మహా జోరుకు అడ్డంకులు

ABN , First Publish Date - 2022-05-24T07:04:47+05:30 IST

ఏదోరూపంలో మహానాడు జయప్రదం కాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు ప్రారంభించిన ప్రభుత్వం అదే పంధాను కొనసాగిస్తోంది.

మహా జోరుకు అడ్డంకులు
మండవవారిపాలెం వద్ద సిద్ధమవుతున్న మహానాడు వేదిక

ఆర్టీసీ బస్సులకు బ్రేక్‌

విద్యాసంస్థలకు హెచ్చరిక 

అద్దె వాహనదారులకు అధికారుల బెదిరింపులు 

సన్నాహక సమావేశాలకు భారీ స్పందనతో  ప్రభుత్వం కుయుక్తులు 

బస్సులు ఇవ్వలేమని  తేల్చిచెప్పిన కనిగిరి డీఎం 

ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి 

అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న రవాణా శాఖ అధికారులు 

ఇంటెలిజెన్స్‌,  ఎస్‌బీ సమాచారంతో ప్రభుత్వం బెంబేలు

ఏదోరూపంలో మహానాడు జయప్రదం కాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు ప్రారంభించిన ప్రభుత్వం అదే పంధాను కొనసాగిస్తోంది. తొలుత మినీస్టేడియాన్ని లీజుకు ఇవ్వడానికి నిరాకరించగా, తాజాగా మహానాడుకు తరలి వచ్చే ప్రజల కోసం వాహనాలు లేకుండా ట్రావెల్స్‌, ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా నిరోధించింది. విద్యాసంస్థల బస్సులతోపాటు ప్రైవేటు బస్సులను, చివరికి జీపులు, కార్లు, మినీవ్యాన్లు కూడా టీడీపీ వారికి అద్దెకు ఇవ్వకుండా రవాణాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత రెండు, మూడురోజులుగా మహానాడు బహిరంగసభకు కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు జిల్లావ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ సమావేశాలకు వస్తున్న స్పందనతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మహానాడుకు తరలివచ్చేందుకు భారీగా ప్రజలు సన్నద్ధమవుతున్నారని ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ అధికారులు ఇచ్చిన నివేదికతో ప్రభుత్వం అడ్డంకుల పర్వానికి తెరతీసినట్లు సమాచారం.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరుని తీవ్రతరం చేసే దిశగా ఒంగోలులో జరిగే మహానాడులో నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. అంతేగాక ఇది 40వ మహానాడు కావటం అంతకుమించి దివంగత ఎన్టీఆర్‌ శతజయంతిని ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాలకు ఈ మహానాడులోనే శ్రీకారం పలకనున్నారు. ఈనేపథ్యంలో 27, 28తేదీల్లో మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. అంతకుమించి గత ఎన్నికల్లో జగన్‌ గాలిని తట్టుకుని కూడా ఉమ్మడి ప్రకాశంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. తదనంతరం వారంతా సమష్టిగా పనిచేయడంలోను, ప్రజాసమస్యలపై పోరు జరపటంలోనూ ముందున్నారు. దీంతో మహానాడు నిర్వహణపై ప్రభుత్వం కూడా ఆరంభం నుంచి ప్రత్యేక దృష్టిసారించింది. మహానాడు నిర్వహణకు రాష్ట్రస్థాయిలో వస్తున్న స్పందన, ప్రచారాన్ని తట్టుకునేందుకు అదే సమయంలో బస్సుయాత్రలకు అధికారపార్టీ శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. 


శ్రేణుల నుంచి భారీ స్పందన

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ నాయకత్వం మొత్తం సమష్టిగా మహానాడు జయప్రదానికి ముందడుగు వేస్తోంది. మినీస్టేడియాన్ని లీజుకివ్వటానికి నిరాకరించినా బెదరకుండా మండవవారిపాలెం రైతుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు ప్రతినిధుల సభ అలా ఉంచితే రెండవరోజు జరిగే బహిరంగసభకు జన సమీకరణకు రెండు రోజుల నుంచి ఆ పార్టీ నాయకులు శ్రీకారం పలికారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఎవరికి వారు వ్యూహాత్మకంగా సన్నాహాక సమావేశాలు ప్రారంభించారు. ఉదయం సమాచారమిచ్చి సమావేశం జరిపినా అన్నిచోట్ల గ్రామ స్థాయి నుంచి నాయకులు తరలివస్తున్నారు. అంతేగాక ఎవరికి వారు తమ గ్రామం నుంచి తమ మండలం నుంచి స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు మహానాడుకు తరలివచ్చే ఏర్పాట్లు చేసుకున్నారని ప్రకటిస్తున్నారు. సోమవారం పర్చూరు, కనిగిరిల్లో జరిగిన సన్నాహాక సమావేశాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నిర్వహించిన సమావేశానికి పార్టీశ్రేణులు తండోపతండాలుగా తరలి వచ్చారు. కనిగిరిలో ఇప్పటికే ఊరూరా తిరిగిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కనిగిరిలో సన్నాహాక సమావేశం ఏర్పాటుచేస్తే నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి కూడా ఆ పార్టీశ్రేణులు  భారీగా తరలిరావటం విశేషం.

 

ఒంగోలులో ఇంటింటికీ మహానాడు ఆహ్వానం

ఒంగోలులో దామచర్ల జనార్దన్‌ అయితే ఇంటింటికీ పార్టీ కార్యకర్తలను పంపి మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానిస్తుండగా వారంతా స్వచ్ఛందంగా తరలివస్తామని చెప్పటం విశేషం. మార్కాపురం ఇన్‌చార్జి నారాయణరెడ్డి అమెరికాలో ఉన్నా సోమవారం జరిగిన సన్నాహాక సమావేశంలో మండల, గ్రామస్థాయి నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయం ద్వారా పార్టీ నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువగా అక్కడి నుంచి తరలివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దర్శిలో ఇన్‌చార్జ్‌ రమేష్‌ గ్రామాలవారీ నాయకులతో సమావేశాలు జరుపుతూ సమీకరణకు శ్రీకారం పలికారు. చీరాలలో కొత్తగా వచ్చిన ఎంఎం.కొండయ్య  సన్నాహక సమావేశం నిర్వహిస్తే ప్రతి వార్డు, గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి మేమున్నామంటూ భరోసా ఇవ్వటం విశేషం. ఇలా అన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు ఆయా వర్గాలలో సామాన్యప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రభుత్వంలో కలవరానికి కారణమైంది. 


అన్నిచోట్లా సన్నాహక సమావేశాలు

కొండపిలో ఎమ్మెల్యే స్వామి, పార్టీ నేత సత్యలు ఒకరోజు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి సోమవారం నుంచి మండలస్థాయి సమావేశాలకు శ్రీకారం పలికారు. అద్దంకిలో ఎమ్మెల్యే రవికుమార్‌ గత రెండురోజుల నుంచి మండలాల వారీ కీలకగ్రామాలకు వెళ్లి అక్కడకు ప్రతి గ్రామం నుంచి ముఖ్య నాయకులు రావటం, ఎవరికి వారు స్వచ్ఛందంగానే తరలివస్తామని వాగ్దానాలు చేయటం జరుగు తోంది. కొత్తగా కందుకూరు బాధ్యతలు తీసుకున్న ఇంటూరి నాగేశ్వరరావు సమావేశం కందుకూరులో నిర్వహిస్తే  పెద్దఎత్తున ఈ సమావేశానికి తరలివచ్చారు. ఇక గిద్దలూరులో అశోక్‌రెడ్డి, వైపాలెంలో ఎరిక్షన్‌బాబు, ఎస్‌ఎన్‌పాడులో విజయ్‌కుమార్‌లు వ్యూహాత్మకంగా ఇటు పార్టీ కేడర్‌, అటు ప్రజలను కలిసి మహానాడు ప్రాధాన్యతను వివరించగా సానుకూల స్పందన వ్యక్తమైంది. 


సమాచారం ఇచ్చిన ఆ రెండు శాఖలు 

జిల్లాలో మహానాడు ఏర్పాట్లు, రెండవరోజు బహిరంగసభకు జనం నుంచి వస్తున్న సానుకూలతపై ఇంటెలిజెన్స్‌, ఎస్బీ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వానికి నచ్చని నివేదికలు ఇవ్వటం ఎందుకులే అని కొందరు అధికారులు భావించినా దర్శి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాస్తవాన్ని దాచిపెట్టి నివేదికలు ఇవ్వటంపై ఎస్పీ సీరియస్‌ అయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ సభకు భారీగా తరలిరాబోతున్నారని తెలియజేసినట్లు తెలిసింది. దీంతో మహానాడుకు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్న అంశాన్ని ఆ నివేదికలు తేటతెల్లం చేసినట్లు తెలుస్తోంది. 


అడ్డంకులలో రెండో పర్వం 

మహానాడు నిర్వహణకు అడ్డంకులు కల్పించటంలో రెండోపర్వానికి ప్రభుత్వం శ్రీకారం పలికింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 28వ తేదీ జరిగే బహిరంగసభకు ప్రజలు తరలివచ్చేందుకు వాహనాలు లేకుండా అడ్డంకులు సృష్టించటానికి శ్రీకారం పలికారు. ప్రైవేటు బస్సులకన్నా ఆర్టీసీ బస్సుల అద్దె అంతోఇంతో తక్కువ కాబట్టి ఆయా సందర్భాల్లో వివిధ పార్టీలే కాకుండా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు కూడా డబ్బు చెల్లించి బుక్‌ చేసుకోవటం ఓ పద్ధతిగా జరిగిపోతోంది. అంతెందుకు ఇటీవల ఒంగోలులో జరిగిన సీఎం సభకు డ్వాక్రా మహిళలను సమీకరించేందుకు ఆర్టీసీ బస్సులను భారీగానే వినియోగించారు. అందుకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను కేటాయించింది. కానీ ప్రస్తుతం టీడీపీ నాయకులు ముందుగానే అద్దె చెల్లిస్తామన్నా బస్సులను ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. కనిగిరి డీఎంకు మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అద్దె ముందుగానే చెల్లిస్తామని బస్సులు అద్దెకు ఇవ్వాలని ముందుగానే లేఖ పెట్టారు. అయితే డీఎం మేం బస్సులను ఇవ్వలేమని ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో ఉగ్ర అవసరమైతే న్యాయపోరాటం చేయాలన్న ఆలోచనతో బస్సులు ఇవ్వలేమని లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే లేఖ ఇచ్చే విషయంపై డీఎం తటపటాయిస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఒక్క ఆర్టీసీ బస్సును కూడా టీడీపీ వారికి లీజుకి ఇవ్వవద్దని ఆర్టీసీ యాజమాన్యం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. 


ప్రైవేటు వారికి బెదిరింపులు

ప్రైవేటు ట్రావెల్స్‌, విద్యాసంస్థల బస్సులను టీడీపీకి ఇవ్వకుం డా అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం రవాణాశా ఖ అధికారులు నేరుగా ట్రావెల్స్‌ వారికి, విద్యాసంస్థలకు ఫోన్‌చేసి బస్సులను  ఇవ్వవద్దని, కాదు కూడదని ఇస్తే ఏమి జరుగుతుందో మీకు తెలుసునంటూ హెచ్చరికలు జారీచేసినట్లు తెలిసింది. కాగా సోమవారం రాత్రి కొన్నిప్రాంతాల్లోని బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు ట్రావెల్స్‌ వారికి ఫోన్‌చేసి హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. కాదు కూడదని ఇస్తే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు తెలుసు, అది మీకూ తెలుసని వ్యా ఖ్యానించటం విశేషం. మార్కాపురంలో ఓ ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకుడు మా భృతిని దెబ్బతీస్తారా.. అని ఎదురుతిరగడంతో అతనిని మరింత బెదిరించినట్లు తెలిసింది. జనసమీకరణకు ఇలాంటి అడ్డంకులు ప్రారంభం కావటంతో టీడీపీ శ్రేణులు ఆయా ప్రాంతాల నుంచి ముందస్తు పాదయాత్రలు, ట్రాక్టర్లు, ఇతర ప్రత్యామ్నాయ వాహనాల్లో తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.




Updated Date - 2022-05-24T07:04:47+05:30 IST