ltrScrptTheme3

కంచె...

Oct 26 2021 @ 00:30AM
డీఈవో కార్యాలయం సమీపంలో ఉన్న నీటిమునక ప్రాంతం

ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమణే 

ముళ్ల పొదలు తొలగించి కంచె వేస్తున్న వైనం 

ప్రైవేటు ఆస్తులను వదలరు 

కడపలో బరి తెగించిన భూమాఫియా

కడప, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కడపలో భూమాఫియా బరి తెగిస్తోంది. ఖాళీగా జానెడు జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. అది ప్రభుత్వ భూమా... ప్రైవేటు భూమా... అనే సంబంధం లేకుండా ఆ భూమికి కంచె వేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కడపలో ముళ్ల కంచె, స్తంభాలకు డిమాండ్‌ పెరిగినట్లు తెలుస్తోంది. అధికారం, మంది బలం ఉన్న భూమాఫియా భూఆక్రమణే ధ్యేయంగానే కొనసాగుతోంది. పెద్దోళ్లు వారసత్వంగా ఇచ్చిన ఆస్తో... తినో తినకో కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన స్థలమో... బతుకుదెరువు కోసం పేదల పేరిట ప్రభుత్వం ఇచ్చిన స్థలమో... ఇప్పుడు భూమాఫియా చేతిలోకిపోతోంది. ఆర్థిక స్థోమత, శివారు ప్రాంతాలు అయిన కారణంతో సొంత భూములు ఉన్నా కొందరు, నిర్మాణం, సాగు చేయకుండా అలా వదిలేశారు. ఇటీవల భూముల ధరలకు రెక ్కలొచ్చాయి. పంట భూముల్లో సిరుల సంగతేమో కాని కడప శివారులో ఎకరం ఉంటే అతను కోటీశ్వరుడే. మరీ ముఖ్యంగా రింగ్‌ రోడ్డు చుట్టూ రోడ్డు సైడు భూములుంటే అది భూకైలాసే. ఎందుకంటే అక్కడ ఎకరం కనీసం రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు పలుకుతుంది. పరిశ్రమలు వస్తున్నాయంటూ రియల్లర్ల ప్రచారం, సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్న అభిలాష మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎక్కువైంది. ఇదే భూమి విలువకు రెక్కలు వచ్చేలా చేసింది. ఎక్కడెక్కడ ఖాళీగా స్థలాలు ఉన్నాయో గుర్తించి వాటి యజమానుల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని కదనరంగంలోకి దిగేస్తున్నారు కబ్జాదారులు. బలహీనుడైతే చాలు వెంటనే ఆ భూమిలో కంచె వేసేస్తున్నారు. ఈ  భూమి మాది మా పూర్వీకుల నుంచి సంక్రమించింది. లేకుంటే ఫలానా వారి నుంచి కొనుగోలు చేశామంటూ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. పంచాయితీకి వస్తే ఆ స్థలానికి త్రుణమో, ఫణమో యజమానికి ఇచ్చేస్తున్నారు. మరీ కాస్త బలవంతుడైతే ఆ స్థలం విలువను బట్టి కనీసం అర కోటికి పైగానే సెటిల్‌ మెంట్‌ రూపంలో వసూలు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. పేరున్న నేతల పేర్లు చెప్పి మాఫియా పేదల కడుపు కొడుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ముఖ్య నేతలకే ఆ మాఫియా అనుచరవర్గంగా ఉండడంతో పెద్ద పెద్ద కుటుంబాలు వారి దాష్టీకానికి తలవంచుతున్నట్లు చెబుతున్నారు. 

ప్రస్తుతం కడపలో భూమాఫియా ఆగడాలకు చిన్నచౌకు రెవెన్యూ పొలం అడ్డాగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ విలువలైన భూములు ఉన్నాయి. రింగ్‌ రోడ్డు ఉండడం... వాణిజ్య సంస్థలు ఇక్కడ విపరీతంగా వెలుస్తుండడంతో భూమికి డిమాండ్‌ ఏర్పడింది. వైఎ్‌సఆర్‌ సర్కిల్‌ నుంచి ఆలంఖానపల్లె వెళ్లే రోడ్డు, అప్సర నుంచి రాజంపేట వెళ్లే రోడ్డు భూదందాలకు నిలయంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇక్కడ ప్రైవేటు భూముల ఆక్రమణ విచ్చలవిడిగా సాగుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఓ చనిపోయిన మహిళ పేరుతో డాక్యుమెంట్లు సృష్టించి ఆ మహిళ తమకు అమ్మినట్లు ఆ పత్రాలతో భూఆక్రమణ చేసి కంచె వేస్తుండడం కడపలో  హాట్‌టాపిక్‌గా మారింది.  ఓ ముఖ్య నేత పేరు చెప్పి భూదందాకు ఆ గ్యాంగ్‌ తెరలేపుతున్నట్లు తెలుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల భూఆక్రమణల్లో ఘర్షణలు పడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఆలంఖానపల్లె-రాజంపేట బైపాస్‌ రోడ్డులో ఓ వాణిజ్య సముదాయం సమీపంలో ఓ మూడు సర్వే నెంబర్లలో సుమారు రెండు ఎకరాల భూమి ఉంది. ఇది పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అక్కడ ప్రస్తుతం ఎకరా రూ.10 కోట్ల నుంచి 15 కోట్లు పలుకుతోంది. ఈ భూమిని కాజేయాలన్న ఉద్దేశంతో ఓ ముఠా ఆ భూమి యజమానుల గురించి ఆరా తీసి వారు బలహీనులు కావడంతో ఓ చనిపోయిన మహిళ ఆ భూమి అమ్మిందంటూ ఈ భూమి మాదేనంటూ కంచె వేయడం ఇప్పుడు కడపలో హాట్‌టాపిక్‌గా మారింది. మా కుటుంబ సభ్యులు ఎవరూ భూమి అమ్మలేదంటూ చనిపోయిన కుటుంబీకులు పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఆ భూమిని కాజేయాలని ఆ ముఠా బెదిరింపులకు సైతం వెనుకాడడం లేదని తెలుస్తోంది. అదే ప్రాంతంలో ఆలయం వద్ద భూఆక్రమణ కోసం ప్రయత్నించగా ఇరువర్గాలు గొడవలు పడినట్లు సమాచారం. 


నీటి మునక స్థలంపై కన్నేశారు

నూతన కలెక్టరేట్‌ నుంచి రిమ్స్‌కు వెళ్లే రహదారిని ఇటీవల అభివృద్ధి చేశారు. కలెక్టరేట్‌ రాకతోనే ఈ ప్రాంతంలో స్థలాలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రకా్‌షనగర్‌, ఎస్టేట్‌ ప్రాంతాల్లో స్థలాల ధరలు భారీగా పెరిగాయి. దీనినే కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. డీఈవో కార్యాలయం సమీపంలో నీటి మునక భూమి ఉంది. ఇక్కడ కొంత భూమిపై వివాదం నడుస్తోంది. నిబంధనల ప్రకారం నీటి మునక భూమిలో నివాస గృహాలు, నివాసేతర భవనాల నిర్మాణానికి అనుమతివ్వరు. అయితే ఇక్కడ ఓ ఇద్దరు సుమారు 30 సెంట్ల స్థలంపై కన్నేసి కాజేసే ప్రయత్నం జరుగుతోన్నట్లు తెలుస్తోంది. 30 సెంట్ల స్థలాన్ని అక్రమించేసి మూడు సెంట్ల చొప్పున పట్టా సృష్టించి ప్లాట్‌ రూ.15 లక్షలకు విక్రయించేందుకు బేరం పెట్టినట్లు తెలుస్తోంది. 


నీటిమునక ప్రాంతాల్లో పట్టాలివ్వము

- శివరామిరెడ్డి, తహసీల్దార్‌, కడప

ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి కడప తహసీల్దార్‌ శివరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నీటి మునక ప్రాంతాల్లో ఎవరికీ పట్టాలు ఇవ్వమని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలిపారు. ఎవరైనా ఆ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.