిన స్మార్ట్‌ సిటీస్‌ మూడో జాతీయ శిఖరాగ్ర సమావేశంలో బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ కేటగిరీలో నేషనల్‌ అవార్డు సాధించి ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఈ ప్రాజెక్టును రిజర్వాయర్‌లో బోటింగ్‌కు అడ్డుగా ఉంటుందంటూ, అడ్డగోలుగా తరలించే కుట్రలు జరుగుతున్నాయి.  


స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మూడేళ్ల కిందట ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పర్యావరణానికి హాని లేకుండా విద్యుదుత్పత్తి జరిగేలా ‘గ్రేటర్‌ విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో ముడసర్లోవ రిజర్వాయర్‌లో రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2018 అక్టోబరు 18న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని ప్రారంభించారు. దేశంలో చాలాచోట్ల భారీ సోలార్‌ పవర్‌ప్లాంట్లు ఉన్నప్పటికీ, వాటికి భిన్నంగా రిజర్వాయర్‌లో నీటి మట్టానికి అనుగుణంగా 6,400 సోలార్‌ ప్యానళ్లు పైన తేలియాడేలా ఏర్పాటుచేశారు. ఇవి 200 కిలోమీటర్ల వేగంతో వీచేగాలులను సైతం తట్టుకుని 25 ఏళ్లపాటు నిరంతర సేవలందిస్తాయి. ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను కేబుళ్ల ద్వారా రిజర్వాయర్‌ ఒడ్డున నిర్మించిన కంట్రోల్‌రూమ్‌కు సరఫరా చేస్తారు. అక్కడ డీసీ కరెంటు...ఏసీ కరెంటుగా మారుతుంది. అక్కడి నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా ఏపీఈపీడీసీఎల్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. జీవీఎంసీ వినియోగించిన విద్యుత్‌లో గ్రిడ్‌కు ఇచ్చిన రెండు మెగావాట్లను మినహాయించుకుని ఈపీడీసీఎల్‌ మిగిలిన చార్జీలు వసూలు చేస్తోంది. అంతేకాకుండా రిజర్వాయర్‌లో సుమారు 4.4 ఎకరాల్లో సోలార్‌ ప్యానళ్లు వుండడం వల్ల సూర్యరశ్మి నేరుగా నీటిపై పడకుండా నిరోధించి వృథా (ఆవిరికాకుండా)ను అడ్డుకుంటోంది. దీనివల్ల 130 ఇళ్లకు ఏడాది అవసరాలకు సరిపోయే నీరు ఆదా అవుతోంది. ఈ ప్రాజెక్టుకు జీవీఎంసీ ఖర్చు పెట్టిన రూ.11.36 కోట్లు. ఏడాదికి రూ.2 కోట్ల చొప్పున ఆరేళ్లలో విద్యుత్‌ బిల్లుల రూపంలో తిరిగి వచ్చే అవకాశముంది. జాతీయస్థాయి ప్రశంసలు రావడంతో మరిన్ని ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులకు జీవీఎంసీ రూపకల్పన చేసింది. ఇప్పటికే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో పది మెగావాట్లు, రైవాడ కాలువ పొడవునా రెండు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను ప్రారంభించింది. 


మూడేళ్ల ముచ్చటేనా?


కనీసం 25 ఏళ్ల పాటు సేవలందించే అవకాశమున్న ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు మూడేళ్లకే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముడసర్లోవ పార్కును అభివృద్ధి చేస్తామంటూ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి ప్రకటించి, ఇటీవల ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా అనేక ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పార్కు పక్కనే వున్న రిజర్వాయర్‌లో బోటింగ్‌ సదుపాయం కల్పిస్తే పర్యాటకులు పోటెత్తుతారని, దీనికి సోలార్‌ ప్యానళ్లు అవరోధంగా వుంటాయంటూ జీవీఎంసీ సమీక్షలో ప్రస్తావించారు. ప్యానళ్లు పెట్టి రిజర్వాయర్‌ను నాశనం చేశారని, భూమిపై ఏర్పాటుచేస్తే సరిపోతుందని, ఇక్కడి ప్యానళ్లను తరలించే అవకాశాలను పరిశీలించాలని జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు సూచించారు. అందుకు ఆమె...అది అవార్డు పొందిన ప్రాజెక్టు అని, అనేక రాష్ట్రాలు దీనిని ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయని వివరించారు. అయినా సంతృప్తి చెందని విజయసాయిరెడ్డి ప్రాజెక్టు వల్ల జీవీఎంసీకి ఆదా అయ్యే విద్యుత్‌ నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని, దానిని తరలించే అవకాశాలు పరిశీలించాలంటూ చర్చను ముగించారు. దీంతో ప్రాజెక్టు భవితపై నీలినీడలు కమ్ముకున్నాయి. సోలార్‌ ప్యానళ్లను ఏక్షణమైనా తరలించాలంటూ ఆదేశాలు వెలువడే అవకాశం లేకపోలేదని జీవీఎంసీ అధికారులే చెబుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.