సర్కారు తీరుతో అభివృద్ధికి విఘాతం

ABN , First Publish Date - 2021-08-03T05:51:35+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఖరితో అభివృద్ధి అడుగుంటిపోయిందని, పనులు చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

సర్కారు తీరుతో అభివృద్ధికి విఘాతం
మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు

ఉపాధి బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గం

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద

మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన


చోడవరం, ఆగస్టు 2: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఖరితో అభివృద్ధి అడుగుంటిపోయిందని, పనులు చేయడానికి కూడా  కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. ఉపాధి బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి పనులకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. బిల్లులు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయకుండా ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.125 కోట్ల బిల్లుల బకాయిలు ఉంటే, ఒక్క చోడవరం నియోజకవర్గంలోనే రూ.56 కోట్లు ఉన్నాయన్నారు. ఇన్ని కోట్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి 12 శాతం వడ్డీతో ఉపాధి బిల్లుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని బుద్ద హెచ్చరించారు. అనంతరం మండల పరిషత్‌ పరిపాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లునాయుడు, జట్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్య్సరాజు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మజ్జి గౌరీశంకర్‌, టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డేడ నాగగంగాధర్‌, నాలుగు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:51:35+05:30 IST